విజయవాడ, విశాఖ మెట్రో ప్రతిపాదనలు రాలేదు

విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రోరైల్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తమకు సవరించిన ప్రతిపాదనలు అందలేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మెట్రోరైల్‌ నిర్మాణానికి సంబంధించి 2015 డిసెంబర్‌, జూన్‌ 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలను అందాయని మంత్రి చెప్పారు.

అయితే 2017లో ప్రభుత్వం మెట్రోరైల్‌ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చినందున దానికి అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా కోరుతూ పాత ప్రతిపాదనలను రాష్ట్రానికి తిప్పి పంపించినట్లు మంత్రి తెలిపారు.

కొత్త మెట్రో రైల్‌ విధానానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపించిన భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో మెట్రో రైల్‌ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. భోపాల్‌ నగరంలో 27 కిలోమీటర్ల దూరం మెట్రో రైల్‌ నిర్మాణానికి 6941 కోట్ల రూపాయల అంచనా వ్యయంతోను, ఇండోర్‌లో 31 కిలోమీటర్ల మెట్రో రైల్‌ కోసం 7500 కోట్ల అంచనాతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ భోపాల్‌ మెట్రోకు 4657 కోట్లు, ఇండోర్‌ మెట్రోకి 4476 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వడానికి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు.

నగరం గ్యాస్ పైప్‌లైన్‌ పేలుడు బాధితులకు మెరుగైన చికిత్స
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరంలో 2014లో జరిగిన గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయట పడిన వారికి కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరం పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 17 మంది బాధితులకు వారికి చికిత్స అందిస్తున్న వైద్యుల సూచనల ప్రకారం వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రీట్‌మెంట్‌ అందించడం జరిగిందని మంత్రి చెప్పారు.

వారిలో 14 మందికు విజయవంతంగా చికిత్స పూర్తయింది. మిగిలిన ముగ్గురు బాధితుల చికిత్స, ఆరోగ్య పరిస్థితులను గెయిల్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స, ప్రయాణ ఏర్పాట్లు, వసతి ఖర్చులన్నింటినీ గెయిల్‌ భరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పేలుడు దుర్ఘటన అనంతరం నగరంతోపాటు ఆ పరిసర ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గెయిల్‌ ప్రారంభించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకు గెయిల్‌ అభివృద్ధి కార్యక్రమాల కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు మంత్రి చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు, ఇంటింటికీ వైద్యసేవలు అందించేందుకు మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌, నాణ్యమైన తాగునీటి సరఫరా వంటివి వాటిలో ప్రధానమైనవని ఆయన తెలిపారు. 

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Advertising
Advertising