ఎవరు గెలుస్తారో తేల్చేసిన సీనియర్ జర్నలిస్ట్

ఎగ్జిట్‌ పోల్స్‌: 'చెయ్యె'త్తినా 'కారు' ఆగలేదు!?

తెలంగాణ నాడి కొంతవరకూ తెలిసి పోయింది. తొమ్మిది నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన  కేసీఆర్‌ ప్రయత్నం ఆయనకూ, ఆయన పార్టీకి ఆశించిన ప్రయోజాన్నే చేకూర్చింది. ఎన్నికలు ముగిసీ ముగియగానే వచ్చిన 'ఎగ్జిట్‌ పోల్స్‌' ఫలితాలను బట్టి( వాటిని నమ్మాల్సి వస్తే) టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే మరోమారు కూడా కొనసాగవచ్చు. మొత్తం 119 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావలిసినవి 60 సీట్లు. కానీ టైమ్స్‌నౌ, సీఎన్‌ ఎక్స్‌, రిపబ్లిక్‌టీవీ-జన్‌ కీ బాత్‌ , ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా సర్వేలు టీఆర్‌ఎస్‌కు 60కు పైనే స్థానాలు రావచ్చని చెబుతున్నాయి.

ఇండియా టుడే అయితే  ఏకంగ 79-91 వరకూ స్థానాలు రావచ్చని చెబుతోంది. (కేసీఆర్‌ సెంచరీ కొడతాను అని చెబుతూ వచ్చారు. ఆయన కోరికకు దగ్గరగా ఇండియా టుడే స్థానాలను చెబుతోంది.) అయితే లభ్యంగా వున్న మూడు 'ఎగ్జిట్‌ పోల్స్‌'లో కాస్త తక్కువ స్థానాలను టీఆర్‌ఎస్‌కు ఇచ్చింది రిపబ్లిక్‌ టీవీ. టీఆర్‌ఎస్‌కు 50-65 మధ్య స్థానాల్లో వస్తాయని చెప్పింది. అయినా అదనంగా మజ్లిస్‌ ఇతరులు తెచ్చుకునే స్థానాలను 8-14 వద్ద వచ్చింది. ఆ లెక్కన చూసినా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావటానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే టైమ్స్‌ నౌ ప్రకారం 66 స్థానాలను ఒక్క టీఆర్‌ఎస్‌ గెలుచుకనే అవకాశం కనిపిస్తుంది.

ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా వుంచటం కోసం అన్నిపార్టీలూ కూటమిగా ఏర్పడినా, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం పెద్దగా లబ్ధి పొందలేకపోయాయి. సర్వేలు దాదాపు అన్నీ 30 నుంచి 40 స్థానాల మధ్యే రావచ్చని చెబుతున్నాయి. ఒక్క రిపబ్లిక్‌ టీవీ మాత్రమే కాంగ్రెస్‌ కొంచెం ఎక్కువ సీట్లను చూపిస్తోంది. ఆ సంఖ్య 38-52 మధ్యలో వుంది. మిగిలిన రెండు సంస్థలూ 21 నుంచి 37 వరకూ చూపించాయి. ఎక్కడా 40 స్థానాలకు దాటి రావటానికి వీలులేదని చూపించాయి.

ఏ ఒక్క సంస్థా మజ్లిస్‌ ప్రాభవాన్ని తక్కువ అంచనా వెయ్యలేదు. ఏడు సీట్లు వచ్చే అవకాశం వుందని చెప్పాయి. కాకుంటే బీజేపీకి మొత్తం మీద 4 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది. ఇతరుల్లో సీట్లు దొరక్క బీఎస్పీ, బిఎల్‌ఎప్‌కు వెళ్ళిన స్వతంత్రులు కానీ వుండవచ్చు. వీరి సంఖ్యకూడా ముందు ఊహించినంత గణనీయంగా లేదు. అత్యధికంగా 4 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏ రకంగా చూసినా టీఆర్‌ఎస్‌ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యగల అవకాశం కనిపిస్తోంది. ఎలాగూ మజ్లిస్‌ ముందుగానే పొత్తు పెట్టుకుంది.

