పాత వారికే పాత శాఖలు: కేబినెట్ లో మళ్లీ మార్పులు?

జగన్ కేబినెట్ లో మార్పులు జరిగాయి. పాత, కొత్త కలయికతో బి-టీమ్ సిద్ధమైంది. అయితే ప్రమాణ స్వీకారాలయ్యాయి కానీ బాధ్యతలు స్వీకరించడంలో మాత్రం ఎందుకో మంత్రులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇప్పటికీ కొందరు బాధ్యతలు స్వీకరించలేదు. బొత్స సత్యనారాయణ కుటుంబ ఫంక్షన్ కారణం అని చెబుతున్నారు. ఆర్థిక శాఖ తిరిగి తనకే ఇచ్చారు కాబట్టి మళ్లీ కొత్తగా బాధ్యతలు స్వీకరించడం అవసరమా అని బుగ్గన ఆలోచిస్తున్నారు.

వివిధ కారణాలతో గుడివాడ అమర్నాథ్, కాకాణి, అంబటి రాంబాబు, పీడిక రాజన్న దొర కూడా లాంఛనంగా బాధ్యతలు చేపట్టడం, చాంబర్లు ఓపెన్ చేయడం లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ముందు సొంత నియోజకవర్గాలకు వెళ్లొచ్చి ఆ తర్వాత బాధ్యతలు చేపడదామనుకుంటున్నారు వారంతా.

శాఖల సంగతేంటి..?

తొలి విడత మున్సిపల్ శాఖ చూసిన బొత్సకు మలి విడతలో విద్యాశాఖ ఇచ్చారు. ఆ శాఖ పై సీఎం అధ్యక్షతన జరిగిన తొలి సమీక్షకు ఆయన డుమ్మా కొట్టారు. ఒకరకంగా ఆయనకు ఆ శాఖ ఇష్టం లేదని, మున్సిపల్ శాఖను తనకు తిరిగి ఇప్పించాలని జగన్ కి చెప్పారట. మరి జగన్ మనసులో ఏముందో చూడాలి.

పాతవారికే పాత శాఖలు అప్పగిస్తే..

ఇప్పటి వరకు విద్యా శాఖను ఆదిమూలపు సురేష్ సమర్థంగా నిర్వహించారు. కొత్తగా ఆయన మున్సిపల్ శాఖను నిర్వహించాలంటే తిరిగి దానిపై అధ్యయనం చేయాలి. అటు బొత్స కూడా కొత్తగా విద్యాశాఖపై అధ్యయనం చేయాలి. అధికారులను పరిచయం చేసుకుని, సమన్వయం చేసుకోవాలి. 

ఇలా కాకుండా ఎవరి శాఖను వారికే తిరిగి అప్పగిస్తే.. కొత్తగా ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. అలవాటైన శాఖలో అలవోకగా పనిచేస్తారు. మిగతా సమయాన్ని పార్టీ కోసం వినియోగిస్తారు. ఈ ఉద్దేశంతోటే పాతవారికి పాత శాఖలు అనే ప్రపోజల్ తెరపైకి వచ్చింది.

జగన్ మనసులో ఏముంది..?

పాత మంత్రుల కోరిక ఎలా ఉన్నా జగన్ ఏమనుకుంటున్నారనేదే ఫైనల్. శాఖలపై అవగాహన పెంచుకోవడం, పాలనలో పాలుపంచుకోవడం ఇప్పటికే మంత్రులుగా అనుభవం ఉన్నవారికి పెద్ద కష్టం కాదు. అందుకే జగన్ మార్పు కోసం కొంతమందికి శాఖలను అటు ఇటు చేశారు. 

చివరిగా మంత్రుల కోర్కెను కూడా ఆయన పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. మంత్రుల అభ్యర్థనను జగన్ పరిశీలిస్తే మాత్రం త్వరలో శాఖల మార్పుపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. 

Show comments