విష్ణుపై దాడి గుట్టు విప్పిన ఆర్కే

ఏపీ బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై మూడు రోజుల క్రితం ఏబీఎన్ చాన‌ల్‌లో దాడి జ‌రిగింది. అందులోనూ చెప్పుతో దాడి చేయ‌డం తీవ్ర దుమారం రేపింది. ఇది అవాంఛ‌నీయ ఘ‌ట‌న. అయితే ఓ అవాంఛ‌నీయ ఘ‌ట‌న వాంఛ‌నీయ నిర్ణ‌యానికి దారి తీసింది. ఈ ఘ‌ట‌నే జ‌రిగి ఉండ‌క‌పోతే ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ చాన‌ల్ బీజేపీకి వ్య‌తిరేక పంథా తీసుకునే అవ‌కాశం లేదు. కావున చెడులోనూ మంచి జ‌రిగిందంటే... ఈ ఘ‌ట‌న‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవాలి.

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడికి సంబంధించి ర‌క‌ర‌కాల వాద‌న‌లు, ప్ర‌చారాలు తెరపైకి వ‌చ్చాయి. ఎవ‌రి అభిప్రాయాలు ఎలా ఉన్నా ...స‌ద‌రు చాన‌ల్ ఎండీ ఆర్కే తాజా కొత్త ప‌లుకులో విష్ణుపై దాడి గుట్టు విప్పారు. ‘జ‌గ‌న్ సేవ‌లో ఆ న‌లుగురు’ శీర్షిక‌తో రాసిన వ్యాసంలో విష్ణుపై దాడికి ప్రేరేపించిన ప‌రిస్థితులు ఏంటో చెప్ప‌క‌నే చెప్పారాయ‌న‌. 

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్ర‌త్యేక‌త ఏమంటే ...ఆయ‌న ఏదీ మ‌న‌సులో దాచుకోరు. జ‌గ‌న్‌పై అక్ష‌ర దాడి క్ర‌మంలో జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల‌కు పాత‌రేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ....ఆయ‌న లెక్క చేసిన దాఖ‌లాలు లేవు. ఇక ఆర్కే కొత్త ప‌లుకులోకి వెళ్దాం.

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడి నేప‌థ్యంలో త‌న‌ను క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డాన్ని ఆర్కే అవ‌హేళ‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ‘నువ్వు–నేను’ సినిమాలోని ఓ కామెడీ స‌న్నివేశాన్ని వ్యాస ప్రారంభంలోనే తెర‌పైకి తేవ‌డం ద్వారా , త‌న ఉద్దేశం ఏంటో చెప్ప‌క‌నే చెప్పారు. అడ‌గ‌డుగునా బీజేపీని చుల‌క‌న చేశారు.

‘తరగతి గదిలో నన్ను ఎవరో ఏ పూలచొక్కా మూస్కొని కూర్చోరా అని అవమానించారు. లెక్చరర్‌ వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే’ అని కమెడియన్‌ సునీల్‌ డిమాండ్‌ చేయగా, ‘నిన్ను ఎవరో ఏదో అంటే నేను క్షమాపణ చెప్పడం ఏమిటి’ అని లెక్చరర్‌ పాత్రధారి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంటాడ’నే సీన్‌ను క‌ళ్ల‌కు క‌ట్ట‌డం ద్వారా బీజేపీని ఓ క‌మెడియ‌న్‌గా చిత్రీక‌రించ‌డం ఆర్కేకు మాత్ర‌మే చెల్లింది.  

‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి రాష్ట్ర బీజేపీలో కొందరు అలవాటు పడిపోయారు. అలాంటి వారిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌‌‌రెడ్డి, జి.వి.ఎల్‌ నరసింహారావు తదితరులు ఉన్నారు. వీరికి ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌ అండగా ఉంటున్నారని చెబుతున్నారు. ఈ నలుగురూ బీజేపీ ముసుగులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి పని చేస్తుంటారని స్థానిక బీజేపీ నాయకులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు కూడా’

విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడికి, ఆర్కే పైన పేర్కొన్న వ్యాఖ్య‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అనుకుందామా? ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతున్న ఆ న‌లుగురిలో విష్ణు కూడా ఉన్నాడు. కావున దాడి చేయాల్సిందే అన్న‌ట్టుగా ఆర్కే వాద‌న ఉంది. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించే వారిని ఏమి చేసినా త‌ప్పు కాద‌నేది గ‌త కొన్నేళ్లుగా ఆర్కే ఓ ఉద్య‌మంలా త‌న మీడియా సంస్థ వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆర్కే చెప్పిందాంట్లో ఒక్క‌టైతే నిజం ...మోదీ ప్ర‌భుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలోని అంద‌రినీ బెదిరించి బ‌త‌కడానికి ఏపీ బీజేపీ నేత‌లు అల‌వాటు ప‌డిపోయార‌నే అభిప్రాయంతో అంద‌రూ ఏకీభ‌విస్తారు.

