తెలంగాణలో బీజేపీకి 'రాజా' ఒక్కడే.!

ఒక్కడు.. ఒకే ఒక్కడు.. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిథ్యం వహించబోయేది రాజాసింగ్‌ మాత్రమే. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్‌, ఇంకోసారి గెలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజా సింగ్‌ అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. తెలుగు సినీ పరిశ్రమపై ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడీయన. ఓ దశలో అనేక వివాదాల కారణంగా బీజేపీ, రాజాసింగ్‌ని బయటకు పంపేందుకూ ఆలోచన చేసింది. 

కానీ, రాజా సింగ్‌ గెలిచాడు. అలా ఇలా కాదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన హేమాహేమీలంతా ఓడిపోయినా, రాజా సింగ్‌ మాత్రం గెలిచి సత్తా చాటాడు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ సైతం ఓటమి పాలయ్యారు. చిత్రమేంటంటే, బీజేపీకి తెలంగాణలో అస్సలేమాత్రం బలం లేకపోయినా.. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసింది. 

2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. అయితే, టీడీపీతో పొత్తు లేకపోతే ఇంకా ఎక్కువ గెలిచేవాళ్ళమని బీజేపీ నేతలు చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నేతలు అలా మాట్లాడేందుకు వీల్లేని పరిస్థితి. అఫ్‌కోర్స్‌, బీజేపీని కాదని కాంగ్రెస్‌తో అంటకాగిన టీడీపీ, ఈసారి 2 సీట్లకే పరిమితమయ్యిందనుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, తెలంగాణ కమలదళానికి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కిందన్నమాట. ఆయనే ఇకపై తెలంగాణలో బీజేపీకి పెద్ద దిక్కు కాబోతున్నారు. ఎందుకంటే, ఇంకో ప్రజా ప్రతినిథి బండారు దత్తాత్రేయ పదవీ కాలం అతి త్వరలో ముగియనుంది. ఈయన లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే. తెలంగాణలో పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక కిషన్‌రెడ్డి కావొచ్చు, లక్ష్మణ్‌ కావొచ్చు.. పార్టీలో మాత్రం తమ ఉనికిని ఎలా చాటుకోగలరు.?

Show comments