కేసీఆర్ ఇక విచారణకు హాజరు కానట్లేనా?

పదేళ్ళపాటు ఎదురులేకుండా పరిపాలించిన, నియంత మాదిరిగా వ్యవహరించి కేసీఆర్ తన హయాంలో జరిగిన కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ వేసేవరకల్లా కోపంతో రగిలిపోతున్నాడు. మేధావినైన తననే ప్రశ్నించడమా అని ఆగ్రహిస్తున్నాడు. కరెంటు కొనుగోళ్లపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పనికిమాలింది అని వీరంగం వేస్తున్నాడు. ఆ కమిషన్ కు విచారణ అర్హతే లేదు పొమ్మన్నాడు.

జూన్ 15 న విచారణకు రావాలని ఆదేశిస్తే జులై ౩౦ వరకు సమయం అడిగాడు. కానీ కమిషన్ అందుకు ఒప్పుకోకుండా చెప్పిన తేదీకి వచ్చి తీరాల్సిందే అని చెప్పింది. సరిగ్గా నిన్నటితో గడువు పూర్తికాగానే కమిషన్ పై ఘాటు విమర్శలు చేస్తూ 12 పేజీల లేఖ రాశాడు. నరసింహా రెడ్డి తీరును తప్పుపట్టాడు. ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగానే ఆ లేఖ రాశాడు. తాను విచారణకు హాజరయ్యేది లేదని తేల్చిపారేశాడు. అసలు నరసింహారెడ్డికి విచారణార్హతే లేదని చెప్పిన తరువాత ఇంకెందుకు హాజరవుతాడు?

కరెంటు కొనుగోళ్ల విషయంలో, భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా కరక్టేనని చెప్పాడు. కరెంటు బాధలనుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన తనను మెచ్చుకోవాల్సిందిపోయి విచారణ చేయడమేమిటని ఎదురుదాడి చేశాడు. నిజానికి కేసీఆర్ లేఖలో రాసిన విషయాలనే కమిషన్ ఎదుట చెప్పొచ్చు. తన వాదన వినిపించవచ్చు. కమిషన్ ను కన్విన్స్ చేయొచ్చు. కానీ విచారణ కమిషన్ తనను విచారణకు రమ్మని పిలవడాన్ని కేసీఆర్ అవమానంగా భావించాడు.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినోడిని ఇంతగా అవమానిస్తారా? అని కుతకుత ఉడికిపోయాడు. ఇది రాజకీయ కక్షగా ఆయన భావించాడు. జస్టిస్ నరసింహా రెడ్డి ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఏం చెప్పినా ఆయన వినరని కేసీఆర్ ఫిక్స్ అయిపోయాడు. చట్టబద్ధంగా ఏర్పాటైన విచారణ కమిషన్ ముందు హాజరు కాకపోవడం నేరమవుతుందనే విషయం కేసీఆర్ కు తెలియదా? తెలియకుండా ఉండదు. తన లీగల్ టీమ్ తో మాట్లాడే ఉంటాడు. మరి వాళ్ళేం సలహా ఇచ్చారో. Readmore!

కేసీఆర్ విచారణకు రాడని క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కేసీఆర్ కాళేశ్వరం విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఆ నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు అన్నీ కేసీఆర్ చెప్పినట్లే చేశామని అంటున్నారు. తాము చెప్పింది ఆయన వినలేదని చెబుతున్నారు. దీనిపై విచారిస్తున్న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కేసీఆర్ ను పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ కేసీఆర్ రాకపోతే ఎలా రప్పించాలో తనకు తెలుసనీ చెప్పారు. దీనిపై సమన్లు వస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తాడో. హాజరవుతాడో, వీరంగం వేస్తాడో.

Show comments