నేను ఆ పని చేస్తా.. మీరు ఈ పని చేయండి

క్విడ్ ప్రో కో అనే మాట అందరికీ తెలుసు. నేను మీకు ఫలానా పని చేసి పెడతాను... మీరు నాకు ఫలానా పని చేసి పెట్టండి అనేది దీని అర్థం. అంటే పరస్పర ప్రయోజనాలన్న మాట. రాజకీయాల్లో క్విడ్ ప్రో కో ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలకు మధ్య పరస్పర ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సహజమైన విషయం. దీన్నెవరూ తప్పుగా భావించడంలేదు. 

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఓ ప్రపోజల్ పెట్టాడు. ఏమిటది? తాను భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఛామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తానని, ఆయన గెలుపు బాధ్యత పూర్తిగా తీసుకుంటానని చెప్పాడు. ఆయన గెలిచాక తనకు మంత్రి పదవి ఇవ్వాలని కండీషన్ పెట్టాడు. 

తాను ఆ పని చేస్తే మీరు ఈ పని చేయాలన్నాడు. ఈ ప్రపోజల్ కు అధిష్టానం ఒప్పుకుందని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సంప్రదాయం అందరికీ తెలిసిందే. ఎవరినైనా మంత్రిగా నియమించాలంటే అందుకు అధిష్టానం ఒప్పుకోవాలి. ఢిల్లీ పెద్దల ఆమోదం లేకుండా సీఎం ఏ నిర్ణయం తీసుకోలేడు. అందుకే రాజగోపాల్ రెడ్డి డైరెక్టుగా అధిష్టానానికి ప్రపోజల్ పంపాడు.

రాజగోపాల్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి వస్తుందని అనుకున్నాడు. కానీ ఆశ నిరాశ అయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశాడు. గతంలో బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టాడు. ఇది రేవంత్ రెడ్డి మనసులో ఉండొచ్చు. 

అన్న వెంకట రెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి ఇస్తే ఒకే కుటుంబం నుంచి రెండు మంత్రి పదవులు అవుతాయి. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కూడా ఎమ్మెల్యేనే. కాబట్టి తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయవచ్చు. 

ఒక కుటుంబం నుంచి ఇద్దరికీ పదవులు ఇస్తే పార్టీలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం ఒప్పుకుంది కాబట్టి మరి ఢిల్లీ పెద్దలు ఎలా టాకిల్ చేస్తారో చూడాలి.

Show comments