సిగ్గులేని రాహుల్.. ప్రత్యేకహోదా ఇస్తాడట!

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు, రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ ఎలాంటి చేటు చేసిందో ప్రత్యేకంగా చెప్పాలా? 100 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కు నెట్టేసింది. పార్లమెంట్ ప్రసారాలను ఆపేసి మరీ చీకట్లో తెలుగు రాష్ట్రాన్ని తెగనరికిన కాంగ్రెస్ ఇప్పుడు బాకీ తీరుస్తానంటూ ముందుకొస్తోంది. కర్నూలు సభలో రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చేశారు. 

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం హోదా ఫైల్ పైనే చేస్తామని సెలవిచ్చారు. హాదా పేరు చెప్పి 2014 ఎన్నికల్లో లాభపడ్డ బీజేపీ.. ఆ తర్వాత ప్యాకేజీ కథలు చెప్పింది. చివరికి హోదా ఇచ్చేది లేదని తేల్చిపారేసింది. ఇప్పుడు 2019 ఎన్నికలకు ఏపీ ప్రజల్ని ఓట్లు అడిగే హక్కుకానీ, అడిగే దమ్ముకానీ బీజేపీకి లేదు. అందుకే నక్కజిత్తుల కాంగ్రెస్ లైన్లోకి వచ్చింది. హోదా ఇస్తామంటూ కొత్త ఎత్తులు వేస్తోంది. 

ఏపీపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్న రాహుల్, అసలు 2014 ఎన్నికల్లో విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదనే ప్రశ్నకు జవాబు చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే మన్మోహన్ సర్కారు అప్పుడే ఇచ్చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఇప్పుడు మోదీ ముందు దేబిరించాల్సిన పరిస్థితి మన ఎంపీలకు వచ్చి ఉండేది కాదు. 

అధికారంలో ఉండగా అప్పుడు ఇవ్వలేని, ఇవ్వని హోదాని ఇప్పుడెలా ఇవ్వగలరంటూ తెలుగు ప్రజలంతా ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పాలి. అంటే 2019 ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోడానికి ఇదో కొత్త ఎత్తుగడ అనేది స్పష్టమవుతోంది. 2014లో ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ 2019లో అయినా బతికి బట్టకట్టాలనుకుంటోంది. దీనికోసమే ప్రత్యేక హోదా అనే తాయిలాన్ని చూపిస్తోంది. 

కాంగ్రెస్ ఉచ్చులో పడటానికి ఏపీ ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్లేం కాదు. కడుపు మండితే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో ఇప్పటికే ఓసారి రుచిచూపించారు. మంత్రులకు, పార్టీ అధ్యక్షులకు డిపాజిట్లు కూడా రాకుండా తరిమి తరిమి కొట్టారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యేట్టు చెదరగొట్టారు.

కాంగ్రెస్ పాపం కడుక్కుంటే పోయేది కాదు, దాని ప్రతిఫలం ఇంకా అనుభవించాల్సిందే. హోదా ఇస్తాం, తొలి సంతకం పెడతామంటే నమ్మి ఓట్లు గుద్దిపారేసే వెర్రివాళ్లు ఎవరూ లేరిక్కడ. 

Show comments