క‌డ‌ప టీడీపీ నేత‌ల‌తో ఆడుకుంటున్న బాబు!

క‌డ‌ప టీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబునాయుడు ఆడుకుంటున్నారు. క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థి మీరే అంటూ... రోజుకో నాయ‌కుడి పేరుతో ఐవీఆర్ఎస్ స‌ర్వే చేప‌డుతూ త‌న మార్క్ వెన్నుపోటు పొడుస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. టికెట్ ఇవ్వ‌ని నేత‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు చంద్ర‌బాబు ఎంపీ అభ్య‌ర్థి అనే వ్యూహాన్ని ర‌చించిన‌ట్టు టీడీపీ నేత‌లు ప‌సిగ‌ట్టారు. దీంతో అంద‌ర్నీ చంద్ర‌బాబు మోస‌గిస్తున్నార‌ని అనుమానిస్తున్నారు.

తాజాగా క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా ఉక్కు ప్ర‌వీణ్ పేరుతో చంద్ర‌బాబునాయుడు ఐవీఆర్ఎస్ స‌ర్వే చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొద‌ట టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, జిల్లా అధ్య‌క్షుడైన ఆర్‌.శ్రీ‌నివాస్‌రెడ్డి పేరుతో స‌ర్వే చేయించారు. ఆయ‌న్ను ప‌క్క‌న ప‌డేశారు. ఆ త‌ర్వాత వివేకా భార్య సౌభాగ్య‌మ్మ‌, ఆమె కుమార్తె డాక్ట‌ర్ సునీత పేర్ల‌తో త‌న అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు పెట్టారు. వివేకా భార్య‌, కుమార్తె త్వ‌ర‌గానే బాబు ప‌న్నాగాన్ని గుర్తించి, త‌ప్పుకున్నారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి పేరుతో స‌ర్వే చేయించారు. దీంతో వీర‌శివారెడ్డి అనుచ‌రుల్లో ఉత్సాహం వ‌చ్చింది. త‌మ నాయ‌కుడు క‌డ‌ప ఎంపీ బ‌రిలో వుంటార‌నే ప్ర‌చారం చేసుకున్నారు. ఆయ‌న అనుచ‌రుల్లో ఆనందం కొన్ని రోజులు మాత్ర‌మే. ఆ త‌ర్వాత జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి పేరుతో స‌ర్వే చేయించి కొత్త నాట‌కానికి తెర‌లేపారు. ఈయ‌న అభ్య‌ర్థిత్వం మూడు రోజుల ముచ్చ‌టే.

ఇప్పుడు కొత్త కృష్ణుడు తెర‌పైకి వ‌చ్చారు. ఆయ‌నే ఉక్కు ప్ర‌వీణ్‌రెడ్డి. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్‌. ఈయ‌న పేరుతో క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా వుంటే ఎలా వుంటుంద‌ని స‌ర్వే చేప‌ట్టారు. క‌డ‌ప పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఓట‌ర్ల‌కు ఫోన్‌కాల్స్ వెళుతున్నాయి. ఇదేంద‌య్యా క‌నీసం రెండు మూడు రోజుల గ్యాప్ కూడా లేకుండానే... ఇట్లా అభ్య‌ర్థుల్ని మారుస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఒక‌ట్రెండు రోజుల్లో బ‌ద్వేలు టీడీపీ ఇన్‌చార్జ్ రితీష్‌రెడ్డి పేరుతో స‌ర్వే చేయిస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

అస‌లు విష‌యం ఏంటంటే.. వీర‌శివారెడ్డి, భూపేష్‌రెడ్డి, ప్ర‌వీణ్‌రెడ్డిల‌కు చంద్ర‌బాబు టికెట్లు ఇవ్వ‌లేదు. దీంతో వారిలో తీవ్ర అసంతృప్తి వుంది. కానీ క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థులుగా ప‌రిశీలించామ‌ని చెప్పేందుకు ఇలా స‌ర్వేలు చేయించి, వారిని మ‌భ్య‌పెట్ట‌డ‌మే వ్యూహంగా క‌నిపిస్తోంది. కానీ ఒక్క‌టైతే నిజం... క‌డ‌ప‌లో దీటైన అభ్య‌ర్థి టీడీపీకి దొర‌క‌లేదు. దీంతో చివ‌రికి ఎవ‌రో ఒక‌రులే అని బ‌ల‌హీనమైన అభ్య‌ర్థిని నిల‌బెట్టే దుస్థితి. జ‌ర‌గ‌బోయేది ఇదే. 

Show comments