మూవీ రివ్యూ: సార్పట్ట పరంపర

టైటిల్‌ : సార్పట్ట
రేటింగ్ : 3/5
తారాగణం : ఆర్య, దుషారా విజయన్‌, పశుపతి, అనుపమ కుమార్‌, జాన్‌ కొక్కెన్‌ తదితరులు
సంగీతం :  సంతోష్‌ నారాయణ్‌
సినిమాటోగ్రఫీ : మురళి.జి
ఎడిటర్‌ : సెల్వ ఆర్‌.కె
నిర్మాణం : నీలం ప్రొడక్షన్స్‌, కె9 స్టూడియో
నిర్మాతలు : షణ్ముగం దక్షన్‌ రాజ్‌
దర్శకత్వం : పా.రంజిత్‌
విడుదల తేది : 22.07.2021
ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

బాక్సింగ్ కథతో హిందీలో "తూఫాన్" వచ్చి వారం గడవకుండానే తమిళంలో "సార్పట్టు" వచ్చింది. ఇది తెలుగులోకి కూడా డబ్బింగ్ చేసి వదిలారు. నిజానికి ఒకే నేపథ్యంతో రెండు సినిమాలు వెంట వెంటనే చూడాలంటే బోర్ కొట్టే అవకాశమే ఎక్కువ. కానీ మేకింగ్ స్టైల్ కావచ్చు, నటీనటుల పనితీరు కావచ్చు..లెంగ్త్ ఎక్కువయ్యిందన్న లోపం తప్ప పెద్దగా బోర్ కొట్టకుండా చూడనిచ్చింది.

పా.రంజిత్ అనగానే గుర్తొచ్చే సినిమాలు "కబాలి, "కాలా". ఆ రెండింటిలోనూ రజినీకాంత్ హీరో. ఈ సారి ఆర్యతో ఈ "సార్పట్ట"తో ముందుకొచ్చాడు.

ఈ కథని మూడు పార్శ్వాలుగా చెప్పుకోవచ్చు.

అది ఇందిరాగాంధి పరిపాలనలో ఎమెర్జెన్సీ కాలం. చెన్నై పోర్టులో కూలీగా పనిచేసే సమర( ఆర్య) కి బాక్సింగ్ అంటే చిన్నప్పటి నుంచీ ప్రాణం. అతని తండ్రి కూడా బాక్సింగ్ క్రీడాకారుడే. కానీ ఆ ఆటగాణ్ణి కొందరు రౌడీగా మార్చి పొట్టనబెట్టుకున్నారని సమర తల్లికి బాక్సింగ్ అంటేనే భయం, అసహ్యం. కొడుకుకి ఆ ఆట మీద ఆసక్తిని చూసి చిరాకు పడుతుంది, కోప్పడుతుంది. అతను ఆ మార్గంలోకి వెళ్లకూడదని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో తను గురువుగా భావించే వ్యక్తి పరువుకోసం వేటపులి (జాన్ కొక్కెన్) తో బాక్సింగ్ ఆడడానికి సిద్ధమవుతాడు. కానీ అతను సామాన్యమైన బాక్సర్ కాదు. సమర ఈ పోటీలో నెగ్గుతాడా? ఇది మొదటి పార్శ్వం.

నెగ్గినవాడు తనకు తెలియకుండానే తప్పుడుమార్గంలోకి వెళ్తాడు. తెలుసుకునేలోపు పతనమౌతాడు. ఇది రెండవ పార్శ్వం.

ఏ తల్లైతే తన కొడుకును బాక్సింగ్ నుంచి మొదట్లో దూరంగా పెడుతుందో అదే తల్లి ఆటలో గెలిచి, జీవితంలో ఓడుతున్న కొడుకుని బాక్సింగ్ చేయమని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహంతో అతను ఆటలోనూ, జీవితంలోనూ కూడా గెలుస్తాడు. ఇది మూడవ పార్శ్వం.

పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా "కబాలి", "కాలా" టైపులో వెనుకబడిన తరగతుల నేపథ్యంలో సాగింది. సహజత్వానికి చాలా దగ్గరగా ఆద్యంతం నడపగలిగాడు కథని. అనవసరపు బిల్డప్ సీన్స్, తెచ్చిపెట్టుకున్న హీరోయిజాన్ని చూపించడం లాంటి పనులు పెట్టుకోకుండా ఏ పాత్ర ఎలా బిహేవ్ చెయ్యాలో అలా బిహేవ్ చేసే విధంగా తీర్చిదిద్దుకున్నాడు.

ఈ కథకి ఆయువప్పట్టు పాత్రధారులు. ప్రతి పాత్రకీ సరిగ్గా సరిపోయే ఆర్టిస్టులు దొరకడం ఒక హైలైట్. కథని చివరిదాకా తమ నటనాపటిమతో లాక్కుపోయారు.

ఆర్య ఈ పాత్ర కోసం శారీరకంగా ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. నటన కూడా బాగా చేసాడు. రంగయ్య గా పశుపతి చక్కగా ఒదిగిపోయాడు. సమర భార్యగా దుషారా విజయన్‌ నేచురల్ గా ఉంది. వేటపులిగా జాన్‌ కొక్కెయ్‌ కొండంత శరీరంతో పాత్రకి సరిపోయాడు. డాడీ పాత్రలో జాన్‌ విజయ్‌ తన ఇంగ్లీష్ డయలాగ్స్ తో కొంత హాస్త్యాన్ని పండించాడు.

టెక్నికల్ గా చూసుకుంటే ఇందులో పెద్ద మైనస్ నిడివి. ఏకంగా రెండూ ముప్పావు గంటల సినిమా కూర్చోబెట్టి చూపించాల్సొచ్చినప్పుడు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టాలి. ఎక్కడా కొయ్యడానికి వీలు లేకుండా ఉంటే పర్వాలేదు. అలా లేనప్పుడు నిర్దాక్షణ్యంగా కొంత భాగం కోసెయ్యక తప్పదు. నిజానికి తప్పుడు మార్గంలోకి వెళ్లి మళ్లీ ఫాం లోకి వచ్చే సన్నివేశాలు కొన్ని తగ్గించొచ్చు. పాటల్ని కూడా త్యాగం చేయొచ్చు. ఉన్నంతలో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేరుగా కథతో ప్రయాణించే వెసులుబాటుంది. ఇదే థియేటర్లో అయితే ఓర్పుకి పరీక్షే. నేపథ్య సంగీతం బాగుంది.

తెలుగులోకి డబ్బింగ్ క్వాలిటీ పర్వాలేదు కానీ మధ్యలో చాలా సార్లు తెలుగు అక్షరాల్లాంటివి చూపించారు. నేటివిటీ కోసం తమిళ సైన్ బోర్డ్స్ ని, తమిళ అక్షరాలు ఉన్నచోటల్లా తెలుగులోకి మార్చే ప్రయత్నం చేసారు. ఆ పనికి పూనుకున్నదెవరో కానీ తెలుగు లిపిని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. చిత్రవిచిత్రమైన ఒత్తులు, పొల్లులతో తెలుగు లిపిని అవమానించినంత పని జరిగింది. పైగా అందులో చాలా వరకు క్లోజప్పులు పెట్టారు. ఈ డైవెర్షన్ వల్ల కూడా సినిమా చూసే ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ అవుతుంది. దీనికన్నా తమిళ అక్షరాలు యథాతథంగా చూపించినా బాగానే ఉండేది.

పాత్రధారులు కండబలం చూపించారు. కథకుడు కథనబలం చూపించాడు.

బాటం లైన్: ఈ వారం దీనితో సర్పెట్టుకోవచ్చు

Show comments