బీజేపీకి చెలగాటం.. బాబుకి ప్రాణ సంకటం

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల కోసం అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి హడావిడి చేశారు చంద్రబాబు. తాజాగా ఉప ఎన్నికల ప్రచార నగారా కూడా మోగించారు. ఈనెల 21 నుంచి 10 రోజుల పాటు, 700 గ్రామాల్లో ఉప ఎన్నికల ప్రచారం జరపాలంటూ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

చంద్రబాబు ఇంతా చేస్తుంది ఎన్నికల్లో గెలుపుకోసం అనుకుంటే పొరపాటే. రెండో స్థానానికి మాత్రమే ఆయన తాపత్రయం అంతా. ఒకవేళ రెండో స్థానం కూడా దక్కకపోతే టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందనేది బాబు భయం.

తిరుపతి ఉప ఎన్నిక.. బాబుకి విషమ పరీక్ష..

వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్న చంద్రబాబుకి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ బలం ఎలా పెరిగిందనే విషయం స్థానిక ఎన్నికల ఏకగ్రీవాలతోనే అర్థమైంది. అందుకే కరోనా సాకుతో అర్థాంతరంగా ఎన్నికల్ని ఆపేయించారు. 

ఇప్పుడు ప్రభుత్వం వద్దంటుంది కాబట్టి, ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు వైసీపీదేననే విషయం బాబుకి కూడా తెలుసు.

తిరుపతి ఎన్నికల సమయానికి చంద్రబాబు మత రాజకీయాలు మొదలు పెట్టాలని చూశారు. రాష్ట్రంలో ఆలయాల ఘటనలను సాకుగా చూపి మత విద్వేషాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్నారు. తీరా అరెస్ట్ అవుతున్నవారంతా టీడీపీ కార్యకర్తలే కావడంతో, పోలీసులపైనే రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. 

మత రాజకీయాలతోనే తిరుపతి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలనేది బాబు ఆశయం. ఆ విషయంలో బీజేపీ-జనసేన కూడా రెచ్చిపోతుండే సరికి బాబు అయోమయంలో పడ్డారు.

వైసీపీని ధీటుగా ఎదుర్కోవడమే కాదు, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ-జనసేనని నిలువరించాల్సిన అవసరం కూడా చంద్రబాబుకి ఉంది. అందుకే ఆయన తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

బీజేపీ-జనసేనకు చెలగాటం..

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ పరిధిలో నోటాతో పోటీ పడ్డాయి జనసేన, బీజేపీ. జనసేన నేరుగా బరిలో దిగకపోయినా.. బీఎస్పీ అభ్యర్థిని ఆ పార్టీ బలపరిచింది. 

ఇప్పుడు కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు కానీ.. రోజు రోజుకీ దిగజారుతున్న టీడీపీ వ్యవహారం, తెలంగాణలో బీజేపీ విజయాలు.. కూటమికి కాస్త బలాన్నిచ్చాయి. అందుకే తిరుపతి సీటుకోసం బీజేపీ, జనసేన కొట్టుకుంటున్నాయి. ఒకవేళ సయోధ్య సాధ్యం కాకపోతే అది టీడీపీకే లాభం అవుతుంది.

ఏది ఏమైనా.. బీజేపీ-జనసేనకు తిరుపతి ఉప ఎన్నికలతో ఒరిగేది, తరిగేదేమీ లేదు. కాకపోతే టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోడానికి ఆ రెండు పార్టీలు సీరియస్ గా ట్రైచేస్తున్నాయి. ఇదే ఇప్పుడు బాబుకి ప్రాణ సంకటంగా మారింది. పొరపాటున తిరుపతిలో టీడీపీ మూడో స్థానానికి పడిపోతే ఇక అంతే సంగతులు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీ మరింత దిగజారడం ఖాయం.

వైసీపీ గెలుపుని అధికార పార్టీ అక్రమాలంటూ సులువుగా పక్కనపెట్టేయొచ్చు, అదే టీడీపీ మూడో స్థానానికి పడిపోతే సమాధానం చెప్పుకోవడం కష్టం. అందుకే బాబు హడావిడి పడుతున్నారు, ఎన్నికల ప్రచారం అంటూ కామెడీ చేస్తున్నారు. 

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

Show comments