The Ghost Review: మూవీ రివ్యూ: ది ఘోష్ట్

టైటిల్: ది ఘోష్ట్
రేటింగ్: 2/5
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు
కెమెరా: ముకేష్
ఎడిటింగ్: ధర్మేంద్ర
సంగీతం: భరత్ సౌరభ్, మార్క్ కె రాబిన్
నిర్మాత: సునీల్ నారంగ్, శరత్ మరార్, రాం మోహన్ రావు
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2022

నాగార్జున హీరోగా మరొక కాప్ స్టోరీ అనగానే వైల్డ్ డాగ్, ఆఫీసర్ సినిమాలు గుర్తురావడం సహజం. రెండూ బాక్సాఫీసు దగ్గర బావురుమన్నాయి. అయినా కూడా ఆడియన్స్ మీద రివెంజో, హిట్ కాప్ గా గుర్తింపు తెచ్చుకోవాలనో అదే జానర్ తో ఇప్పుడు ఘోస్ట్ అని ముందుకొచ్చారు. 

దసరా సీజన్లో రావడం వల్ల ప్రేక్షకులు కూడా తీరుబడి చేసుకుని నాగార్జున సినిమా కదా అని థియేటర్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. 

ఒక్క మెతుకు చూసి అన్నం ఎలా ఉడికిందో చెప్పొచ్చంటారు. ఇందులో ఫస్ట్ సీన్ ఏంటంటే..ఈస్ట్ అరేబియా ఎడారిలోని ఒక ప్రాంతం. ఆయుధాలో ఏవో ట్రక్కుల్లో తరలిస్తుంటారు కొందరు టెర్రరిస్టులు. మెరుపుదాడిలాగ నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇసకలోంచి పైకొచ్చి టపటపా అందర్నీ కాల్చి చంపేస్తారు. ఆ శవాల మధ్యలో నిలబడి ఇద్దరూ లిప్ లాక్ చేసి పెదాలు జుర్రుకుంటారు.

అదీ పరిస్థితి. 

మరి కాసేపట్లో కిడ్నాపైన ఏడెనిమేళ్ల పిల్లవాడిని రెస్క్యూ చేయడమనే ఇంకొక యాక్షన్ ఎపిసోడ్. ఆ వెంటనే ఈ సారి కిస్ కాదు కానీ...సెంటిమెంటు తగిలించారు. 

తర్వాత నిద్దర్లో కలవరించే నాగార్జున..ఊరుకోపెట్టే హీరోయిన్...నిద్రలేచాక మళ్లీ ఇంకొక యాక్షన్ సీన్...!

ఇలా చెప్పుకుంటూ పోతే యాక్షన్ సీన్ల మధ్యలో కొద్ది కొద్దిగా శకలాలుగా పడి ఉన్న కథ ఏదో కనిపిస్తూ ఉంటుంది. కానీ అస్సలు హత్తుకోని కథ. బలవంతపు బాదుడన్నమాట.

నాగార్జున పాత్ర చిన్నప్పుడే మతకల్లోలాల్లో అనాధవుతాడు. ఒక ఆర్మీ ఆఫీసర్ అతనిని ఇంటికి తీసుకెళ్లి తన కూతురితో సమానంగా పెంచుతాడు. ఆమె పెద్దయ్యాక తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి ఒక కూతుర్ని కంటుంది. అంతే కాకుండా నాయర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఆమె అధినేత. ఆమెకి కంపెనీలోనే శత్రువులుంటారు. వాళ్లనుంచి ఆమెని, తన కూతుర్ని కాపాడే పని మన హీరోది. ఇంతకీ ఘోస్ట్ ఏవిటి అంటే మాఫియా డాన్స్ అందరికీ ఘోస్ట్ గా మన హీరో పరిచయమట. 

ఒక సాదా సీదా పసలేని కథ, రుచి పచి లేని కథనంతో పేలవంగా సాగే రణగొణధ్వనుల సినిమా ఈ ఘోస్ట్. ఇందులో ఏం నచ్చిందో నాగార్జునకే తెలియాలి. మారుతున్న కాలంలో ఆడియన్స్ అంచనాలు ఎక్కడున్నాయి? తీస్తున్న సినిమా ఏమిటి అని కనీసమైన లెక్క కూడా వేసుకోలేదా అనిపిస్తుంది.

