ఇలా ఎందుకు చేయకూడదు ‘బాబూ’

జగన్ పాలన మీద విపక్షాలు చేసే కీలక ఆరోపణలు బొలెడు. వీటిలో ఏం తినేటట్లు లేదు.ఏం కొనేటట్లు లేదు అనేదే కీలకం. పెట్రోలు రేట్లు ఎక్కువ. పెట్రోలు మీద బాదేసి ఆటో డ్రైవర్లకు జస్ట్ ఓ పదివేలు పడేస్తున్నారు జగన్ అని ఆరోపణ. చెత్త పన్ను మీద రాసిన వార్తలు ఇన్నీ అన్నీ కాదు. జనాలను రెచ్చ గొట్టి చెత్త పన్ను వసూలుకు వచ్చిన వారితో గొడవలు పడేలా చేసారు. ఇక మున్సిపల్ పన్నుల సంగతి సరేసరి. లిక్కర్ క్వాలిటీ లేదు. ఎక్కువ రేట్లు అన్నది మరీ స్పెషల్.

చంద్రబాబు తన ఎన్నికల హామీల్లో భాగంగా తక్కువ రేట్లకు నాణ్యమైన లిక్కర్ సరఫరా చేస్తామని మాట ఇచ్చారు. దీని వల్ల మందు బాబుల ఓట్లు కూటమికి అనుకూలంగా మారే అవకాశం కొంతయినా వుంది. వుంటుంది. కానీ మధ్య తరగతి వారి ఓట్లు సాధించాలంటే అంత కన్నా సులువైన ఉపాయాలు వున్నాయి.

పూర్వం రోజుల్లో రాజకీయ నాయకుల హామీల్లో ఎక్కువగా వినిపించే హామీ ఒకటి వుండేది. అది మరేమీ కాదు. ధరలు తగ్గిస్తాం అనేదే. ప్రతి ఎన్నికల్లో పేదరిక నిర్మూలన, ధరలు తగ్గిస్తాం అనే రెండూ వుండేవి.

ఓల్డ్ అయినా గోల్డ్ లాంటి హామీ ఇది. ఎందుకంటే గత అయిదేళ్లుగా మీడియా ఏమని టముకేస్తోంది. జగన్ వల్ల ధరలు పెరిగిపోయాయి. దేశం మొత్తం మీద పెట్రోలు ధరలు ఆంధ్రలోనే ఎక్కువ అని కదా… అలాగే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు పన్నులు దారుణంగా పెంచేసాయి అని కూడా. ఇక చెత్త పన్ను గోల వుండనే వుంది. చెత్త పన్ను కట్టము అని జనాలు రోడ్డెక్కిన సంఘటనలు వున్నాయి.

అందువల్ల కూటమి ఇప్పుడు వీటి మీద దృష్టి పెడితే. ఏ హామీ అయినా పేదవాడికి పనికి వస్తుంది. మధ్యతరగతి వాడికి కాదు. అలా అందరికీ పనికి రావాలంటే అధికారంలోకి రాగానే తొలి సంతకం పెట్రోలు మీద సెస్ తగ్గించడానికి చేయాలి.  మున్సిపాల్టీలను, కార్పొరేషన్లను కంట్రోలు చేసి పన్నులు తగ్గిస్తామని హామీ ఇవ్వాలి.

అప్పుడు కచ్చితంగా కూటమి విజయావకాశాలు పెరుగుతాయి. డౌటే లేదు. కానీ ఇచ్చే హామీలు, సబ్జెక్ట్ టు కండిషన్ అని కాకుండా, నేరుగా, క్లారిటీ గా, వెంటనే అమలు చేసే విధంగా ఇస్తేనే జనం నమ్ముతారు. లేదంటే నమ్మరు. అది కూడా దృష్టిలో వుంచుకోవాలి.

Show comments