అటు రొట్టెల పండగ, ఇటు పవన్ రాజకీయ యాత్ర

పవన్ కల్యాణ్ కి నెల్లూరుతో చిన్నప్పటి నుంచీ అనుబంధం ఉంది. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకీ దశాబ్దాల చరిత్ర ఉంది. మరి ఈ ఏడాదే పవన్ తొలిసారిగా రొట్టెల పండగకు ఎందుకొస్తున్నట్టు. అనంతపురం హడావుడి తర్వాత ఉత్తరాంధ్రకి పరిమితమై గోదావరి జిల్లాల్లో కలియదిరుగుతున్న పవన్, సడన్ గా నెల్లూరు టూర్ ఎందుకు పెట్టుకున్నాడా అని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి మొదలైంది. దీనివెనక ఓ బలమైన రాజకీయ కారణం ఉందని తెలుస్తోంది.

నెల్లూరుకు చెందిన ఓ మైనార్టీనేత ఆహ్వానం మేరకే పవన్ సింహపురిలో అడుగుపెడుతున్నాడని అంటున్నారు. అందుకే రొట్టెల పండగని వేదికగా చేసుకుని పవన్ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తన రాజకీయ యాత్రని పూర్తి చేయాలనుకున్నారు. నెల్లూరు టౌన్ సీటుపై పవన్ గట్టి నమ్మకాన్ని పెంచుకున్నారు. అప్పట్లో ఈ సీటుని ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గెలుచుకుని ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. ఈదఫా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే అప్పటి ప్రజారాజ్యం సీటు, ఇప్పుడు జనసేన కోటాలో పడుతుందని పవన్ ఆశ.

ఈ ఆశకి తోడు టీడీపీ నుంచి సిటీ టికెట్ ఆశించి, మంత్రి నారాయణ చేతిలో భంగపడ్డ నెల్లూరు మేయర్ అజీజ్ జనసేనకి జై కొట్టాలనుకుంటున్నారు. అందుకే ఆయన రహస్యంగా పవన్ తో భేటీ అయ్యారు. ఆయన ఆహ్వానంతో పాటు, స్థానిక పరిస్థితుల్ని ఓసారి అంచనా వేసేందుకు జనసేనాని నెల్లూరుకు వస్తున్నారు. పవన్ సామాజిక వర్గంతో పాటు, నెల్లూరు టౌన్ లో మైనార్టీలకు మెజార్టీ ఓటింగ్ శాతం ఉంది. ఇదంతా తనవైపు తిప్పుకోగలిగితే పవన్ పాచిక పారే అవకాశం ఉంది. అందుకే విజయం రొట్టెను పట్టుకునేందుకు పవన్ చలో నెల్లూరు అన్నారు.

ఈ ఒక్క సీటే కాదు, జిల్లాలో పూర్తిస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా పవన్ పావులు కదుపుతున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ గా ఉన్న మాదాసు గంగాధరం సహా ఇటీవల జనసేనలో చాలామంది నెల్లూరీయులు చేరారు. తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన భార్య సుచరితకు వెంకటగిరి టికెట్ ఇస్తారని కూడా అంటున్నారు. 

మరోవైపు ఇటీవల మరణించిన ఆనం వివేకానందరెడ్డి పెద్దకొడుకు సుబ్బారెడ్డి జనసేనతో కలసివెళ్లే అవకాశం ఉందని స్థానిక సమాచారం. ఈ రాజకీయ కారణాలన్నిటి నేపథ్యంలో పవన్ నెల్లూరు టూర్ ఖరారు చేసుకున్నాడు. ఏదేమైనా రోజులు గడిచే కొద్దీ పవన్ కల్యాణ్ లో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు బైటపడుతున్నాడు.

Show comments