సాక్షి గడపదాటని సలహాదారులు

ఒకరా? ఇద్దరా? మేధావులు, రాజకీయ ఆశ్రితులు, నేతలు.. ఎంతో మంది 2019 కి ముందు వైకాపా తరపున మైక్ పట్టుకున్నవారు, కలం విదిలించిని వాళ్లు, కదను తొక్కిన వాళ్లు. వీళ్లలో చాలా అంటే చాలా మందికి, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నూటికి తొంభైశాతం మందికి సలహాదారుల పదవులు లభించాయి. జీత భత్యాలు, అదనపు సదుపాయాలు అందాయి. చేసే పని లేకపోవచ్చు, ఖర్చు చేయడానికి నిధులు లేకపోవచ్చు. కానీ వాళ్లకు నెల నెలా రావాల్సినవి మాత్రం అందాయి. ఇప్పుడు వీళ్లంతా ఎక్కడ వున్నారు అంటే వెదుక్కోవాల్సి వస్తుందేమో?

లక్ష్మీపార్వతి దగ్గర నుంచి కొమ్మినేని శ్రీనివాస్ మీదుగా అమర్ వరకు బోలెడు మంది. వీళ్లంతా ఇప్పుడు సాక్షి గడప దాటడం లేదు. ఏం మాట్లాడినా అక్కడే, ఏం చెప్పినా అక్కడే. జనం ఈనాడు, జ్యోతి, సాక్షి, ఇంకా పలు మీడియా సంస్థలను పార్టీల వారిగా లెక్కల్లో వేసేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా కాలం. రెగ్యులర్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది.

అటు జనసేన తరపున సోషల్ మీడియా వింగ్ బలంగా పని చేస్తోంది. దాంతో పాటు అభిమానులు అంతా యంగ్ కావడంతో సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుతున్నారు. వాళ్లంతా ఇప్పుడు కూటమి అనే ప్రాతిపదికన తెలుగుదేశానికి బలం చేకూరుస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇండివిడ్యువల్ సోషల్ మీడియా వింగ్ బలంగా వుంది. ముఖ్యంగా ఆ పార్టీ అభిమాన సామాజిక వర్గ ఎన్నారైలు సోషల్ మీడియాను బాగానే వాడుతున్నారు.

వైకాపా దగ్గరకు వచ్చేసరికి సోషల్ మీడియా వింగ్ పార్టీ పరంగా బలంగానే వుంది కానీ, అది కామెంట్లు, తిట్లు, లేదా ఎదురుదాడి చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతోంది. ప్రజల్లోకి బలమైన సమాచారం పంపడం అన్నది మాత్రం ఎంగేజ్ చేసుకున్న సోషల్ మీడియా కుర్రాళ్లు చేయలేరు. జనాలను కన్విన్స్ చేయాలి అంటే కాస్త విషయం వున్నవాళ్లు వివరించాలి. కానీ ఇక్కడ మరో చిత్రమేమిటంటే ఈ వైకాపా మేధావులు అంతా సాక్షి గేట్ దాటడం లేదు. సోషల్ మీడియాలో బలంగా లేరు. వీళ్లకు సోషల్ మీడియా అక్కౌంట్ లు వున్నా, స్వయంగా వాడరు.

Readmore!

తమకు పార్టీతో వున్న మొహమాటం లేదా అనుబంధం అలా అలా సాక్షిలో చూపిస్తూ కాలం గడిపేస్తున్నారు. దాని వల్ల వీళ్లకు చేసినట్లు వుంటోంది తప్ప ఫలితం అంతంత మాత్రంగా వుంది. వీళ్లలో పోసాని తీరు వేరు, ఆయన అనుకున్నపుడల్లా ఓ ప్రెస్ మీట్ పెట్టి, అరిచి, ఆపై సైలంట్ అవుతారు. అది వేరే సంగతి.

Show comments