లాభాల్లో 70శాతం ఇవ్వమంటున్న హీరో!

సినిమా వ్యాపారం వందల కోట్లకు పడగలు ఎత్తుతోంది.. జనాల్లో సినిమా పట్ల మారిన ధోరణి. భారీగా పెరిగిన టికెట్ల ధరలు.. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే జనం క్రమక్రమంగా ఎక్కువవుతుండటం.. వంటి కారణాలతో సినిమా వ్యాపారం చాలా ఈజీగా వందల కోట్ల రూపాయలకు చేరిపోతోంది. ప్రత్యేకించి స్టార్ హీరోల సినిమాలు. వందల కోట్ల రూపాయలను ఒడిసి పట్టడం వాటికి చిటికెలో పనైపోయింది.

మరి ఇలా తమ సినిమాలు భారీ వ్యాపారం చేస్తుండే సరికి.. హీరోల ధోరణి కూడా మారిపోయింది. తమ సినిమా కేవలం తమ పేరు మీదే మార్కెట్ అవుతోంది అనే విషయాన్ని గ్రహించి.. ఒక్కోరు ఒక్కో విధంగా ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకొంటున్నారు. కొందరు సొంత వాళ్లను నిర్మాతలుగా పెట్టుకుని, కొందరు తమే స్వయంగా నిర్మాతలుగా మారిపోయి, మరికొందరు రెమ్యూనరేషన్ కింద డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసేసుకుని.. ఇలా తలా ఒకరకంగా లాభపడుతున్నారు. 
నిర్మొహమాటంగా వ్యవహరిస్తూ హీరోలు కోట్లు పోగేసుకుంటున్నారు. సినిమా తీస్తే లాభం వస్తుందో,నష్టం వస్తుందో అది నిర్మాత టెన్షన్.. హీరోకి మాత్రం కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఈ పరంపరలో ముందున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. హిట్టూఫ్లాఫు నిమిత్తం లేకుండా సల్మాన్ సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ హీరో అత్యంత భారీ పారితోషకాన్ని అడుగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.

‘రేస్ 3’ సినిమాలో నటించడానికి సల్మాన్ అత్యంత భారీ పారితోషకాన్ని అడుగుతున్నట్టు సమాచారం. ఆ సినిమా లాభాల్లో ఏకంగా 70శాతం వాటాను పారితోషకంగా అడుగుతున్నాడట సల్లూ! ఇంత వరకూ ఈ స్థాయిలో పారితోషకం అడిగిన హీరో కానీ, తీసుకున్న హీరో కానీ ఎవరూ లేరు. దంగల్ సినిమాకు ఆమిర్ ఖాన్ లాభాల్లో వాటా తీసుకున్నాడని అంటారు. అయితే అది మరీ ఇంత శాతం కాదు. ఏకంగా డెబ్బై శాతం లాభాలు హీరో రెమ్యూనరేషన్ కింద వెళ్లడం అంటే అది సంచలనమే. వ్యయప్రయాసాలకు ఓర్చే నిర్మాతలు పది రూపాయల లాభంలో మూడు రూపాయలకే పరిమితం.

ఒకవేళ లాభాలు రాకపోతే.. వాళ్లే మొత్తంగా మునగాలనమట. అయితే సల్మాన్ గత సినిమా ‘ట్యూబ్ లైట్’కు భారీ నష్టాలు వచ్చాయి. అది సల్లూ హోం ప్రొడక్షన్లో రూపొందింది. దీంతో.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తాన్ని రీఫండ్ చేశాడు. ఏకంగా 50కోట్ల రూపాయల డబ్బును వెనక్కు ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు. అది హోం ప్రొడక్షన్ కాబట్టి సల్లూ ఆ విధంగా చేయగలిగాడు. మరి ఇప్పుడు కూడా సల్మాన్ ప్రతిపాదన బాగుందనే చెప్పాలి. లాభాలు వస్తే మాత్రమే హీరోకి రెమ్యూనరేషన్ లేకపోతే లేదు.. అయినప్పటికీ 70శాతం అంటే ఎక్కువ అనేది ట్రేడ్ పండిట్ల మాట.

Show comments