రేషన్ డోర్ డెలివరీ: మరి డీలర్ల పరిస్థితేంటి..?

రేషన్ డీలర్లను ఉద్యోగులుగా గుర్తించాలి, నెల జీతం ఇవ్వాలంటూ ఆ మధ్య ఉద్యమం మొదలైంది. అయితే వాలంటీర్ల వ్యవస్థ రావడం, సరకులు వాలంటీర్లతో ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని వైసీపీ సర్కారు స్పష్టం చేయడంతో డీలర్లు వెనక్కి తగ్గారు. జీతం, గీతం వద్దు.. మా కమీషన్లు మాకివ్వండి చాలంటూ ప్రాధేయపడ్డారు.

కరోనా కష్టకాలంలో రేషన్ డీలర్లు చేసిన సేవలను ఎవరూ తక్కువ చేయలేరు. కొవిడ్ ముప్పు ఉందని తెలిసినా కూడా రేషన్ సరకుల పంపిణీకి ముందుకొచ్చారు. అయితే ఇప్పుడు రేషన్ సరకుల వాహనాలు తెరపైకి రావడంతో మరోసారి డీలర్లు డీలా పడ్డారు. ఇంటివద్దకే రేషన్ బియ్యం పంపిణీతో డీలర్ల పాత్ర పూర్తిగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు.

వాహనదారుడిదే పూర్తి బాధ్యత
ఉదయాన్నే రేషన్ డీలర్ల ఇంటికి వెళ్లి.. సరకులు వాహనంలో ఎక్కించుకోవడం, ఈ-పోస్ మిషన్ తీసుకోవడం.. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి కోటా పూర్తి చేయడం, తిరిగి సాయంత్రం ఈ-పోస్ మిషన్, మిగిలిన సరుకు డీలర్ కి అప్పగించడం. ఇదీ వీరి పని. అంటే ఇక్కడ డీలర్ కేవలం సరకుకి కాపలాదారుడిగా మాత్రమే ఉంటాడన్నమాట.

వాహనాల ద్వారా సరకుల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై 830కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంంది. ఏటా 830కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే.. కచ్చితంగా డీలర్లకు ఇచ్చే కమీషన్లలో కోత పడుతుందని వారు ఆవేదన, అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చాలామంది డీలర్లు రేషన్ పంపిణీ వ్యవరాన్ని వదిలిపెట్టి.. ఇతర వ్యాపకాలను చూసుకున్నారు. ఇప్పుడు కమీషన్లో కోతపడితే పూర్తిగా డీలర్ల వ్యవస్థకు స్వస్తి పలికినట్టే లెక్క.

ప్రయోజనాలివీ..
రేషన్ డీలర్ల సమస్యలను పక్కనపెడితే.. అంతిమంగా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సరుకు అయిపోయింది అనే బాధ ఉండదు, కచ్చితంగా ప్రతి కార్డుదారుడికి రేషన్ సరకు ఇవ్వాల్సిందే. తూకం విషయంలో మోసానికి ఆస్కారం లేదు. ఇక రేషన్ షాపుల ముందు క్యూ కట్టే బాధ కూడా తగ్గుతుంది.

వీటన్నిటితో పోల్చితే రేషన్ డీలర్ల సమస్య ఏమంత పెద్దది కాదు. అయితే ప్రభుత్వం వీరి అనుమానాల్ని నివృత్తి చేసి, ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తే మాత్రం రెండు వర్గాలకు లాభం చేకూరినట్టవుతుంది.

ఇంటి వ‌ద్ద‌కే బియ్యం

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

Show comments