Kantara Review: మూవీ రివ్యూ: కాంతార

టైటిల్: కాంతార
రేటింగ్: 3/5
తారాగణం: రిషబ్ శెట్టి, కిషోర్, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, మానసి సుధీర్, ప్రమోద్ శెట్టి, శనిల్ గురు తదితరులు 
కెమెరా: అరవింద్ ఎస్. కాశ్యప్ 
ఎడిటింగ్: కె. ఎం ప్రకాశ్, ప్రతీక్ శెట్టి 
సంగీతం: అజనీష్ లోకనాథ్ 
నిర్మాత: విజయ్ కరగండూర్ 
దర్శకత్వం: రిషబ్ శెట్టి 
విడుదల తేదీ: 15 అక్టోబర్ 2022

కేజీఎఫ్ సినిమాతో హొంబలే బ్యానర్ దేశం మొత్తంలో ఒక స్థాయిని సంపాదించుకుంది. ఆ సంస్థ నుంచి వస్తున్న సినిమా అనగానే క్రిటికల్ గా కాకుండా ఓపెన్ మైండ్ తో చూసే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. కొత్తగా వచ్చిన "కాంతార" ట్రైలర్ ఆకట్టుకుంది. ఏదో విషయం ఉందనిపించింది. ఇంతకీ ఏముందో చూద్దాం. 

కథగా చెప్పాలంటే ఒక అటవీప్రాంతంలోని కుగ్రామం. రాజుల కాలం నుంచి అక్కడొక ఆనవాయితీ ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు పూనుతుంటాడు. అతను ఆ పూనకంలో ఊరి పెద్దకి ఊరి మేలు కోసం దిశానిర్దేశం చేస్తుంటాడు. ఆ క్రమంలో తరాలు గడుస్తుంటాయి. 1990 ల కాలం వస్తుంది. అక్కడ కూడా పూనకం వచ్చే వ్యక్తి ఉంటాడు. ఊరి పెద్దకి భూదాహం. పేదల భూములన్నీ లాక్కోవాలనుకుంటాడు. ఇంతకీ పూనకం వచ్చే వ్యక్తి మన హీరో శివకి తండ్రి. కానీ ఊరి పెద్ద దైవ ధిక్కారం వల్ల ఆ పూనకంలోనే అతను మిస్టీరియస్ గా మాయమైపోతాడు. ఇక తిరిగిరాడు. హీరో పెరిగి పెద్దవుతాడు. తర్వాత ఏం జరుగుతుందనేది కథ. ఈ కథలో అటవీభూములు, వాటి అక్రమణలు మొదలైన అంశాలకు సంబంధించిన కథ సమాంతరంగా నడుస్తుంటుంది. 

కథ ఇది..అని అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇంటర్వల్ వరకు అసలు పాయింట్ ఏంటనేది క్లారిటీయే రాదు. ఒక జానర్ అని కాకుండా అన్నీ మిళితం చేసి కలగాపులగంగా రాసుకున్న కథ ఇది. అయినప్పటికీ మ్యాజిక్ వచ్చి లాజిక్ ని పూర్తిగా మింగేసింది. 

కథ‌ ఎలా ఉన్నా సాంకేతికత బలంగా ఉంటే ప్రేక్షకుల్ని ఎలా కూర్చోపెట్టొచ్చో పాఠం చెప్పే సినిమా ఇది. సాంకేతికత అనేది స్క్రీన్ ప్లే, కెమెరా, ఎడిటింగ్, నేపథ్య సంగీతాల్లో ప్రధానంగా నిక్షిప్తమై ఉంటుంది. అవన్నీ అద్భుతంగా ఉండడం వల్ల కథలో కూడా ఏదో అద్భుతముందనే భావన కలుగుతుంది. అభూతకల్పన అయినా, రియలిస్టిక్ అయినా, సూపర్ నేచరల్ అయినా, క్రైం అయినా..ఏ జానర్ అయినా కూడా సాంకేతికతతో హిస్టిరికల్ గా అద్భుతాన్ని సృష్టంచగలిగితే కథలో లోపాలు కూడా ప్రేక్షకుల అనుభూతికి అడ్డురావు. 

తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. ఎక్కడా వాడుకలో లేని పదాలు లేవు. పాటల్లో సాహిత్యం కూడా తెలుగుతనం ఉట్టిపడుతూ వినసొంపుగ ఉన్నాయి. ఎక్కడా డబ్బింగ్ సినిమా పాటల్లాగ లేవు. 

నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి హైలైట్స్. తెర మీద సినిమా చూస్తున్నట్టు కాకుండా ఆ ప్రపంచంలో ఉన్న భావన కలిగించాయి ఆ రెండూ. అలాగే కెమెరా వర్క్, లైటింగ్ కూడా. ఎడిటింగ్ కూడా ఎక్కడా గ్రిప్ తగ్గకుండా సాగింది. 

కథ, కథనాల విషయానికొస్తే కొంచెం రంగస్థలం, కాస్త తుంబాడ్ సినిమాలతో పాటు పురాణాల్లోని వరహావతార కథ స్ఫూర్తి చెదురుమొదురుగా కనిపిస్తాయి. అన్ని స్ఫూర్తులున్నా ఇది పూర్తిగా కొత్త కథ. తెలుగువారికి తెలిసిన పేరున్న నటీనటులు ఒక్కరూ లేకపోయినా సౌండ్ ఎఫెక్ట్స్ తోటి, కెమెరా వర్క్ తోటి కట్టిపారేసిన సినిమా ఇది. 

కన్నడ సినీ రంగం హఠాత్తుగా కేజీఎఫ్ తో తన సాంకేతిక శక్తి ఎమిటో చూపించింది. దానికి ఏ మాత్రం అనుకరణ కాకుండా మరొక కోణంలో ఈ కాంతార కన్నడసినీరంగ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. 

భూమి మీద ఆశ, దైవ ధిక్కారం..ఈ రెండూ వరాహపురాణంలోని హిరణ్యాక్షుడి లక్షణాలు. ఇక్కడున్న విలన్ కి ప్రధానంగా ఉన్నవి ఆ రెండు గుణాలు. అసుర లక్షణాల్లో హింస కూడా ప్రధానమైంది కనుక అది విలన్లో ఎలాగో ఉంటుంది. అసురసంహారం అయిన వెంటనే విష్ణువు అవతారపరిసమాప్తి చేసే ఘట్టాన్ని స్ఫురించేలా ఇక్కడ కథనం ముగుస్తుంది. మరలా నరసింహావతారంతో సీక్వెల్ ఉంటుందేమో అన్నట్టుగా కథానాయిక గర్భంపై కెమెరా ప్యాన్ చేసి ఆపడం జరిగింది చివరిగా. 

అలాగే రంగస్థలంలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ ఒకే పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇందులోని అచ్యుత్ కుమార్ పాత్ర. ఆ రకంగా స్క్రీన్ ప్లే, గ్రామీణ నేపథ్యాలు రంగస్థలాన్ని గుర్తు చేస్తుంటాయి. 

ఇక రెండు మూడు టైం లైన్స్ లో కొనసాగే కథతో సూపర్ నేచురల్ అంశాలతో కూడిన మిస్టరీ కోణం తుంబాడ్ నుంచి స్ఫూర్తి పొందినట్టు అనిపిస్తుంది. 

కథానాయక పాత్రలో రచయిత దర్శకుడు అయిన రిషబ్ శెట్టి చక్కగా ఒదిగిపోయాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి వెండితెర మీద కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించగలిగాడు. విలన్ పాత్రలో అచ్యుత్ కుమార్ డబుల్ షేడ్ లో నటించి మెప్పించాడు. హీరోయిన్ గా సప్తమీ గౌడ పర్వాలేదు. మిగిలిన నటీనటులందరూ తమ తమ పరిధుల్లో పాత్రకి తగ్గట్టు నటించారు. 

కొత్త తరహా కథలు రావాలి అని కోరుకునే వారికి "కాంతార" కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కథలో కచ్చితంగా లాజిక్ ఉండాలనుకునే వారికి మాత్రం ఆయాసాన్నిస్తుంది. సినిమా అంటే సాంకేతికపరమైన మేజిక్ ఉంటే చాలు అనుకునే వారికి అనుభూతి చెందే అవకాశాన్నిస్తుంది. మొత్తంగా ఈ సినిమా వెరైటీగా ఉందనిపిస్తుంది. 

బాటం లైన్: కన్నడ రంగస్థలం

Show comments

Related Stories :