మాజీ మంత్రికి అధికార పార్టీ షరతులు!

రాజకీయ నాయకులు పార్టీలు మారడం చాలా మామూలు వ్యవహారం. ఈ రోజుల్లో అది నేరం కాదు, పాపం కాదు, ద్రోహం కాదు. పార్టీలు మారితేనే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి కాబట్టి ఆ పని చేయక తప్పదు. కొందరు నాయకులకు పార్టీలు మారి వారు అనుకున్న రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడం ముఖ్యం. 

అలాంటి నాయకుల్లో మాజీ మంత్రి గంటా శ్రీవివాసరావు ఒకడు. ఈయన ఇప్పటివరకు మూడు పార్టీలు మారాడు. ఏ పార్టీలో చేరినా పదవి సాధించడం ఈయన ప్రత్యేకత. ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నాడు. అంటే అధికార వైసీపీలో చేరబోతున్నాడు. గతంలోనే చేరాలని ప్రయత్నాలు చేసినా కొన్ని కారణాలవల్ల ఆ ప్రయత్నాలు నెరవేరలేదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2014 ఎన్నికలలో విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు మంత్రి వ‌ర్గంలో మంత్రి అయ్యారు. 

అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఈయన రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశాడు. ఇప్పుడు టీడీపీని వీడబోతున్నాడు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తెలుస్తుందన్న నమ్మకం గంటాకు లేదు. కాబట్టి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలో ఎంట్రీ దాదాపు ఖరారైంది. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. రేపు (డిసెంబర్ 1) గంటా జన్మదినం కాబట్టి తన భవిష్యత్ రాజకీయ ప్రకటన చేస్తారని  తెలుస్తోంది. 

వైసీపీలో గంటా చేరిక పైన కొంత కాలంగా ప్రచారం సాగుతున్నా..గత వారంలో గతంలో గంటాతో కలిసి పని చేసిన ప్రస్తుత సీనియర్ మంత్రితో పాటుగా ముఖ్యమంత్రి జగన్ సమీప బంధువుతో చర్చలు జరిగాయి. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో టీడీపీని బలహీనపర్చే ఆపరేషన్ ను వైసీపీ వేగవంతం చేసింది. ఆ పార్టీ పైన పై చేయి సాధించటానికి ఇదే సరైన సమయంగా వైసీపీ భావిస్తోంది. జనవరి నెలాఖరులోగానే ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి చేరికలను వేగవంతం చేసే విధంగా కార్యాచరణ డిసైడ్ అయింది.

ప్రధానంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ నేతలు ఎవరెవరు గంటా తో వైసీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే జాబితా పైన చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటి వరకు గంటాతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యేకు మాత్రమే వైసీపీ నుంచి హామీ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. 

విశాఖలో టీడీపీ నేతలతో గంటా కు ఉన్న పరిచయాలను సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ముందుగా గంటా పార్టీలోకి వస్తే ఆ తరువాత దశల వారీగా ఆయన టీం వైసీపీలోకి వస్తుందని చెబుతున్నారు. కీలక నాయకులను టీడీపీ నుంచి తీసుకురావాలని వైసీపీ నాయకత్వం గంటాకు షరతులు పెట్టిందట. 

ఇదే గంటా శ్రీనివాసరావు ఈ ఏడాది ఏప్రిల్ లో వైసీపీ మీద ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ బలవంతుడు కాదు..బలహీనుడని కేబినెట్ విస్తరణతో తేలిపోయిందని గంటా వ్యాఖ్యానించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామంటే బీసీలు వైసీపీని నమ్ముతారా అని గంటా ప్రశ్నించారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు చేసినా..బీసీలు ఎప్పుడూ టీడీపీతోనే ఉంటారని అన్నారు. 

మాజీ మంత్రులు.. కొందరు ఎమ్మెల్యేలు సైతం టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అప్పట్లో అన్ని కథ‌లు వినిపించిన గంటా చివరకు వైసీపీ పంచనే చేరుతున్నారు. పదవీ వ్యామోహం అటువంటిది మరి. 

Show comments