అప్పుడూ అదే మాట.. ఇప్పుడూ అదే మాట

ఏ రాజకీయ పార్టీలోనైనా నాయకులు జీవితాంతం ఆ పార్టీకే విధేయంగా ఉంటారనుకోవడం కేవలం భ్రమ. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లో నాయకులు లైఫ్ లాంగ్ పార్టీకి కట్టుబడి విధేయులుగా ఉంటారని చెప్పుకునేవారు.

పాత తరం నాయకులు ఈ విధంగా ఉండేవారు. వాళ్లకు పదవులు వచ్చినా రాకపోయినా, ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా పార్టీ మారకపోయేవారు. ప్రలోభాలకు లొంగకపోయేవారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ కమ్యూనిస్టు పార్టీల నాయకుల్లోనూ విధేయత తగ్గిపోయింది. కొందరు పార్టీలు ఫిరాయిస్తున్నారు.

నిష్ఠగా ఉంటారని పేరున్న ఎర్ర పార్టీలోనే  మార్పు వస్తే ఇక సర్వ అవలక్షణాలు ఉన్న పార్టీల సంగతి చెప్పేది ఏముంది ? కొందరు నాయకులు తాము ఉన్న పార్టీలకు వీర విధేయులం అన్నట్లుగా మాట్లాడతారు. కానీ అవసరమొస్తే తమ స్వార్ధం తాము చూసుకుంటారు. ఇలాంటివారు చాలామంది ఉన్నారు.

అందరి గురించి చెప్పుకోవడం సాధ్యం కాదుగానీ కంచర్ల కేశవరావు గురించి చెప్పుకుందాం. కంచర్ల కేశవరావు అంటే అర్థం కాకపోవొచ్చు. కె.కేశవరావు అంటే సులభంగా తెలుస్తుంది. కేకే అంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది.

సరే... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చోటా నాయకులతో పాటు మోటా నాయకులు (పేరున్న, సీనియర్ నాయకులు) కూడా ఆ పార్టీలో చేరుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. గతంలో గులాబీ పార్టీ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపులను ప్రజలు పాప కార్యంగా భావించడంలేదు.

అందుకే రాజకీయాల్లో తల పండిపోయిన కేకే కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఓ మాట అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీలోనే చనిపోవాలని ఉంది అంటూ కామెంట్ చేశారు.

అంటే ఇన్నేళ్లు ఆయన బీఆర్ఎస్ అన్య మనస్కంగానే ఉన్నాడని అనుకోవాలా? విచిత్రమేటంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడూ ఇదే మాట అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. మరి ఇప్పుడైనా స్థిరంగా కాంగ్రెస్ లోనే ఉంటారా?  ఎందుకంటే ఇప్పుడు ఆయనకు 84 ఏళ్ళు.  

తాను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే అని కూడా అన్నారు. తెలంగాణా మలి దశ ఉద్యమంలో ఆయన కేసీఆర్ పార్టీలో చేరారు. అప్పటికే ఆయన కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. ఆయన కేసీఆర్ పార్టీలో చేరే సమయానికి కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రస్ అధికారంలోకి రాదనే అంచనా ఉండొచ్చు. ఇప్పుడు గులాబీ పార్టీకి భవిష్యత్తు లేదని అంచనా వేశారు. అందుకే తాను పుట్టిన ఇంటికే వెళుతున్నారు.

Show comments