అవినాష్‌ను తిట్ట‌కుండా... నోర్మూయిస్తే ఎలా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మ‌రోసారి ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. ఇవాళ ఆమె క‌డ‌ప ఎంపీ స్థానానికి నామినేష‌న్ వేశారు. ముందుగా ఇడుపుల‌పాయ‌లో దివంగ‌త వైఎస్సార్ స‌మాధి వ‌ద్ద నామినేష‌న్ ప‌త్రాలు ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంత‌రం త‌న సోద‌రి డాక్ట‌ర్ సునీత‌, న‌ర్రెడ్డి తుల‌సిరెడ్డితో నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

ఆ త‌ర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న రాయి త‌గిలితే... దానికి హ‌త్యాయ‌త్నం అని సాక్షి ప‌త్రిక‌లో పెద్ద బ్యాన‌ర్ హెడ్డింగ్ పెట్టార‌ని విమ‌ర్శించారు. ఒక చిన్న రాయితో మిమ్మ‌ల్ని హ‌త్యే చేస్తారా? అని వెట‌క‌రించారు. చిన్న రాయితో కొట్ట‌డాన్నే హ‌త్య‌గా ప్ర‌చారం చేస్తే, మ‌రి వివేకాను ఏడు సార్లు నరికితే, త‌ల నుంచి మెద‌డు, ఎముక‌లు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని , దాన్ని మాత్రం గుండె పోటు అని ఎలా ప్ర‌చారం చేశార‌ని ఆమె ప్ర‌శ్నించారు. వివేకా చ‌నిపోయిన‌ప్పుడు సీబీఐ విచార‌ణ కోరారని జ‌గ‌న్‌కు గుర్తు చేశారు. మ‌రి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఎందుకు వ‌ద్ద‌న్నారో జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల‌ని ష‌ర్మిల నిలదీశారు.

సీబీఐ చార్జిషీట్‌లో నిందితుడిగా చేర్చిన అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్‌కు ఎందుకు టికెట్ ఇచ్చారో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆమె కోరారు. చంపిన వారు వాళ్లు వీళ్లు అని సీబీఐ చార్జిషీట్‌లో స్ప‌ష్టంగా చేర్చారని ఆమె పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీట్‌లో ఉన్న విష‌యాలే తాము మాట్లాడుతున్నామ‌న్నారు. సీబీఐ సాక్ష్యాధారాలనే తాము ప్ర‌స్తావిస్తున్నామ‌న్నారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు విఘాతం క‌లిగించేలా కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చారని ష‌ర్మిల విమ‌ర్శించారు. అవినాష్‌రెడ్డిని హంత‌కుడ‌ని తిట్ట‌డాన్ని కోర్టు ద్వారా నోర్మూయించార‌నే అర్థం వ‌చ్చేలా ఆమె తీవ్ర ఆవేద‌న చెందారు.

త‌న తండ్రి స‌మాధి వ‌ద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ఆశీర్వాదం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళన్నారు. కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.  భారీ మెజార్టీతో గెలుస్తాననే దృఢ నమ్మకం ఉందని ష‌ర్మిల తెలిపారు.

Show comments