ఆర్కే వ్యాసంలో కొంత గంద‌ర‌గోళం కూడా క‌నిపించింది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ వాక్యాల‌ను తీసుకుందాం.

‘కేంద్రప్రభుత్వాన్ని చూసి భయపడటానికి నేనేమీ జగన్మోహన్‌ రెడ్డి లేదా చంద్రబాబునాయుడుని కాదు. వీరిరువురూ రాజకీయ నాయకులు కనుక వారి సమస్యలు వారికి ఉంటాయి. నేనేమీ రాజకీయ నాయకుణ్ణి కాను. ఒక సాధారణ జర్నలిస్టును మాత్రమే. వీర్రాజు అండ్‌ కో హెచ్చరికలకు, బహిష్కరణలకు మేం భయపడం. బీజేపీలోని ఆ నలుగురు ఈ విషయం తెలుసుకుంటే మంచిది’

ఒక‌వైపు ఈ వారం త‌న కొత్త‌ప‌లుకును జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాల కోసం ఆ న‌లుగురు బీజేపీ నేత‌లు ప‌నిచేస్తున్నార‌నే పాయింట్‌తో రాసుకొచ్చారు. మ‌రోవైపు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడిని భ‌య‌పెడుతున్నార‌ని ఆయ‌న అంటున్నారు. ఇందులో ఏదో ఒక‌టి మాత్ర‌మే నిజ‌మై ఉంటుంది.

త‌న‌కు కావాల్సిన చోట మాత్రం జ‌గ‌న్‌కు అనుకూలంగా ఆ న‌లుగురు ఉన్నార‌న‌డం, ఇదే వ్యాసంలో మ‌రోచోట భ‌య‌పెడుతున్నార‌ని చెప్ప‌డం ద్వారా స్ప‌ష్ట‌త కొర‌వ‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ రాజ‌కీయ నాయ‌కుల మాదిరిగా తాను భ‌య‌ప‌డ‌న‌ని చెప్ప‌డం, అలాగే బ‌హిష్క‌ర‌ణ‌ల‌కు వెర‌వ‌మ‌నే విష‌యాన్ని బీజేపీ నాయ‌కులు తెలుసుకుంటే మంచిద‌నే హెచ్చ‌రిక‌ను పంప‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం.

ఇదే సంద‌ర్భంలో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడి చేసిన డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు ఏమ‌య్యాడో తెలియ‌దు. దాడి చేసిన వ్య‌క్తి ప‌క్క‌కు పోయాడు. ఇప్పుడు గొడ‌వంతా ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్‌, ఏపీ బీజేపీ మ‌ధ్యే. ఇది ఒక ర‌కంగా మంచిదే. ఎందుకంటే రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌నే క్ర‌మంలో బీజేపీ సున్నిత‌మైన మ‌తం కేంద్రంగా మ‌నుషుల మ‌ధ్య విద్వేషాల‌కు తెర‌దీసింది. 

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అక్క‌సుతో అవాంఛ‌నీయ‌మైన బీజేపీ విధానాల‌కు ఇంత కాలం ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ మీడియా సంస్థ ఒత్తాసు ప‌లుకుతూ వ‌స్తోంది. ఈ రోజు త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి, ఇరు వైపుల వాళ్ల‌కు నొప్పేంటో తెలిసొచ్చి, ప‌ర‌స్ప‌రం వైరి ప‌క్షాలుగా మారాయి.

‘విష్ణువర్ధన్‌‌ రెడ్డిపై చెప్పు విసిరిన డాక్టర్‌ శ్రీనివాసరావు గతంలో ఎన్నడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. అర్థవంతంగా చర్చలలో పాల్గొంటారని ఆయనకు పేరు ఉంది. అయినా, ఆయన నిగ్రహం కోల్పోయే పరిస్థితి ఎందుకొచ్చిందో విష్ణువర్ధన్‌‌ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది’ అని ఆర్కే హిత‌వు ప‌లికారు. ఈ వాక్యాలు చాలు ....విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడిని ఆర్కే ఏ విధంగా స‌మ‌ర్థిస్తున్నారో అర్థం చేసుకోడానికి. 

దాడికి పాల్ప‌డిన డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావుకు ఆర్కే గుడ్ కాండ‌క్ట్ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. చెప్పు దెబ్బ‌లు తిని విల‌విల‌లాడుతున్న విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి తానెందుకు దాడికి గురి కావాల్సి వ‌చ్చిందో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌ని చెప్ప‌డం ...డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు దాడి కంటే ఎక్కువ బాధ పెట్టేలా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

‘ఆంధ్రజ్యోతి గ్రూపు సంస్థలకు అన్యాయంగా దురుద్దేశాలను పదే పదే ఆపాదిస్తున్న ఆ నలుగురి విషయంలో మేం కూడా ఎలా ఉండాలో అలాగే ఉంటాము. నిజానికి వీర్రాజు నన్ను గానీ, నేను ఆయనను గానీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయినా, ఆయనకు నా మీద ద్వేషం ఉందంటే కారణం కులద్వేషమే కావచ్చు. 

తనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందని విష్ణువర్ధన్‌‌ రెడ్డి పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. నిజానికి ఆయన ప్రజా నాయకుడు కూడా కాదు. అయినా తెలుగుదేశం పార్టీనో మరొకరో అలాంటి వ్యక్తిపై ఎందుకు కుట్ర చేస్తారు? తమను తాము అతిగా ఊహించుకోవడం అంటే ఇదే!’

ఆ న‌లుగురిపై ఆర్కే మ‌న‌సులో ఎంతో కాలంగా గూడుక‌ట్టుకున్న విష‌పు ఆలోచ‌న‌లు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ రాత‌లు అద్దం ప‌ట్టాయి. ఇదేదో ఇప్ప‌టికిప్పుడు ఆ న‌లుగురిపై ఆర్కేలో ఏర్ప‌డిన అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇప్పుడు విష్ణుపై దాడి కార‌ణంగా అవ‌న్నీ ఒక్కొక్క‌టిగా బ‌య‌టికొస్తున్నాయి. కుల ప‌రంగా త‌న‌ను సోము వీర్రాజు ద్వేషిస్తున్నార‌ని ఆర్కే మ‌థ‌న‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

అలాగే విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న‌కు తాను ఎక్కువ‌గా ఊహించుకుంటున్నార‌ని ఆర్కే కారాలుమిరియాలు నూరుతున్నారు. అంతే త‌ప్ప, త‌న చాన‌ల్‌లో దాడి జ‌ర‌గ‌డంపై ఆర్కే ఒక్క శాతం కూడా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా దాడి చేసిన శ్రీ‌నివాస‌రావు ట్రాక్ రికార్డ్‌ను ఆకాశానికి ఎత్త‌డంతో పాటు విష్ణు వైఖ‌రిపై వ్య‌తిరేక కామెంట్స్ చేయ‌డం ద్వారా.... దాడికి త‌న స్వ‌యంకృతాప‌రాధ‌మే కార‌ణ‌మ‌న్న సంకేతాలు పాఠ‌కుల్లో క‌లిగేలా ఆర్కే త‌న అక్ష‌రాల‌ను ఆవిష్క‌రించారు.

విష్ణువర్ధన్‌‌ రెడ్డిపై డాక్టర్‌ శ్రీనివాసరావు భౌతికదాడికి పాల్పడటాన్ని పలువురు బీజేపీ నాయకులు అంతర్గతంగా స్వాగతించార‌ని చెప్పుకుంటున్నార‌ని, అలాగే అమరావతి రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని నిందిస్తే ప్రజలే బాహాటంగా తిరగబడతారని నెటిజ‌న్లు హెచ్చరిస్తున్నార‌ని చెప్ప‌డం ద్వారా ...ఆర్కే ఎలాంటి సందేశాన్ని ఇవ్వాల‌నుకుంటున్నారు? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.  

నిజానికి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిపై దాడిని ప్ర‌జాసంఘాలు, వామ‌ప‌క్ష భావాలున్న వారే ఎక్కువ‌గా ఖండించారు. ఆర్కే చెబుతున్న‌ట్టు బీజేపీ వైపు నుంచి నామ‌మాత్రంగా కూడా ఖండ‌న‌లు, సాంత్వ‌న వ‌చ‌నాలు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. విష్ణుపై దాడితో బీజేపీలో స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న క‌నిపించింది. ఏపీ బీజేపీలో ఐక్య‌త ...నీటి బుడ‌గ లాంటిద‌ని విష్ణుపై దాడి ఘ‌ట‌న తేల్చి చెప్పింది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో పాముకు పాలు పోసి పెంచిన చందంగా ... ఇంత‌కాలం బీజేపీని మోస్తున్న ఆర్కేకు, ఇప్పుడు త‌న వ‌ర‌కూ స‌మ‌స్య వ‌స్తే త‌ప్ప‌, ఆ పార్టీ ప్ర‌మాద‌క‌ర ధోర‌ణి అర్థం కాలేదు. అందుకే విష్ణుపై దాడి అవాంఛ‌నీయ‌మే అయినా, ఇది ఓ ప్ర‌మాద‌క‌ర భావ‌జాలంతో ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని క‌ల‌లు కంటున్న పార్టీకి  ఓ మీడియా సంస్థ దూరం కావ‌డానికి దారి తీసింది. అందుకే అవాంఛ‌నీయంలోనూ వాంఛ‌నీయ‌మ‌ని చెప్ప‌డం. ఏది ఏమైతేనేం విష్ణుపై దాడితో అనేక నిజాలు బ‌య‌టికొస్తున్నాయి. ఈ మేర‌కు  అంద‌రూ స్వాగ‌తించాల్సిందే.

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

Show comments