తెలంగాణ హెల్త్ మినిస్టర్  సీఎస్ సోమేశ్ కుమార్ 

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను పదవి నుంచి తీసేశాక ఈ కీలకమైన పదవి ఎవరికీ ఇస్తారబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వెంటనే దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్  తన చేతుల్లోకి తీసుకున్నారు. కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న దశలో కేసీఆర్ ఈటల రాజేందర్ ను ఉన్న పళంగా పీకేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలకు సీఎం కేసీఆర్ ఫ్రీ హ్యాండ్ అంటే స్వేచ్ఛ ఇవ్వలేదని కొందరు అన్నారు.

సరే ... ఇచ్చారో ఇవ్వలేదో సరిగా తెలియదుగాని మొత్తమ్మీద వైద్య ఆరోగ్య మంత్రి ఒకాయన ఉన్నాడనే భరోసా ప్రజలకు ఉండేది. ఈటల ప్రతిరోజూ మీడియాలో కనబడేవాడు. కరోనా పైన ఏదో ఒకటి మాట్లాడేవాడు. ఆస్పత్రులకు పోయేవాడు. అక్కడ అన్నీ పరిశీలించేవాడు. డాక్టర్లతో మాట్లాడేవాడు. కరోనాపై ప్రజలకు ధైర్యం నూరిపోసేవాడు. మొత్తమ్మీద ఏదో పెద్ద దిక్కుగా ఉండేవాడు. కానీ కేసీఆర్ కు ఇదేమీ పట్టలేదు. మంచి పీక్ టైంలో ఈటలను పీకేశారు. ఆ శాఖను తాను తీసుకున్నారు.

కానీ ఈటల మాదిరిగా తాను ఆస్పత్రులకు పోలేరు. పరిశీలించలేరు. రోజూ సమీక్షా సమావేశాలు పెట్టలేరు. ఈటలను పీకడానికి ముందే సీఎంకు కరోనా వచ్చి ఇరవై రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నారు. మొత్తం బాగైందని డాక్టర్లు చెప్పాక హెల్త్ డిపార్ట్ మెంట్ తీసుకున్నారు. ఈటల తిరిగినట్లుగా ఆయన ఎలాగూ తిరగలేడు కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు మొత్తం బాధ్యత అప్పగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటేనే  ఊపిరి సలపని పని ఉంటుంది. అన్ని శాఖలకు ఆయనే హెడ్ కదా.

ఈ పరిస్థితిలో ఈటల బాధ్యత మొత్తం ఆయన మీద పెట్టారు. ప్రస్తుత కరోనా  సమయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖను చూసుకోవడమే సరిపోతోంది. ఆస్పత్రులకు వెళుతున్నారు. రివ్యూ మీటింగులు పెడుతున్నారు. ఆ పని చేయండి ...ఈ పని చేయండని ఆదేశాలు ఇస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖను చూసుకోవడం సోమేశ్ కుమార్ కు అదనపు బాధ్యత. ఇక కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఎప్పుడు చేస్తారో తెలియదు. ఆ పని చేయాలంటే ఆయన అనేక లెక్కలు, గణాంకాలు చూసుకోవాలి.

ఈటలను తొలగించిన నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ మాజీమంత్రి అవినీతిని బయటకు తీయడంలో బిజీగా ఉన్నారు. కరోనా సమయంలో దేవరయాంజాల్ భూముల సర్వే నీకు ప్రధానమా అని కోర్టు కూడా ప్రశ్నించింది. ఈటలను తొలగించిన వెంటనే ఆ శాఖకు ఎవరో ఒకరిని మంత్రిగా నియమిస్తే సరిపోయేది. మిగిలిన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తరువాత చూసుకోవచ్చు. కానీ కేసీఆర్ ఇప్పట్లో ఆ పని చేసేలా కనబడటంలేదు. ముందు రాజకీయ ప్రయోజనాలు. తరువాతే ప్రజల ఆరోగ్యం. 

Show comments