పవన్.. ఒక సరికొత్త డ్రామా!

పవన్ కల్యాణ్‌కు మళ్లీ కాస్త తీరిక దొరికింది. బెజవాడ వెళ్లి అక్కడ మీడియాతో  మొదలెట్టి, గవర్నరు దాకా అందరినీ హడావిడి పెట్టేస్తున్నారు. మళ్లీ స్టోరీ సిటింగులకు వెళ్లేదాకా.. ఈ రాజకీయ షెడ్యూలు కొనసాగుతుంది. ఈ తాజా షెడ్యూలులో పవన్ సరికొత్త డ్రామాకు తెరతీశారు.

ఇసుక సమస్యను నివారించడానికి ప్రభుత్వం ఎలా పనిచేయాలో ఆయన ఒక ప్రణాళిక తయారుచేశారు. దానిని గవర్నరుకు అందించారు. అంటే బహుశా ఆ మేరకు ప్రభుత్వం పనిచేసేలా గవర్నరు ఆదేశించాలన్నమాట. ఆ రకంగా ఒక ప్రహసనం పవన్ నడిపించారు.

మళ్లీ పవన్ పాత పాటే పాడారు. తాను లాంగ్ మార్చ్ చేయగానే.. నదులు, వాగులు అన్నీ భయపడిపోయి.. నీరంతా తక్షణం ఆవిరైపోయి.. ఇసుక తవ్వకాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ భ్రమపడినట్లుంది.

అలా జరగకపోయేసరికి.. నేను లాంగ్ మార్చ్ చేసినా కూడా ప్రభుత్వం స్పందించి ఇసుక సరఫరా పునరుద్ధరించలేదు అని ఆంన అంటున్నారు. ఈ పునరుద్ధరించడం అంటే ఏంటో మరి? అక్కడికేదో ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా.. ఇసుక సరఫరా ఆపేసినట్లు ఆయన మాటలు కనిపిస్తున్నాయి.

ఇంతకూ డ్రామా ఏంటంటే.. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఇసుక విధానంమీద ఆయనొక నోట్ తయారుచేశారు. సమస్య పరిష్కారమే కోరుకునే నాయకుడైతే గనుక.. ప్రభుత్వానికే ఇవ్వవచ్చు. బాధ్యతగల ప్రతిపక్షంగా లోపాలను దిద్దుకోమని అడగొచ్చు. ప్రచారకాంక్ష ఉంటే గనుక.. దానిని మీడియాకు ఇవ్వవచ్చు. ఆయన ఈ ప్రచారకాంక్షకు ఇంకాస్త ఇమేజి జోడిస్తూ దానిని తీసుకెళ్లి గవర్నర్ కు ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ఇసుక విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విశాఖలో ఒక్కచోటే మార్చ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాటి కార్యక్రమానికి పిలుపు నిచ్చినా.. తమ పార్టీకి జనసమీకరణ చేయగల సత్తా లేదనే దౌర్బల్యం బయటపడిపోతుంది. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులకు అడ్డాల వద్ద అన్నదానం ఏర్పాటు చేస్తాం అని అన్నారు. అది రాష్ట్రంలో ఎన్నిచోట్ల ఏర్పాటుచేశారో తెలియదు. ఇప్పుడు సమస్య తీరిపోతున్న సమయంలో మళ్లీ ఇసుక గురించి మాట్లాడుతున్నారు.

పవన్ ఈ సమయంలో జిల్లాల్లో దీక్ష ఏదైనా పిలుపు ఇస్తే అసలు సంగతి బయటపడుతుంది. ప్రతిచోటా ఇసుక లభ్యత పెరిగింది. ఆ నేపథ్యంలో పనులు కూడా తిరిగి జోరందుకుంటున్నాయి. ఇప్పుడు పవన్ పిలిచినా.. సినీ అభిమానులు పట్టుమని కొందరు ఎగబడి రావాల్సిందే తప్ప.. భవన నిర్మాణ కార్మికులంటూ రావడం అసాధ్యం. ఈ సమయంలో తానొక నూతన ఇసుక ప్రణాళికను గవర్నరు చేతికివ్వడం కామెడీ కాక మరేమిటి?

Show comments