భాజపాను బుట్టలో వేసిన బాబు

భాజపా పొత్తు తెలుగుదేశం కేడర్ కు ఇష్టం లేదు. భాజపా డిమాండ్లు, సీట్ల‌ ఎంపికలు అస్సలు నచ్చలేదు. అయినా చంద్రబాబు ఒక్కరు మాత్రం భాజపా పొత్తు కోసం తహ తహలాడారు. వాళ్ల షరతులకు అంగీకరించారు. ఏమిటిదంతా అని తెలుగుదేశం జనాలు సోషల్ మీడియాలో గోల పెట్టారు. కానీ నెమ్మదిగా పరిస్థితి అర్థం కావడం మొదలైంది.

పేరుకే భాజపా కానీ అభ్యర్థులు చాలా మంది తెలుగుదేశం అనుకూల జనాలే. అక్కడే అర్థం అయింది. చంద్రబాబు చాణక్యం. చాలా తెలివిగా భాజపాను బుట్టలో వేసారని.

భాజపా పొత్తులోకి దూకింది. తమ పార్టీని తరతరాలుగా నమ్ముకున్న వారిని కొంత మందిని మాత్రం తీసుకుని, మిగిలిన సీట్లు అన్నీ తేదేపా తెలివిగా తానే తీసేసుకుందని అర్థమైంది. పైగా పొత్తు వంకతో, ఎన్నికల కమిషన్ నుంచి ఫేవరబుల్ నిర్ణయాలు సాధించడంలో తెలుగుదేశం తన పావులు కదపడం ప్రారంభించింది. కొందరు అధికారుల మీద పురంధేశ్వరితోనే ఫిర్యాదు చేయించడం, ఫలితాలు సాధించడం మొదలుపెట్టింది.

గత ఎన్నికల ముందు చంద్రబాబుకు ఏ విధమైన అష్ట దిగ్బంధనం ఎదురైందో, అదే పరిస్థితిని జగన్ కు క్రియేట్ చేసే పనిలో పడింది. నామినేషన్లు స్టార్ట్ అయ్యే సరికి జస్ట్ పదిశాతం మాత్రమే సాధించగలిగింది అని చెప్పాలి. ఇంకా ఎన్ని రకాల జగన్ ను దిగ్బంధనం చేస్తారు అన్నది ముందు ముందు చూడాల్సి వుంటుంది. అదే జరిగితే భాజపా మరోసారి నేరుగా తేదేపా బుట్టలో పడినట్లే.

గతంలో ఓసారి పడింది. తరువాత లెంపలు వేసుకుంది. తెలంగాణలో అయితే తమకు తేదేపా పొత్తే వద్దని అక్కడి పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు. కానీ ఆంధ్రలో ముందుగా పురంధేశ్వరి చేతిలోకి పగ్గాలు రప్పించారు. అక్కడి నుంచి ఆమె ద్వారా పావులు కదిపి భాజపాను పొత్తు ముగ్గులోకి దింపింది.

ఇప్పుడు నామినేషన్ల తరువాత జగన్ ను ఈ పొత్తు ద్వారా ఎలా కట్టడి చేస్తుందన్నది చూడాలి. అప్పుడు మరింత క్లారిటీ వస్తుంది తేదేపా జనాలకు బాబోరు మామూలోరు కారని. తాము అనవసరంగా కిందా మీదా అయిపోయామని.

Show comments