ఇంకేం భయం...అందుకే పళని సాహసం..!

జయలలిత మరణం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకెళ్లడంతో తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైంది. 'అమ్మ' పాలన అంతరించి 'అయ్య' పాలన వచ్చింది. కాని ఆయన మాత్రం ఇది అమ్మ పాలనే అంటున్నారు. జయ గొప్ప అవినీతిపరురాలని మచ్చపడినా కొన్నేళ్లపాటు కనీసం ఈ టర్మ్‌ వరకైనా జనంలో ఆమెపై అభిమానం ఉంటుంది. కొత్త ముఖ్యమంత్రి పళనిసామి ఆ అభిమానాన్ని తన వైపు తిప్పుకోగలగాలి. చిన్నమ్మ జైలుకెళ్లినా పళనిపై తనవాళ్లతో నిఘా పెట్టింది కాబట్టి పరిస్థితి కొంత ఇబ్బందికరమే అయినా పళనికి కొంతమేరకు స్వేచ్ఛ దొరికినట్లే. దశాబ్దాలుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఎంజీఆర్‌, జయలలిత కూర్చున్నారు. మధ్యలో ఎంజీఆర్‌ భార్య జానకీ రామచంద్రన్‌ లెక్క లేదనుకోండి. అవినీతి కేసుల కారణంగా రెండుసార్లు జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీరుశెల్వం జయలలిత ఛాంబర్‌ వైపు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయలేదు. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు మూడోసారి తాత్కాలిక సీఎం అయినప్పుడు కూడా జయ కుర్చీలో కూర్చోలేదు. తన ఛాంబర్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. 

జయలలితే కేబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారని భావిస్తూ మీటింగులో తన ముందు ఆమె ఫొటో పెట్టుకునేవారు. ఆయన విధేయతకు, అమ్మ భక్తికి ఇది పరాకాష్ట. ఇంకో విచిత్రమైన విషయం చెప్పుకోవాలి. గతంలో జయలలిత, శశికళ బెంగళూరులోని జైల్లో ఉన్నప్పుడు అన్నాడీఎంకే నాయకులు ఆమె కుర్చీని అక్కడికి తీసుకెళ్లారు.  జయలలిత మరణం తరువాత పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అయిన పళనిసామి మొదటిసారి సాహసం చేశారు. తమిళ నాయకుల విధేయత, భక్తిప్రపత్తుల ఆధారంగా చెప్పాలంటే దీన్ని సాహసం అనుకోవాలి. ఏమిటీ సాహసం? పళనిసామి ముఖ్యమంత్రి ఛాంబరులోనే బాధ్యతలు స్వీకరించి, దశాబ్దాలపాటు ఆమె కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారు.  ఆ ఛాంబరులో ఇంకా అమ్మే ఉన్నారనే పిచ్చి భక్తితో ఆయన మరో చోట కూర్చోలేదు. ఒకవేళ పన్నీరుశెల్వమే పూర్తిస్థాయి సీఎం అయివుంటే జయ ఛాంబరులో కూర్చునేవారో, ఆమె జ్ఞాపకార్థం అలా వదిలిపెట్టేవారో చెప్పలేం.

పళనిసామి చేసింది సరైన పనే. తనను తాను ముఖ్యమంత్రిగా ఫీలయ్యారు. పన్నీరుకు ఆ భావన కలగలేదు. జయ ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో, అంతిమ ఘడియల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తనను తాను సీఎంగా ఫీలవలేదు. పన్నీరుశెల్వం మంత్రిగా సర్కారు తనకు కేటాయించిన ఇంట్లోనే ఉండి సీఎం బాధ్యతలు నిర్వహించారు. ఆయన నేమ్‌ప్లేట్‌ మీద 'మినిస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌' అనే ఉంది. పళనిసామి సీఎం కాగానే అధికారులు ఆ నేమ్‌ ప్లేట్‌ మీద ఉన్న డిజిగ్నేషన్‌ (మంత్రిగా) కనబడకుండా టేప్‌  అంటించారు. ఇక తమిళనాడులో మరో పుకారు హల్‌చల్‌ చేస్తోంది. అన్నానగర్‌ ఉప ఎన్నిక తరువాత పళనిసామి ముఖ్యమంత్రి పీఠంపై ఉండరని ఆ పుకారు సారాంశం. శశికళ జైలుకు పోకుండా ఉన్నా, నిర్దోషిగా తీర్పు వచ్చినా అక్కడి నుంచి పోటీ చేసేదేమో. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది కాబట్టి అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శిగా నియమించిన తన అక్క కుమారుడు దికరన్‌ను అన్నానగర్‌ నుంచి పోటీ చేయించి సీఎం పీఠం మీద కూర్చోబెడతారని, తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని తన చేతుల్లో ఉంచుకుంటారని వినవస్తోంది.

పళనిసామి ఎక్కువగా ఆశలు పెట్టుకోనక్కర్లేదని, ఆయన పదవి కూడా తాత్కాలికమేనని కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇక పన్నీరు శెల్వం వర్గంలో ఉన్న పదకొండుమంది ఎమ్మెల్యేల మీద స్పీకర్‌ ధనపాల్‌ అనర్హత వేటు వేయవచ్చనే వార్తలొస్తున్నాయి. శశికళ వర్గం జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఈ ఎమ్మెల్యేలు పళనిసామికి వ్యతిరేకంగా ఓటేశారు. ఒకవేళ శశికళ వర్గందే నిజమైన అన్నాడీఎంకేగా తేలితే పన్నీరుశెల్వం 'అమ్మ డీఎంకే' పేరుతో పార్టీ పెడతారనే సమాచారం వస్తోంది. పళని ముఖ్యమంత్రి కావడంతో సంక్షోభం చల్లారలేదనిపిస్తోంది. మరోపక్క శశికళ చెన్నయ్‌లోని జైలుకు రావాలని ప్రయత్నాలు చేస్తుండగా ఆమెను ఎలాగైనా బెంగళూరు జైల్లోనే ఉంచాలని అక్కడి జైలు అధికారులు పట్టుదలగా ఉన్నారు. అధికారాన్ని తన కుటుంబపరం చేయడానికే శశికళ చెన్నయ్‌ జైలుకు రావాలని అనుకుంటున్నారు.

Show comments