పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌కి ట్విట్టర్‌ దిగొస్తుందా.?

జనసేన పార్టీకి సంబంధించిన 400 ట్విట్టర్‌ అకౌంట్స్‌ సస్పెండ్‌ అవడం ఆ పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తోంది. 'ఇది రాజకీయ కుట్ర..' అంటూ జనసైనికులు సోషల్‌ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా, 'ప్రజల తరఫున నిలబడి, ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందుకేనా ఈ అన్యాయం..' అంటూ నిలదీసేశారు ట్విట్టర్‌లో. మరి, పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌కి, ట్విట్టర్‌ స్పందిస్తుందా.? ఛాన్సే లేదు.

ట్విట్టర్‌ కావొచ్చు, మరొకటి కావొచ్చు.. వ్యవహారమంతా 'టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌' మీద ఆధారపడి నడుస్తుంది వ్యవహారం. సోషల్‌ మీడియాలో ఏదైనా చేస్తామంటే అన్ని సందర్భాల్లోనూ కుదరదు. అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్విట్టర్‌ కావొచ్చు, ఫేస్‌బుక్‌ కావొచ్చు సీరియస్‌గా స్పందిస్తుంటుంది. గత కొద్ది రోజులుగా జనసైనికులు, సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్న వైనం చూసినవారికి జరగబోయే వ్యవహారం ముందే అర్థమయిపోయింది.

ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు 400 అక్కౌంట్లు సస్పెండ్‌ అయ్యాయని, జనసేన అధికారికంగా స్పష్టం చేసేసింది. పవన్‌ కళ్యాణ్‌కి వున్న లక్షలాదిమంది అభిమానుల్లో ఈ 400 అనేది చాలా చాలా చిన్న నెంబర్‌. అయితే, పార్టీకి సంబంధించిన అక్కౌంట్లు సస్పెండ్‌ అవడమే ఆ పార్టీని కాస్త ఇబ్బంది పెట్టినట్టుంది. 'శతఘ్ని' లాంటి కొన్ని అక్కౌంట్లు రద్దు కావడంతో పార్టీ అలర్ట్‌ అయ్యింది. కానీ, దీన్ని సంబంధిత సోషల్‌ మీడియా టీమ్‌ ముందే ఊహించి వుండాల్సింది.

ఇదిలావుంటే, గత కొద్ది రోజులుగా శతఘ్ని టీమ్‌.. నుంచి వివాదాస్పద పోస్టింగ్స్‌ బయటకు వస్తున్నాయి. నల్లమల ఇష్యూ కావొచ్చు, గోదావరిలో పడవమునక వ్యవహారం కావొచ్చు.. ఈ అంశాల నేపథ్యంలో అటు తెలంగాణ ముఖ్యమంత్రినీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రినీ తూలనాడుతోంది 'శతఘ్ని' టీమ్‌. అదే, శతఘ్ని ట్విట్టర్‌ అక్కౌంట్‌ కొంపముంచింది.

వైసీపీ కావొచ్చు, టీడీపీ కావొచ్చు, టీఆర్‌ఎస్‌ కావొచ్చు.. ఇతర రాజకీయ పార్టీలు కావొచ్చు.. సోషల్‌ మీడియా విభాగాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంటాయి. మెయిన్‌ టీమ్‌లని సపోర్ట్‌ చేసే కిందిస్థాయి విభాగాలతోనే ఎక్కువగా దుష్ప్రచారాలు చేస్తుంటారు గనుక.. వాటికి పెద్దగా సమస్యలు రావు.

నష్టం జరిగిపోయాక, ఇప్పుడు గగ్గోలు పెట్టడం వల్ల ఒరిగేదేమీ వుండదు. అత్యుత్సాహం తగ్గించుకోవాలని జనసేనాని స్వయంగా పలుమార్లు హెచ్చరించినా, అధినేత హెచ్చరికల్ని జనసైనికులు పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. 

మారని చంద్రబాబు నాయుడు తీరు