ఆమె అధరాలు.. అతడి వేషాలు: ఇవి పెళ్లిచూపులా?

బిగ్ బాస్ సీజన్-2 తర్వాత స్టార్ మాలో వస్తున్న ప్రదీప్ పెళ్లిచూపులు కార్యక్రమం మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. అయితే రానురాను ఈ షోలో అడల్ట్ కంటెంట్ మితిమీరుతోంది. తాజా ఎపిసోడ్లు ఏవీ కుటుంబసమేతంగా చూడదగ్గవి కావు. ఈ రియాల్టీ షోలో వచ్చే కాన్సెప్ట్ లు, కంటెస్టెంట్ ల అంగాంగ ప్రదర్శన.. ఇబ్బందికరంగా మారాయి. 

14మంది అమ్మాయిల బాడీపార్ట్స్ ని ఫొటోలు తీసి ఏవి ఎవరివో కనిపెట్టాలనే ఛాలెంజ్ లో తలమునకలయ్యాడు వరుడు ప్రదీప్. కళ్లు, ముక్కు, చెవులు, నడుము.. ఇలా శరీర భాగాలను విడివిడిగా చూపిస్తూ షో నిర్వాహకులు టీఆర్పీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ అంగాంగ ప్రదర్శనతో పాటు.. అధరాల ప్రదర్శన మరో వికృత క్రీడ. అమ్మాయిల లిప్స్ ఫొటోలను చూస్తూ ఏ పెదవులు, ఎవరివో ప్రదీప్ కనిపెట్టాలి. ఆయన సరిగ్గా గుర్తుపడితే వారిపై అంత ప్రేమ ఉన్నట్టు లెక్క. ఇక తమ పెదాలు ఎక్కడ తప్పుగా గుర్తు పడతాడో అని అమ్మాయిలు పడే తాపత్రయం వర్ణణాతీతం. 

అమ్మాయిల బాడీపార్ట్స్, లిప్స్ క్లోజప్ షాట్లు, వారు వేసే వెకిలి వేషాలు ఈ షో స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి. రాబోయే ఎపిసోడ్లన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్ తోనే నిండిపోయి ఉంటాయని తేలిపోయింది. అమ్మాయిల అందాలను ఎరగా వేసి షోని పాపులర్ చేద్దామనుకుంటున్నారు నిర్వాహకులు.

ఇంకా కాంట్రవర్సీల జోలికి వెళ్లలేదు కానీ, అదికూడా స్టార్ట్ అయితే ప్రదీప్ కోసం 14మంది అమ్మాయిలు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే రోజు వస్తుంది. ఇక వారి ఫైటింగ్, వారి మధ్య జరిగే మాటల యుద్ధం, మధ్యలో బీప్ లు.. వీటన్నిటితో ఈ షోకి మరింత మసాలా యాడ్ చేసేలా డిజైన్ చేయడంలో తలమునకలై ఉంది యూనిట్. ఇలా పెళ్లి చూపులు కాస్తా, వెకిలి వేషాల షోగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments