రెండు సీట్లిచ్చి 16 లాక్కునే ఐడియా

జ‌నసేన బలంగా వుంది అనుకుంటున్న జిల్లాల్లో ఈస్ట్ గోదావరి పేరు లిస్ట్ లో ఫస్ట్ న వుంటుంది. బహుశా అందుకే కావచ్చు. ఈసారి గెలుపు గ్యారంటీ కావడం కోసం పవన్ కళ్యాణ్ కాకినాడ నియోజ‌కవర్గాన్ని ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎవరైనా సరే ఓడిన చోటే గెలవాలనుకుంటారు. పొగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నది సామెత. ఓడిన చోట నెగ్గితేనే ‘మెగా’తనం. కానీ పవన్ అలా అనుకుంటున్నట్లు లేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని సేఫ్ ప్లేస్ కోసం విశాఖ, వెస్ట్ గోదావరి. వదిలి ఈస్ట్, తిరుపతిలకు వలస వెళ్తున్నట్లు కనిపిస్తోంది. సరే అది వేరే సంగతి.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న పొలిటికల్ గ్యాసిప్ లు వింటుంటే కాస్త ఆశ్చర్యంగా వుంది. తెలుగుదేశం పార్టీతో జ‌త కట్టడం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని, అన్ని చోట్ల, విడిగా పోటీ చేసే శక్తి తనకు లేదని బాహాటంగా అంగీకరించారు జ‌నసేన అధిపతి పవన్ కళ్యాణ్. అందువల్ల తెలుగుదేశంతో పొత్తు అనివార్యం అనే క్లారిటీ వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు జ‌నసేనకు వదులుతుంది అన్న ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి. మహా అయితే పది..పదిహేను స్థానాలు మించి జ‌నసేనకు తెలుగుదేశం ఇవ్వదు. అందులో సందేహం లేదు.

చంద్రబాబు రాజ‌కీయ ఎత్తుగడలు, చరిత్ర తెలిసిన వారంతా ఇదే అభిప్రాయానికి వస్తారు. సరే జ‌నసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న విషయం పక్కన పెడితే ఈస్ట్ గోదావరిలో పవన్ నాలుగు నుంచి అయిదు స్థానాలు అడుగుతున్నారని, కానీ చంద్రబాబు రెండే ఇచ్చే అవకాశం వుందని తెలుగుదేశం అనుకూల సామాజిక మీడియాలోనే వార్తలు వస్తున్నాయి.

ఒకటి కాదు, రెండు కాదు. 18 నియోజ‌కవర్గాలు వున్నాయి ఈస్ట్ గోదావరిలో. వీటిలో కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు, రాజ‌మండ్రి రూరల్ స్టానాలను జ‌నసేన కోరుకుంటోందని, కానీ కాకినాడ రూరల్, అమలాపురం లేదా రాజోలు మాత్రమే తెలుగుదేశం ఇవ్వాలనుకుంటోంది అన్నది మీడియా వార్తలు సారాంశం.

ఈస్ట్ గోదావరిలో బలంగా వున్న కాపు సామాజిక వర్గం జ‌నసేన అంటే అభిమానంతో ఉర్రూతలూగుతూ, ఉత్సాహంగా ఎన్నికల కోసం ఎదురుచూస్తూ వుండొచ్చు. కానీ ఇలా రెండు అంటే రెండు సీట్లు జ‌నసేనకు విదిలిస్తే, అదే మహద్భాగ్యం అని జ‌నసేన అంగీకరిస్తే, కాపు సామాజిక వర్గం ఎలా ఫీలవుతుంది. పవన్ మాదిరిగా అదే మహాప్రసాదం అని తెలుగుదేశం పార్టీకి తమ ఓట్లు అన్నీ గంపగుత్తగా వేసేస్తుంది. రెండు సీట్లు విదిల్చి 16 సీట్లు కొట్టేసే చంద్రబాబు చాణక్యానికి పడిపోతుందా?

ఈస్ట్ గోదావరిలో కాపులు, రిజ‌ర్వేషన్ సంగతి పక్కన వుంచితే అక్కడ అగ్రవర్ణం కిందే చలామణీ అవుతున్నారు. కాపులకు ఎస్సీలకు గొడవలు వస్తే మీడియాలో కాపులను అగ్రవర్ణం కిందే లెక్క వేసారు కానీ మరో విధంగా కాదు. అలా, ఈస్ట్ లో దశాబ్ధాల కాలంగా కాపులకు ఎస్సీలకు మధ్య వైరుధ్యాలు వున్నాయి. అలాగే కాపులకు..కమ్మవారికి మధ్య వైరుధ్యాలు వున్నాయి. ఇప్పుడు రెండు సీట్లు విదల్చడం ద్వారా కాపులు ఇవన్నీ మరిచిపోయి తెలుగుదేశం పార్టీకి మొత్తం ఓట్లు జ‌మేస్తారా? లేదా కాపులను దగ్గరకు తీసిన తెలుగుదేశం పార్టీని కాపు వ్యతిరేక కులాలు కూడా నెత్తిన పెట్టుకుంటాయా?

అసలు ఈ సంగతి అలా వుంచితే బలం వుందనుకున్న ఈస్ట్ లోనే జ‌నసేనకు రెండు స్థానాలు ఇస్తే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటి? జిల్లాకు ఒకటి రెండు స్థానాలు తీసుకుంటే జై జ‌నసేన అంటూ పవన్ నామ స్మరణ చేస్తున్న వారు ఎలా ఫీలవుతారు. పవన్ కోసం తెలుగుదేశం కాడి మోయాల్సిందేనా? మోస్తారా?

చూడాల్సిందే..ఈ గమ్మత్తయిన పరిణామాన్ని.

Show comments