మంత్రి నోట ముందస్తు మాట...నిజమెంత...?

ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. దాని మీద వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి చాలా సార్లు వివరణ ఇచ్చారు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని, వారి తీర్పుని తాము గౌరవించి అయిదేళ్ళూ పాలన చేస్తామని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు.

అయినా సరే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఎక్కడా ఆగడంలేదు. విపక్షాలలో టీడీపీ అయితే జగన్ సీఎం అయిన తొలి ఆరు నెలల నుంచే ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం మొదలెట్టేసింది. ఈ మధ్య కూడా చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడైనా వస్తాయని స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆరాటంగానే అంతా దాన్ని చూశారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు.

ఇపుడు ఒక మంత్రి, వైసీపీలో కీలకమైన నేతగా ఉన్న సీదరి అప్పలరాజు ఎన్నికలు ఎపుడైనా రావచ్చు అంటూ మాట్లాడడంతో ఇది సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా పలాసాలో కొత్తగా నిర్మించిన తన క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈ కామెంట్స్ చేశారు.

ఎన్నికలకు సిద్ధం కండి అంటూ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తూనే ఎపుడైనా ఎన్నికలు వస్తాయని మంత్రి చెప్పడమే ఇపుడు రాజకీయంగా చర్చకు తావిస్తోంది అంటున్నారు. మంత్రి నోట ముందస్తు మాట వచ్చింది అంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అది లోతైన చర్చగా ఉందనే అంతా అంటున్నారు. ఊరకే మంత్రి ఆ మాట చెప్పరు కదా అని అన్నవాళ్ళూ ఉన్నారు.

ఇందులో నిజమెంత అనేది కాలక్రమంలో తెలుస్తుంది కానీ రాజకీయాల్లో కేవలం అయిదేళ్ళ అనుభవం మాత్రమే ఉన్న డాక్టర్ మంత్రి గారు ఊరకే అలా అనరు కదా అనే అంతా అంటున్నారు. ముందస్తు ఎన్నికల మీద వైసీపీలో చర్చ అయితే సాగుతోంది అన్నది మంత్రి మాటల బట్టి అర్ధమవుతోంది అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వైసీపీ వెళ్లాలనుకుంటే అది వ్యూహంగా ఉంటుంది. పైగా అది లాస్ట్ మినిట్ లో కానీ బయటపడే పరిస్థితి ఉండదు. మంత్రి గారు అతి ఉత్సాహంతో ఈ ప్రకటన చేశారా లేక నిజంగానా అన్నది సొంత పార్టీతో పాటు బయట వారూ తర్కించుకునే పరిస్థితి ఇపుడు ఉంది.

Show comments