టీడీపీ, కాంగ్రెస్‌ కలిశాయి.. కమ్మ, రెడ్డి కలుస్తారా!

ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవడం, తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీల పొత్తు ఖరారు కావడం వంటి అంశాలు తెలంగాణ ఎన్నికల రంగంలో కలకలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ముప్పై ఐదేళ్లపాటు ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. అంతేకాదు ఆ రెండు పార్టీలు రెండు ప్రధాన సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం వహించే విధంగా రాజకీయాలు సాగాయి. కులాలకు అతీతంగా కొన్ని ఎన్నికలు జరగకపోలేదు. కాని గత రెండు దశాబ్దాలుగా పరిస్థితులు మారాయి.

ఉమ్మడి రాష్ట్రంలోని రాజకీయాలకు విభిన్నంగా విభజన తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారాయి. తెలంగాణ ఉద్యమం, ఉద్యమ నేతగా కేసీఆర్‌ వాగ్దాటి, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు, సుడిగాలి మాదిరి కేసీఆర్‌ ప్రచారం కారణంగా, ప్రజలలో ఆయన నాయకత్వం పట్ల ఒక నమ్మకం ఏర్పడి 2014లో టీఆర్‌ఎస్‌ విజయానికి బాటలు పడ్డాయి. అంతేకాక అప్పట్లో ఒకమాట అనేవారు. ఏఐసీసీ కాంగ్రెస్‌కు సహజ సిద్దంగా ఉన్న రెడ్డి నాయకత్వాన్ని వదలుకోవడం కూడా నష్టం చేసిందని చెప్పేవారు.

ఆ కారణం కాని, మరే కారణంతోనో ఎన్నికలలో ఓటమి తర్వాత బీసీ నేతను తొలగించి ఉత్తంకుమార్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గత ఎన్నికలలో మొత్తం నలభై రెండు మంది రెడ్డినేతలు వివిధ పార్టీల తరపున గెలిస్తే, టీఆర్‌ఎస్‌ పక్షాన అత్యధికంగా  ఇరవై మంది, కాంగ్రెస్‌ పక్షాన పదమూడు మందే గెలిచారు. తెలంగాణ ప్రాంతంలో వారి ప్రభావం ఎంత ఉందన్నది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

గతంలో జరిగిన ఎన్నికలన్నిటిలో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. కాగా తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో కులాలకు అతీతంగా ఈ ఎన్నిక జరిగిందన్న భావన ఏర్పడుతుంది. అయితే ఆ తర్వాత కాలంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గాన్ని సమీకరించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ క్రమంలో ఒక టీవీ చానల్‌లో జరిగిన చర్చ కూడా దానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఒకదశలో కాంగ్రెస్‌ను, రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్‌ టీడీపీకి బలమైన అండగా ఉండే కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించే పనిలో పడ్డారని కూడా ప్రచారం జరిగేది.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్‌ రెడ్డి వెలమ ప్లస్‌ కమ్మ వెల్‌కమ్‌ గ్రూప్‌ అని ప్రచారం చేసేవారు. కాని అది జరగలేదు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం, తదుపరి కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు కుదరడంతో అదికాస్త కామ్రెడ్‌ గ్రూప్‌గా మారే పరిస్థితి ఏర్పడింది. అంటే కమ్మ ప్లస్‌ రెడ్డి అని అంటారు. కాని రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సామాజిక వర్గాల పోటీ నేపధ్యంలో ఈ రెండు కులాల ఓటర్లు పూర్తిగా కలిసిపోయే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానం ఇప్పుడు ఏర్పడుతోంది.

ఒకదశలో కేసీఆర్‌ నాయకత్వాన్ని దెబ్బకొట్టడానికి రెడ్డివర్గం అంతా ఒకటి అవ్వాలని పెద్ద పెద్ద సభలు కూడా జరిగాయి. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో రెడ్డి వర్గానికి షాక్‌గా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఇంతకాలం నువ్వా, నేనా అన్నట్లుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు ఒకటిగా పనిచేయడం ఎంతవరకు సాధ్యమన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ బలం బాగా తగ్గిపోయినా, చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలో ఉండడం, ఆయన వ్యాపార ప్రయోజనాలన్నీ తెలంగాణలో ఉండడం వంటి కారణాలతో తెలంగాణలో కాంగ్రెస్‌పై పెత్తనం చేయడానికి ఆయన వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకున్నారన్న అభిప్రాయం ఏర్పడింది.

