నాని నోట్లో నోరు పెట్టడం ఎందుకని..!

కొడాలి నాని విషయంలో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. టీడీపీ జనాలు.. ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు. నానిపై మూకుమ్మడి మాటల దాడి చేస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా అరెస్టులకు సైతం సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జనసేన మాత్రం సైలెంట్ అయింది. 

ఒకప్పుడు గుడివాడ వేదికగా నానికి సవాల్ విసిరిన చరిత్ర పవన్ కల్యాణ్ ది. అలాంటి పవన్ కల్యాణ్, క్యాసినో వ్యవహారంలో సైలెంట్ అయ్యారు. తన నాయకుల్ని కూడా ఎవ్వరూ స్పందించొద్దని ఆదేశించారు కారణం ఏంటి? నాని నోట్లో నోరు పెట్టడం ఎందుకని భయపడ్డారా? లేక తను ఎంటరైతే విషయం డైవర్ట్ అవుతుందని భావించారా?

కారణం ఏదైనా నాని విషయంలో పవన్ సైలెంట్ అయ్యారు. ఆరోపణలు వెల్లువెత్తిన కొత్తలో కొంతమంది జనసైనికులు ఈ వ్యవహారంపై కామెంట్లు చేసినప్పటికీ, ఇప్పుడు జనసేన పూర్తిగా గప్ చుప్ గా ఉంది. నానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో జనసేన కలిసినా, జనసేనాని కామెంట్ చేసినా ఆ లెక్క వేరేలా ఉంటుంది. 

ఇప్పటికే చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తిట్లు తింటున్నారు. క్యాసినో వ్యవహారంలో నాని పరువు తీయాలనుకుని, చంద్రబాబు తన పరువు తానే తీసుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడీ తిట్ల గురించే హాట్ డిస్కషన్ జరుగుతోంది.

ఈ టైమ్ లో నాని ని టచ్ చేయడం అవసరమా..?

చంద్రబాబుపై ఊగిపోతున్న నానిని అనవసరంగా పవన్ కల్యాణ్ కానీ, ఆయన బ్యాచ్ కానీ టచ్ చేస్తే.. కచ్చితంగా పవన్ ఆ తిట్లను భరించలేరు, తట్టుకోలేరు. ఒకవేళ పవన్ రెట్టించినా, అటువైపు నుంచి అంతకంటే గట్టి రియాక్షన్ వస్తుందనే విషయం మాత్రం వాస్తవం. 

అందుకే పవన్ బ్యాచ్ ఈ వ్యవహారంలో తెలిసీ తెలియనట్టుగా ఉంది. స్వయానా జనసేనాని కూడా క్యాసినో రచ్చపై కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసే ధైర్యం చేయలేదు.

విషయం డైవర్ట్ కాకుండా..

ఇటీవల కాలంలో టీడీపీ ఏ ఒక్క అంశంపై కూడా ఇంతలా ఫోకస్ పెట్టలేదు. ఏది దొరికితే దాన్ని హైలెట్ చేయడం, మరోటి దొరకగానే దీన్ని పక్కనపడేయడం అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని విషయంలో తిట్టినా, తిట్టించుకున్నా.. ఏదో ఒకటి తేలాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ పవన్ ఎంటరైతో విషయం డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో.. చంద్రబాబు నుంచే సైలెంట్ గా ఉండాలనే సలహా వచ్చి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.

మరో విషయం ఏంటంటే... గుడివాడలో కాపు జనాభా కూడా ఎక్కువ. సామాజిక వర్గాలు ఏవైనా గుడివాడలో కొడాలి నానిని స్థానికులు బాగా అభిమానిస్తారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. గుడివాడకు మాత్రం నాని ఎమ్మెల్యే కావాల్సిందే. అంతలా కాపులు కూడా ఆయన్ను ఇష్టపడుతున్న సందర్భంలో.. లేనిపోని ఆరోపణలు చేసి తిప్పలు కొని తెచ్చుకోవడం ఎందుకని జనసేన ఆగింది. 

క్యాసినో వ్యవహారాన్ని గుడివాడకు లింక్ చేసి మాట్లాడితే స్థానికులలో కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తెలివిగా పవన్ కల్యాణ్ ఈ ఆపరేషన్ కి దూరంగా ఉన్నారు. నాని వర్సెస్ బాబు ఆటను గట్టుపై నిల్చొని చూస్తున్నారు. 

Show comments