పుష్ప-2 తర్వాత బన్నీ సినిమా అదేనా?

హీరోలంతా వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న సీజన్ ఇది. ప్రతి హీరో చేతిలో మినిమం మూడేసి సినిమాలున్నాయి. ఇలా హీరోలంతా ముందుగానే కర్చీఫ్ లు వేసుకుంటున్న టైమ్ లో, బన్నీ మాత్రం కూల్ గా కనిపిస్తున్నాడు. అధికారికంగా అతడి చేతిలో ప్రస్తుతం పుష్ప-2 తప్ప మరో సినిమా లేదు. ఓ 2 సినిమాలు ప్రకటించినప్పటికీ వాటిపై బన్నీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

చాన్నాళ్ల కిందటే ఐకాన్ అనే సినిమా ఎనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. దిల్ రాజు బ్యానర్ పై వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఆ సినిమా రావాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు కనిపించడం లేదు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చింది. దీనిపై బన్నీ ఆసక్తిగానే ఉన్నప్పటికీ, కొరటాల ఖాళీగా లేరు. దీంతో తెరపైకి మరో ఇద్దరు దర్శకుల పేర్లు వచ్చాయి.

ఈమధ్య బన్నీ దర్శకుల లిస్ట్ లో అట్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తాడనేది ఆ పుకారు సారాంశం. ఓవైపు ఇది నడుస్తుండగానే మరోవైపు బోయపాటి శ్రీను పేరు తెరపైకొచ్చింది. అఖండ ఊపుమీదున్న బోయపాటి.. మరోసారి బన్నీతో కలిసి సరైనోడు టైపులో ఓ యాక్షన్ సినిమా తీస్తాడనే ప్రచారం మొదలైంది.

ఇలా చూసుకుంటే.. బన్నీ దర్శకుల లిస్ట్ లో కొరటాల, వేణుశ్రీరామ్, అట్లీ, బోయపాటి ఉన్నారు. వీళ్లలో బన్నీ ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది పుష్ప-2 సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత గానీ తేలదు. ఈలోగా పించ్ హిట్టర్ లా మధ్యలో త్రివిక్రమ్ దూరితే మాత్రం అంతా సైడ్ అయిపోవడం గ్యారెంటీ. ఎందుకంటే, త్రివిక్రమ్ సీన్ లోకి ఎంటరైతే బన్నీ ఇక ఎవ్వరి మాట వినడు కాబట్టి. 

Show comments