వరసగా యాక్షన్ సీన్స్ పెట్టేస్తే కే.జీ.ఎఫ్ ని చూసినట్టు చూసేస్తారనుకుంటే అంతకంటే అవగాహనారాహిత్యం మరొకటి ఉండదు. ఒకవేళ అదే అనుకున్నా ఆ స్థాయిలో తీయగలగాలి కదా. 

అయినా కథలో ఎమోషన్, గ్రిప్పింగ్ గా ఉండే హీరో క్యారక్టరిజేషన్, బలమైన బ్యాక్ స్టోరీ, దీటైన విలన్స్, బరువైన కాన్-ఫ్లిక్ట్, సిగ్నేచర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఏ సినిమా అయినా ఆకట్టుకోదని నాగార్జున లాంటి సీనియర్ హీరోకి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆయన ఈ సినిమాని కొన్ని సెంటర్లలో సొంతంగా రిలీజ్ చేయడం, పట్టుబట్టి హిందీలో కూడా విడుదల చేయడం మరీ ఆశ్చర్యం.

నటీనటుల పని తీరు మామూలే. పెద్దగా చెప్పుకోవడానికేం లేదు. సోనాల్ చౌహాన్ ఒక పాటలో ఊరుసౌందర్యాన్ని ఆరబోసింది. మిగతా భాగమంతా ఆమెది యాక్షనే. గుల్ పనాగ్ ఓకే. ఆమె కూతురి పాత్రలో నటించిన అనైక ఆకట్టుకుంది. శ్రీకాంత్ అయ్యంగర్ ది చిన్న పాత్ర. రవివర్మ ఓకే. 

సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాటలు గానీ, నేపథ్యంగానీ ఆకట్టుకోవు.  

విలన్ల మేకప్పులు చూస్తే సీజన్ కి తగ్గట్టు దసరావేషగాళ్లలాగ ఉన్నారు. 

నాగార్జున మాత్రం ఫిట్ గా కనిపిస్తూ ఆయన అసలు వయసుకి కనీసం పది పదిహేనేళ్లు యంగ్ గా కనిపించారు. నటన పరంగా ఎప్పటిలాగానే ఉంది తప్ప కొత్తదనమేం లేదు.

ఈ సినిమాకి ప్రధామైన మైనస్సులేంటంటే ఒక్కటని చెప్పలేం. ప్రధానంగా కథ, కథనాలని ఎత్తి చూపొచ్చు. రచయితగా, దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు విఫలమయ్యాడనే చెప్పాలి. కాప్ స్టోరీ పరంగా చూస్తే నాగార్జున ఇంతకు ముందు నటించిన "వైల్డ్ డాగ్" చాలా బెటరనిపిస్తుంది. అందులో తెలిసిన కథాంశం, ఒక రియల్ ఇన్సిడెంట్ నేపథ్యం ఉన్నాయి. కానీ ఈ కల్పితకథలో ప్రేక్షకుడు రిలేట్ చేసుకోవడానికి ఏదీ లేకపోవడం, ప్రతిదీ ఎక్కడో చూసినట్టుగా డెజావూ ఫీలింగ్ రావడం వల్ల కునికిపాట్లు పడుతూ చూసేలా ఉంది. 

ఒక కథ చెబుతున్నప్పుడు మెయిన్ ప్లాట్ ఏదో ప్రేక్షకులకి క్లారిటీ ఇవ్వాలి. ఒకపక్కన పెద్దపెద్ద అంతర్జాతీయ టెర్రరిష్ట్ గ్యాంగుల్ని నిలువరించే ఇంటెర్పోల్ కాప్ గా ప్రవేశించి క్రమంగా ఒక మహిళని, ఆమె కూతుర్ని కంపెనీ కుట్రలనుంచి కాపాడడమనే పాయింటుకి తీసుకురావడం కథపరంగా పెద్ద డ్రాప్. కుట్రపూరితంగా కంపెనీని లాక్కోవడానికి అన్నేసి మర్డర్ ప్లాన్స్ వెయ్యాల్సిన అవసరం ఏముందా అని సగటు ప్రేక్షకుడికి అనిపించిందంటే ఎంత అన్-కన్విన్సింగ్ గా కథ రాసుకున్నారో అర్థమవుతుంది. 

సాధ్యమయ్యే పని కాదు కనీ ఈ చిత్రాన్నైనా ప్రేక్షకులు హిట్ చేస్తే నయమేమో. లేకపోతే మరో కాప్ చిత్రంతో నాగార్జున అండ్ టీం మరొక దండయాత్ర చేసే అవకాశముండొచ్చు.

బాటం లైన్: మాడిన రోష్ట్

Show comments