కాంగ్రెస్‌, టీడీపీలు కలిసినా, అదే ప్రకారం సామాజిక సమీకరణలు మారతాయా? సగటు కాంగ్రెస్‌ అభిమాని అనండి.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే సామాజికవర్గం వారు అనండి.. దీనిని జీర్ణించుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వస్తోంది. అందుకే గాంధీభవన్‌కు కొంతమంది కాంగ్రెస్‌ అభిమానులు వచ్చి ఇదెక్కడి ఖర్మ.. చంద్రబాబుకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో పైకి బింకంగా ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలలో ఒక రకమైన భయం ఏర్పడిందని చెబుతున్నారు.

కొన్ని నియోజకవర్గాలలో కోస్తా నుంచి వచ్చి సెటిల్‌ అయిన కమ్మ సామాజికవర్గం గణనీయంగానే ఉన్నా, వారు కొంతమేర కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినా, నిజమైన టీడీపీ అభిమానులు మద్దతు ఇస్తారా అన్న ప్రశ్న కూడా వస్తోంది. అంతేకాదు.. ఏపీ రాజకీయాల ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని బావిస్తున్నారు. అక్కడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, జనసేల పార్టీలు టీడీపీకి ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్‌ అయినవారు కొంతమంది టీడీపీకి మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు ఉపయోగపడాలా అని ఆలోచనలో పడ్డాయని అంటున్నారు.

అంతకు ముందు వరకు టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత పెంచుకున్న రెడ్డి సామాజికవర్గంలో సైతం పునరాలోచన ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. గతంలో కేసీఆర్‌ పైన, టీఆర్‌ఎస్‌ పైన ఉన్నంత వ్యతిరేకత ఇప్పుడు తగ్గుతోందా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. తమకు ప్రధాన శత్రువు కేసీఆరా? చంద్రబాబా అన్న మీమాంస ఏర్పడి, చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అంశంగా మారుతోందని కొందరి అభిప్రాయం.

అదే సమయలో కేసీఆర్‌ కూడా రెడ్డి సామాజికవర్గానికి అత్యధికంగా పదవులు ఇవ్వడం, వారికి రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు ఆ వర్గాన్ని ఎలా దూరం పెట్టారన్న విషయం కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల మద్య నువ్వా, నేనా అన్న పరిస్థితి ఏర్పడవలసి ఉండగా, టీడీపీతో పొత్తు తర్వాత అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయం కాంగ్రెస్‌లో ఏర్పడిందన్న వాదన కూడా లేకపోలేదు.

అయితే హైదరాబాద్‌ నగరం, శివారులలో కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ పొత్తు ఉపయోగపడుతుందని, అంతేకాక, చంద్రబాబు నుంచి అందే ఆర్థిక సహకారం పార్టీకి ఉపయోగపడుతుందని నమ్మేవారు కూడా లేకపోలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతమంది ప్రముఖులకు ఈ పొత్తు ఇష్టంలేదు. అయినా రాహుల్‌ గాంధీ స్థాయిలో చంద్రబాబు మేనేజ్‌ చేసుకున్న తర్వాత తాము చేయగలిగింది ఏముందని వారు నిర్వేదం చెందుతున్నారు.

ఎన్నికలలో పోటీచేసినప్పుడు తాము ఇంతకాలం తీవ్రంగా విమర్శించిన చంద్రబాబును సమర్ధించక తప్పదన్న భావనకు కొందరు వచ్చారు. ఏఐసీసీ స్థాయిలో నిర్ణయం తీసుకుని తమపై రుద్దారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తుంటే, తెలంగాణ టీడీపీ నేతలు కొందరు మాత్రం కాంగ్రెస్‌ అండతో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం వస్తుందని సంతోషపడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ల మద్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.

పదవులు ఆశించే నాయకులు ఎలాగొలా సర్దుకున్నా, కిందిస్థాయిలో ఉన్న రెండు పార్టీల క్యాడర్‌ కాని, అలాగే రెండు సామాజికవర్గాలు కాని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది సందేహమే. అవకాశవాద రాజకీయ సమీకరణలు అవకాశవాద సామాజిక సమీకరణలుగా మారతాయా? లేదా అన్నది కాలమే తేల్చాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments