ఎన్నిక‌ల్లో హాట్ టాపిక్ గా మారిన గీతం భూ ఆక్ర‌మ‌ణ‌!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ విశాఖ‌లో గీతం భూముల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 40 ఎక‌రాల భూమిని గీతం ఆక్ర‌మించిందనే వివాదం గ‌త ఐదేళ్లలో కూడా త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచింది. ఈ భూ వివాదంపై ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేసే ప్ర‌య‌త్నాలూ చేసింది, క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకోవ‌డానికి ప్ర‌భుత్వానికి ప్ర‌త్యామ్నాయ భూమిని స‌రెండ‌ర్ చేయ‌మ‌ని కూడా కోరింది! అయితే దీనికి గీతం సంస్థ నిరాక‌రించ‌డంతో వివాదం కొన‌సాగుతూ ఉంది!

చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు చేసే పనులకు ఎంత వ్యత్యాసం ఉందో గీతం యూనివర్శిటీని చూస్తేనే అర్థమవుతుంది. గీతం విద్యా సంస్థలనే పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగే చంద్రబాబునాయుడు తమవారికి ప్రయోజనాలు కలిగించడంలో ఎప్పుడూ ముందుంటారనే పేరే ఉంది! అలా అడ్డగోలుగా అనుమతులు తీసుకువచ్చి గీతం విద్యాలయాలను విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకువెళ్లారు.

కట్ చేస్తే... గీతం విద్యా సంస్థలు ఉన్న 100 ఎకరాల్లో 40.51 ఎకరాలను అడ్డగోలుగా  ఆక్రమించారని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పే గీతం సంస్థల బండారం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇన్నాళ్లూ విద్యా సంస్థల ముసుగులో వీరు చేసే పనులు ఇవా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పచ్చ మీడియాని అడ్డం పెట్టుకుని, ఇదంతా కావాలని చేస్తున్నారని.. రివర్స్ గేమ్ ఆడారు కానీ అంత వర్కవుట్ కాలేదు. ఎందుకంటే అధికారులే పక్కా ఆధారాలతో ఇవ్వడంతో అంతా నోళ్లు మూసుకున్నారు. ఈ నేపథ్యంలో గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలు నిర్మించిందంటూ.. జీవీఎంసీ అధికారులు కొన్నింటిని తొలగించారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు.

రుషికొండ, ఎండాడ పరిసరాల్లో భూ ఆక్రమణలు జరిగాయని, గీతం యూనివర్శిటీ 40.51 ఏకరాలను కలిపేసుకుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై ప్రభుత్వానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదిక ఇచ్చింది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగిందని నిర్ధారించారు. ఎండాడలోని సర్వే నం. 15(పీ) 16(పీ),17పీ, 18పీ, 18పీ, 20వీ, రుషికొండలోని 553, 613, 34, 35, 37, 38లోని మొత్తం 40.51 ఎకరాల భూమిని గీతం విద్యా సంస్థలు ఆక్రమించినట్లు రెవెన్యూ యంత్రాంగం నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దీనికి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి సమాధానం ఏం చెబుతారని ప్ర‌జ‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ భూముల వివాదానికి సార‌ధి అయిన భ‌ర‌తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు! తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారం చూస్తే.. భారీ భూ వివాదంలో ఎవ‌రైతే ఉన్నారో వారికే టికెట్ కేటాయించ‌డం అదేదో సామెత‌ను గుర్తు చేస్తోంది!

పాత దందాలు తెర‌పైనే ఉన్న వేళ ఇప్పుడు భ‌ర‌త్ ను గెలిపించాలంటూ టీడీపీ ఓట్ల‌డుగుతోంది! తెలుగుదేశం అభ్య‌ర్థి త‌న ఆస్తుల వివాదాల్లోంచి ర‌క్ష‌ణ పొంద‌డానికి డైరెక్టుగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్టుగా ఉంద‌నే కామెంట్ విశాఖ విష‌యంలో వినిపిస్తూ ఉంది!

Show comments