రాజధాని నినాదం వర్కౌట్ అవుతుందా?

వైసీపీ ఎన్నికల అజెండాలో ఏమి ఉంటుందో తెలియదు. వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభలలో మూడు రాజధానుల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ ఉత్తరాంధ్రాలో మాత్రం విశాఖ రాజధాని గురించి వైసీపీ మంత్రులు సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు

వైసీపీకి ఓటు వేస్తే విశాఖ సహా ఉత్తరంధ్రలో అభివృద్ధి సాధ్యపడుతుందని చెబుతూ ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు. ముఖ్యంగా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ ఇదే అంశం మీద ప్రచారం చేస్తున్నారు. విశాఖ విజన్ అన్నది నెరవేరాలంటే రాజధాని రావాలని అంటున్నారు.

ఉత్తరాంధ్ర మీద విశాఖ మీద ఇప్పటిదాకా ముఖ్యమంత్రి జగన్ తప్ప చంద్రబాబు ఏ రోజూ దృష్టి పెట్టలేదు అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు చంద్రబాబుకు ఎంతసేపూ అమరావతి ఆరాటమే తప్ప ఉత్తరాంధ్ర మీద శ్రద్ధ లేదని ఆయన విమర్శిస్తున్నారు.

ఇదే మాటను మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. విశాఖ రాజధానిని తెచ్చుకోవాలన్నా ఉత్తరాంధ్రా అభివృద్ధి సాగాలన్నా వైసీపీనే మరోసారి అధికారంలోకి తెచ్చుకోవాలని ధర్మాన పిలుపు ఇస్తున్నారు. ఇంకో మంత్రి సీదరి అప్పలరాజు కూడా విశాఖ రాజధాని నినాదాన్ని అందుకుంటున్నారు.

భీమిలీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ మరో అడుగు ముందుకేసి వైసీపీ నెగ్గితే విశాఖ రాజధాని అవుతుందని జగన్ పరిపాలన జూన్ నుంచి విశాఖ నుంచి స్టార్ట్ చేస్తారు అని చెబుతున్నారు. ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కూడా విశాఖే మన రాజధాని అని ప్రచారం చేస్తున్నారు. విశాఖ రాజధాని గురించి ఇలా వైసీపీ నేతలు అంతా చెబుతున్నారు. 

జనాలు ఎలా రిసీవ్ చేస్తుంటారు అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ జనంలో అంతర్లీనంగా రాజధాని సెంటిమెంట్ కనుక బలంగా ఉంటే వైసీపీకే పట్టం కడతారు అని అంటున్నారు.

Show comments