ఒక్క అయ్యన్నకు ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేలు తయారు!

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత మాజీ అయ్యన్నపాత్రుడు చివరి సారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ అయ్యన్న రాజకీయాన్ని జనంలో పెట్టి ఎండగడుతున్నారు.

పొరపాటున అయ్యన్నకు ఓటేస్తే కనుక ఒక్క ఓటుతో నలుగురు ఎమ్మెల్యేలను తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. అయ్యన్న ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఎమ్మెల్యేలుగా మారి దోచుకుంటారు అని ఉమా శంకర్ హాట్ కామెంట్స్ చేశారు.

అయ్యన్న సీనియర్ ఎమ్మెల్యే అని మంత్రిగా చేసాను అని ఎపుడూ చెప్పుకుంటారు కానీ ఆయన ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని పెట్ల సవాల్ చేశారు. అవినీతి అక్రమాలే అయ్యన్న చిట్టాగా ఉన్నాయని ఆరోపించారు. అయ్యన్న నర్శీపట్నాన్ని అభివృద్ధి చేయలేకపోయారు అని పెట్ల విమర్శించారు.

తాను అయిదేళ్ల కాలంలో నర్శీపట్నానికి అయిదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజిని తెచ్చాను అని ఆయన చెప్పారు. నర్శీపట్నం అభివృద్ధి కఒసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా తనను గెలిపిస్తే తాను ఒక్కడినే ఎమ్మెల్యేగా ఉంటానని తన కుటుంబ సభ్యులెవరూ పొరపాటున కూడా పెత్తనం చేయరని పెట్ల చెప్పారు.

అయ్యన్నకి ఓటేస్తే కుటుంబ పాలనకు తెర తీసినట్లే అని వైసీపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. గత సారి పాతిక వేల పై చిలుకు ఓట్ల తేడాతో తాను అయ్యన్న మీద గెలిచాను అని ఈసారి అది కాస్తా మరింత పెరుగుతుంది తాను 30 వేలకు తగ్గకుండా ఈసారి గెలవబోతున్నాను అని పెట్ల జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అలాగే తాను మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గడం అంతే  ఖాయమని  పెట్ల ధీమాగా చెప్పారు. నర్శీపట్నంలో వైసీపీ టీడీపీ పోరు భీకరంగా ఈసారి సాగబోతోంది.

Show comments