విభ‌జ‌న అంశాల‌పై బాబు, ప‌వ‌న్ మాట్లాడ్డం లేదు!

విభ‌జ‌న హామీల‌ను సాధించుకోడానికి ఇదే స‌రైన స‌మ‌యం అని అంద‌రి అభిప్రాయం. జాతీయ స్థాయిలో మోదీ స‌ర్కార్ ఏర్పాటులో టీడీపీ కీల‌క పాత్ర పోషిస్తోంది. టీడీపీ, జేడీయూ మ‌ద్ద‌తు లేక‌పోతే, మోదీ స‌ర్కార్ ప్ర‌మాదంలో ప‌డుతుంది. అందుకే మోదీ స‌ర్కార్ మెడ‌పై క‌త్తి పెట్టైనా డిమాండ్లు సాధించుకోవాల‌న్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయ‌డం అత్యంత ప్రాధాన్య అంశాలు.

కానీ ప్ర‌త్యేక హోదా, ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఇవ్వాల్సిన ప్ర‌త్యేక నిధుల గురించి టీడీపీ, జ‌న‌సేన నోరు మెద‌ప‌డం లేదు. గ‌తంలో వైసీపీ స‌ర్కార్ ఫెయిల్ కావ‌డంతోనే కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. కూట‌మిలో బీజేపీ కూడా భాగ‌స్వామి అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో సాధ‌న సమితి అధ్య‌క్షుడు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ కీల‌క కామెంట్స్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌న్న వారికి దుర్మార్గులుగా చూస్తామ‌ని హెచ్చ‌రించారు. విభ‌జ‌న హామీలు అమ‌లైతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని ఆయ‌న అన్నారు. విభ‌జ‌న అంశాల‌పై చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడ్డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మోదీ స‌ర్కార్‌ను న‌యాన్నో, భ‌యాన్నో ఒప్పించి ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పోల‌వ‌రానికి కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌కుండా మోస‌గించింద‌ని విమ‌ర్శించారు. తెలుగుజాతి హ‌క్కుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రాజీ ప‌డొద్ద‌న్నారు. గ‌తంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో రాష్ట్రం శ్రీ‌లంక అవుతుంద‌ని విమ‌ర్శించిన‌ వారే, ఆ త‌ర్వాత ఇష్ట‌మొచ్చిన‌ట్టు హామీలిచ్చార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.  Readmore!

Show comments