వెనక్కుతగ్గిన పవన్.. కారణం అదే!

వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ తన అక్కసునంతా వెళ్లగక్కింది. చంద్రబాబు సహా చినబాబు.. ఇతర ఎల్లో బ్యాచ్ అంతా... సోషల్ మీడియానిండా బురదజల్లింది, ఆ బురదలోనే పొర్లాడింది. పవన్ కల్యాణ్ మాత్రం ఈ బురద రాజకీయానికి దూరంగా ఉన్నారు. పొద్దున లేవగానే మోడీకి స్తోత్రాలు చెల్లించేసి సైలెంట్ అయిపోయారు పవన్ కల్యాణ్. జనసైనికులు కూడా ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయలేదు, బీజేపీ కూడా అంతే.

ఏపీ పాలనపై జనసేన స్పందిస్తే.. దాన్ని టీడీపీ వారికి అనుకూలంగా మార్చుకుంటుందనే ఆలోచనతోనే పవన్ సంయమనం పాటించారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ కి కూడా జగన్ పాలనపై నాలుగు ట్వీట్లు వేయాలనే కసి ఉంది. కానీ టీడీపీ అవకాశవాదాన్ని చూసి ఆయన సైలెంట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని టీడీపీ హైజాక్ చేస్తోంది. అందుకే కొన్నిరోజులుగా టీడీపీ చేస్తున్న ఏ ఆందోళనకీ జనసేన వంత పాడటం లేదు.

కరెంటు బిల్లుల పెంపుపై టీడీపీ రాద్ధాంతం మొదలుపెట్టే సరికి జనసేన ఆగిపోయింది. సొంతంగా బీజేపీతో కలిసి ఉపవాస దీక్షలంటూ వారు తిరుమల వ్యవహారాన్ని హైలెట్ చేసుకున్నారు. గతంలో కూడా జనసేన ఏదైనా కార్యక్రమం మొదలుపెడితే.. టీడీపీ దాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకోవడాన్ని పవన్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ పాలనపై పవన్ వ్యతిరేకంగా మాడ్లాటితే.. టీడీపీ సహజంగానే దాన్ని హైలెట్ చేస్తుంది. జనసేన కూడా తమతోపాటే అనే సందేశం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది. మనం మనం ఒకటి అని కలుపుకొనిపోయేందుకు ప్లాన్ చేస్తుంది. పరోక్షంగా గతంలో టీడీపీ పాలనే బాగుందని జనసేన నాయకుల అభిప్రాయం అన్నట్టు నాటకాన్ని రక్తి కట్టించగల "నటుడు" చంద్రబాబు.

ఇలాంటి నక్కజిత్తులెన్నింటినో చూశారు కాబట్టే పవన్ వెనక్కి తగ్గారు. జగన్ పై నిందలు వేయాలని, జగన్ పాలనను ఆడిపోసుకోవాలని మనసులో ఉన్నా కూడా మౌనంగా ఉన్నారు. బురద రాజకీయానికి దూరంగా జరిగారు. 

నిమ్మగడ్డకు ఆ అధికారం లేదు

Show comments