నాకు వయసైపోతోంది.. హీరోయిన్ ఆవేదన

ఎంత వయసు పెరిగినా గ్లామరస్ గా కనిపించేందుకు హీరోయిన్లు తెగ ఉబలాటపడతారు. దాని కోసం రకరకాల కాస్మొటిక్స్ వాడడంతో పాటు, మరికొంతమంది మరో అడుగు ముందుకేసి సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఎలాగైనా గ్లామర్ గా కనిపించేందుకు తహతహలాడుతుంటారు. అయితే ఇలాంటి వాళ్లందరికీ పూర్తి విరుద్ధంగా నడుచుకుంటోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

ఒకప్పట్లా అందంగా కనిపించడానికి తను తహతహలాడడం లేదని, వయసు పెరిగిందనే విషయం తనకు అర్థమౌతోందని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. వయసు రీత్యా శరీరంలో వస్తున్న మార్పుల్ని తను అర్థం చేసుకుంటున్నానని, వాటిని అంగీకరిస్తున్నానని తెలిపింది.

"ఈ విషయంలో అబద్ధం చెప్పను. అలా అబద్ధం చెప్పి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నిజమే నాకు వయసైపోతోంది. నా బాడీ షేప్ మారుతోంది. నేను మరింత పెద్దదాన్ని అవుతున్నాను. శారీరంగా, మానసికంగా దీన్ని నేను స్వీకరిస్తున్నాను. నా వయసుకు నేను ఎలా కనిపించాలో అలా కనిపిస్తున్నాను."

20 ఏళ్ల వయసులో కనిపించినట్టు ఇప్పుడు కూడా కనిపించాలనే ఆశ తనకు లేదంటోంది ప్రియాంక. గ్లామర్ పేరిట శరీరాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదంటున్న ఈ బ్యూటీ.. వయసు పెరిగేకొద్దీ ఎంత అందంగా ఉన్నామనేది మన ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటుందని చెబుతోంది.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా వయసు 38 సంవత్సరాలు. ఈమె కంటే ఎంతో పెద్దవాళ్లైన ఐశ్వర్యరాయ్, శిల్పాషెట్టి లాంటి తారలు గ్లామర్ తో మెరిసిపోతుంటే.. ప్రియాంక ఇలా వేదాంతం చెప్పడం ఏం బాగాలేదంటున్నారు ఆమె ఫ్యాన్స్. 

Show comments