ఒకవేళ హంగ్‌ వచ్చి వుంటే, మజ్లిస్‌ తన విధేయతలను మార్చుకునేందుకు ప్రయత్నించి వుండేదేమో కానీ, ఇప్పుడా అవకాశమే లేదు. ఆరునెలల్లో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఈ పొత్తు ఇలాగే కొనసాగుతుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలే, అసలు ఫలితాలను ప్రతిబింబించే విధంగా వుంటే, తెలంగాణలో కాంగ్రెస్‌ మరోసారి పరాభవం పొందినట్లయ్యింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా, దశాబ్దాల వైరం వున్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

2014లో వోటమికీ, 2018లో వోటమికీ కారణాల్లో తేడా వుందా?  అప్పట్లో కాంగ్రెస్‌ వోటమికి ప్రధాన కారణంగా 'తెలంగాణ ఇచ్చి చెప్పుకోలేకపోయామనే' గుణపాఠం తీసుకున్నారు.  మరి ఇప్పుడు ఏ గుణపాఠం తీసుకుంటారు? చంద్రబాబుతో చేతులు కలపటం వల్ల పరాజయం పాలయ్యామనుకుంటారా? బహుశా అలాంటి కారణాన్ని ఏదో కనిపెడతారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌కున్న బలహీనత అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటే. కాంగ్రెస్‌కు రాష్ట్రాన్నుంచి ఒక బలమైన నేతను చూపలేకపోయారు.

2004 లో చంద్రబాబు నుంచి అధికారం తీసుకోవటానికి కారణం: వైయస్‌ రాజశేఖర రెడ్డి లాంటి నేతను ఫోకస్‌ చెయ్యటం.( అంతవరకూ ఆయన ఒక సాధారణమైన నేత మాత్రమే). తెలంగాణ ను ఇచ్చే ముందు కాంగ్రెస్‌ అలాంటి పని చేసి వుండాల్సింది. తెలంగాణ నుంచి ఒక నేతను ఫోకస్‌ చేస్తే బాగుండేది.  అప్పుడూ చెయ్యలేదు. ఇప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కాగల నేతను ఒకర్ని ఫోకస్‌ చెయ్యలేక పోయింది. ఇక టీఆర్‌ఎస్‌ సర్కారు పట్ల వున్న వ్యతిరేకత ఏ మాత్రం వుందన్నది ఒక ప్రశ్న.

పథకాలతో లబ్ధిదారులుగా వున్న వోటర్లు పైకేమీ చప్పుడు చెయ్యలేదు. కానీ హక్కుల గురించి మాట్లాడిన వారు ఎక్కువ  ఆందోళన వ్యక్తం చేశారు. అంటే కేసీఆర్‌ సర్కారులో 'సంక్షేమాన్ని' పొందిన వారు అనుకూలంగానూ 'స్వేఛ్చను' కోల్పోయామనుకున్న వారు వ్యతిరేకంగానూ మారారు. రెండో వర్గానికే చెందిన వోట్లు మాత్రమే కూటమికి వచ్చి వుండాలి.  ఈ వ్యతిరేక వోటును కూడా కొంత బీజేపీ చీల్చి  టీఆర్‌ఎస్‌ సహకరించింది- అనుకోవాలి.

అయితే ఈ మొత్తం ఎన్నికల్లో అనుకోని లబ్ధి పొందింది మాత్రమే చంద్రబాబే. ఆయన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది పక్కన పెడితే- తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి  ఉనికి తేగలిగారు. ఏమయితేనేం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో మరో రికార్డు సృష్టించబోతున్నారని భావించాల్సి వస్తోంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీ మరుసటి ఎన్నికలలో ఇంతవరకూ గెలవలేదు. కానీ టీఆర్‌ ఎస్‌ గెలిస్తే ఇది తప్పకుండా కొత్త రికార్డు అవుతుంది. 

-టాపిక్ ఆఫ్ ది వీక్ విత్ -సతీష్ చందర్ (సీనియర్ పాత్రికేయులు)

Show comments