రాహుల్‌, మోడీ.. మధ్యలో పాకిస్తాన్‌

రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారిపోయాయి.? అనంటే, ఇదిగో ఉదాహరణ. రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని 'దొంగ'గా అభివర్ణిస్తే.. దానికి కౌంటర్‌గా బీజేపీ, రాహుల్‌ గాంధీకీ - పాకిస్తాన్‌కీ 'సంబంధం' అంటగట్టేసింది. సమాధానం తమ వద్ద లేనప్పుడు, విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం లేనప్పుడు మాత్రమే, రాజకీయంగా ఇంతటి దిగజారుడుతనానికి పాల్పడతారు ఎవరైనా. బీజేపీ ఇప్పుడు చేస్తున్నది ఇదే.

'మేం, రాహుల్‌గాంధీకో.. కాంగ్రెస్‌ పార్టీకో సమాధానం చెప్పం.. త్వరలో ప్రజల ముందుకు వెళతాం.. ప్రజలకే అన్ని వివరాలూ చెబుతాం..' అంటున్నారు బీజేపీ నేతలు. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? జాతీయ స్థాయిలో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌గాంధీ అధ్యక్షుడు.. అంతేనా, ఆయన ఓ ఎంపీ కూడా. అలాంటప్పుడు, ఆయన దేశ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాడనే భావనతో.. ఆ ప్రజలకే సమాధానం బీజేపీ చెప్పాలి కదా.!

నరేంద్రమోడీ అండ్‌ టీమ్‌, తాము ఎప్పుడు డిఫెన్స్‌లో పడినా 'పాకిస్తాన్‌' సాయం తీసుకోవడం మామూలే. గుజరాత్‌ ఎన్నికల సమయంలో, భారతీయ జనతాపార్టీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. సరిగ్గా అప్పుడే నరేంద్రమోడీ, అత్యంత వ్యూహాత్మకంగా 'పాకిస్తాన్‌తో కాంగ్రెస్‌ చేతులు కలిపింది..' అంటూ సెంటిమెంట్‌ కార్డ్‌ ప్లే చేశారు. ఆఖరి క్షణంలో నరేంద్ర మోడీ ఆ వ్యాఖ్యలు చేసి వుండకపోతే, గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు ఏమయ్యేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు మళ్ళీ రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణం విషయంలోనూ కమలదళం 'పాకిస్తాన్‌' సాయం కోరుతోంది. దేశంలో జరుగుతోన్న రాఫెల్‌ చర్చను పక్కదారి పట్టించేందుకు మోడీ అండ్‌ టీమ్‌, పాక్‌తో రాహుల్‌ గాంధీకీ, కాంగ్రెస్‌ పార్టీకి ఇంకోసారి 'సంబంధం' అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈసారి బీజేపీ వాడకం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోగానీ, ప్రజలు మాత్రం.. మోడీ అండ్‌ టీమ్‌ తీరుని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

అయినా, ఇప్పటిదాకా రాహుల్‌ గాంధీని 'ముద్ద పప్పు' అని లైట్‌ తీసుకున్న బీజేపీ, ఇప్పుడెందుకు ఆయన విషయంలో అంతలా కంగారుపడ్తోందట.? ఇదే ఇప్పుడెవరికీ అర్థంకాని ప్రశ్న. అంటే, రాహుల్‌ ఇమేజ్‌ పెరుగుతోందనే స్పష్టమైన సంకేతాలు బీజేపీ వద్ద వున్నాయనే అనుకోవాలేమో.

Show comments