బాబు కుట్ర‌లో బీజేపీ విల‌విల‌

వైఎస్సార్ జిల్లా బ‌ద్వేలు టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ‌ బీజేపీ నాయ‌కుడు ప‌న‌తల సురేష్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒక రోజు ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోశ‌న్న‌కు బ‌ద్వేలు సీటును కేటాయించిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన సురేష్ త‌న‌కే సీటు వ‌స్తుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అవ‌న్నీ అడియాస‌ల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం క‌డ‌ప‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు చేసిన కుట్ర‌లో బీజేపీ ప‌డి విల‌విలలాడుతోంద‌ని అన్నారు. అస‌లు టీడీపీతో బీజేపీ, జ‌న‌సేన పొత్తే చంద్ర‌బాబు కుట్ర‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. పొత్తుల వ‌ల్ల బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆయ‌న వాపోయారు. ఎవ‌రి నోట్లో మ‌ట్టి కొట్ట‌డానికి బ‌ద్వేలులో రోశ‌న్న‌కు టికెట్ ఇప్పించుకున్నారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

క‌డ‌ప గ‌డ్డ‌పై ఎన్నో ఉద్య‌మాల్లో పాల్గొన్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అలాగే ఉద్య‌మాల్లో భాగంగా అరెస్ట‌యి బేడీలు వేసుకుని మ‌రీ ప‌రీక్ష‌లు రాశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌శ్నించే గొంతుకైన త‌న‌ను చంద్ర‌బాబునాయుడు అణ‌గొక్కేందుకు ప్ర‌య‌త్నించార‌ని సురేష్ ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో నిఖార్సైన బీజేపీ కార్య‌క‌ర్త పోటీలో వుండాల‌నే ఉద్దేశంతో త‌న‌ను ముందుకు తెచ్చార‌న్నారు.

ఉప ఎన్నిక‌ల్లో త‌న‌కు 22 వేల ఓట్లు వ‌చ్చాయ‌ని సురేష్ గుర్తు చేశారు. ఆ కార‌ణంగానే ఈ ఎన్నిక‌ల్లో బ‌ద్వేలు సీటును బీజేపీకి కేటాయించార‌న్నారు. అయితే రాత్రికి రాత్రే బ‌ద్వేలు సీటును టీడీపీ కార్య‌క‌ర్త‌కు ఇప్పించుకున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా బీజేపీ అధిష్టానం ఆలోచించాల‌ని ఆయ‌న కోరారు. చంద్ర‌బాబు ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే, రాష్ట్ర‌మంతా తిరిగి ద‌ళితుల‌కు ఆయ‌న చేస్తున్న అన్యాయంపై ప్ర‌చారం చేస్తాన‌న్నారు. బాబుకు ద‌ళితులు ఓట్లు వేయ‌వ‌ద్ద‌ని ప్ర‌చారంలో చెబుతాన‌ని హెచ్చ‌రించారు.

Show comments