ఆర్కే ఇంట‌ర్వ్యూ...క‌య్యానికి సై!

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌యోధ్య కాదు, యుద్ధానికి సై అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆర్కేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలంగాణ స‌ర్కార్‌ను త‌మిళిసై మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌ను రెచ్చ‌గొట్టే క్ర‌మంలో అంతా వ్యూహాత్మ‌కంగా ఈ ఇంట‌ర్వ్యూను ప్లాన్ చేశార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తాను రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్నాన‌ని, కేసీఆర్‌ స్వయంగా వచ్చి మాట్లాడాల్సిందే అని త‌మిళిసై ఆదేశిస్తున్న‌ట్టు మాట్లాడ్డం దేనికి సంకేతం? అని తెలంగాణ అధికార పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా ప్ర‌తి ప్ర‌శ్న‌, స‌మాధానం రెండూ కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను క‌వ్వించేలా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  
 
"తమిళనాడులో నేను ఇసై.. తెలంగాణలో సై" అని అన‌డం ద్వారా గ‌వ‌ర్న‌ర్  ఎవరికి సై విసురుతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. "నేను ఎన్నికల్లో గెలవలేదని కొంత మంది తెలంగాణ మంత్రులు కూడా విమర్శిస్తున్నారు. నేను మా తండ్రి పలుకుబడి ద్వారా రాజకీయాల్లోకి రాలేదు. నేరుగా విదేశాల నుంచి వచ్చి రాజకీయాల్లోకి ప్రవేశించలేదు " అని ప‌రోక్షంగా కేటీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ మాట‌లు ముమ్మాటికీ కేసీఆర్‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మే అంటున్నారు.
       
"ముమ్మాటికీ నేను కేంద్ర ప్రభుత్వం మనిషినే. ప్రధానమంత్రి అభిమానినే. నా చాలా ప్రసంగాల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాను. గవర్నర్‌ స్థానాన్ని అవమానిస్తే మాత్రం సహించను" అని గ‌వ‌ర్న‌ర్ వార్నింగ్ ఇచ్చారు. ఒక వైపు తాను బీజేపీ మ‌నిషిని కాదంటూనే, ప్ర‌ధాని మోదీ అభిమాని అని విధేయ‌త‌ను చాటుకున్నారు. మ‌రీ ముఖ్యంగా ఒకవేళ త‌న‌పై రాళ్లు రువ్వితే, రక్తం చిందితే.. ఆ రక్తంలో పెన్నును తడిపి చరిత్రను రాస్తానని తెలంగాణ స‌ర్కార్‌కు తీవ్ర‌స్థాయిలో గ‌వ‌ర్న‌ర్ హెచ్చ‌రిక పంపారు. 

కేసీఆర్ స‌ర్కార్‌తో గొడ‌వ‌కు ఈ ఇంట‌ర్వ్యూ మ‌రింత ఆజ్యం పోసిన‌ట్టుగా వుంది. ఆర్కే ల‌క్ష్యం నెర‌వేరింది. ఇలా అనేక కోణాల్లో కేసీఆర్‌పై త‌మిళిసై ఆర్కే ఇంట‌ర్వ్యూ ద్వారా క‌య్యానికి కాలు దువ్వారు. గ‌వ‌ర్న‌ర్ తాజా హెచ్చ‌రిక‌ల‌పై కేసీఆర్ స‌ర్కార్‌, టీఆర్ఎస్ శ్రేణుల స్పంద‌నపై ఉత్కంఠ నెల‌కుంది. 

Show comments