అంత గనం లేటెందుకు రేవంత్ సాబ్!

రేవంత్ రెడ్డి ఏ హామీలనైతే ప్రధానంగా ప్రస్తావించి.. అధికారంలోకి వచ్చారో.. ఆ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, భారాస నాయకులు పదేపదే ఆరోపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీల్లోనూ ప్రజలను మోసమే చేసారని అంటున్నారు. అలాగే రైతురుణమాఫీ మాట ఏమైందని, రెండు లక్షలు రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ నాయకులు ఊర్లకు వస్తే గల్లాపట్టుకుని నిలదీయాలని భారాస నాయకులు పదేపదే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో రేవంత్ తన ఎన్నికల ప్రచార సభలో గట్టిగానే హామీ ఇచ్చారు గానీ.. ఆ హామీ ఆయన క్రెడిబిలిటీని పెంచే విధంగా లేదు.

నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ప్రధానంగా ఆయన రైతు రుణమాఫీ గురించే ప్రస్తావించారు. ఆగస్టు 15వ తేదీలోగా ఏకకాలంలో రెండులక్షల రూపాయల రుణమాఫీ చేసేస్తామంటూ ప్రకటన చేశారు.

నిజానికి ఇది రైతన్నలకు చాలా తీపి కబురు కింద లెక్క. సాధారణంగా ఏ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చినా.. ఆ మాఫీని విడతలు విడతలుగా సాగదీస్తూ.. అయిదేళ్ల పాటూ కొనసాగించి.. మళ్లీ ఎన్నికలు ముంచుకొచ్చాక చివరి విడత డబ్బులు విడుదల చేసి.. ఆ రకంగా రాజకీయ మైలేజీ పొందాలని అనుకుంటుంది. రేవంత్ రెడ్డి అలాకాకుండా.. ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసేస్తాననడం వరకు చాలా బాగుంది. కానీ.. ఎన్నడో ఇచ్చిన ఎన్నికల హామీకి సంబంధించి ఆగస్టు 15 దాకా అంతదూరం గడువు పెడుతున్నారు ఎందుకు? అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటోంది.

ఎందుకంటే.. ఒకవైపు స్వయంగా రేవంత్ రెడ్డి.. ‘ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు’ అని అంటున్నారు. ఆ మాటల అర్థం ఏమిటన్నమాట.. కోడ్ రాకుండా ఉన్నట్లయితే.. ఈ పాటికి రుణమాఫీ జరిగిపోయేది అనే కదా! మరి అలాంటప్పుడు కోడ్ వలన మాత్రమే రుణమాఫీలో జాప్యం జరిగి ఉంటే.. కోడ్ ఎత్తేసిన వెంటనే చేసేయాలి కదా? అనేది ప్రజల సందేహం.

మే13 తో రాష్ట్రంలో ఎన్నికలే ముగిసిపోతాయి. అక్కడితో కోడ్ ఆంక్షలు కూడా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉండవు. కానీ అమలు చేయడానికి రేవంత్ మూడు నెలల గడువు ప్రకటించారు ఎందుకు? అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. ఇది కేవలం రేవంత్ యొక్క మాటల గారడీ అని వారు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ కు నిజాయితీ ఉంటే ఎన్నికల కోడ్ ముగిసిన రెండు వారాల్లోగా రుణమాఫీ ఏకకాలంలో పూర్తిచేయాలని, ఆయన చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Show comments