మోడీని అడగాల్సింది జగన్‌ను అడిగితే ఎలా?

ముఖ్యమంత్రి జగన్, ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలనే నివేదించారో లేదా, తన వ్యక్తిగత అవసరాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారో... ఎవరికి తెలుస్తుంది? వారిద్దరూ చెబితే తప్ప బయటకు వచ్చే సంగతులు కావు అవి! కాగా, భేటీ ముగిసిన తర్వాత.. జగన్ తాను వారికి ఏయే అంశాలమీద వినతిపత్రాలు ఇచ్చారో.. ఆ వివరాలు అన్నింటినీ మీడియాకు విడుదల చేశారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది.

కానీ.. ఇక్కడ సీపీఐ నాయకులు ఒక కామెడీ ఎపిసోడ్ నడిపిస్తున్నారు. మోడీ ఏం హామీలు ఇచ్చారో.. ఆ వివరాలు అన్నీ వారికి తెలియజెప్పాలట. అది కూడా.. రాతపూర్వకంగా వారికి ఇవ్వాలట. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఆర్టీఐ ద్వారా ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఆర్టీఐ అనేది ఒకటి.. అడగడానికి అందుబాటులో ఉండేసరికి.. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా, ఔచిత్యం చూసుకోకుండా.. ఏది పడితే అది అడిగేయడమేనా? అని రామకృష్ణ చర్య చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఆర్టీఐ కింద ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం పొందవచ్చు. అలాగని ప్రభుత్వాఫీసులో ఉండే ప్రతి డాక్యుమెంటరీ వివరాల్నీ అడిగి తీసుకోవడానికి కుదరదు. ప్రభుత్వ రహస్యాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ఆర్టీఐ కింద అడిగినాసరే చెప్పవలసిన అగత్యం లేదు. ప్రధానికి ఏం వినతిపత్రాలు ఇచ్చారో.. ఆ వివరాల్లో రహస్యం ఏముంది? అని రామకృష్ణ అండ్ కో నిలదీయవచ్చు గాక.. అది నిజమే. అయితే.. వినతిపత్రాల్లో ఉండే అంశాలన్నింటినీ.. అదే రోజున  ప్రెస్ రిలీజ్ ల ద్వారా మీడియాకు ఇచ్చిన తర్వాత.. మళ్లీ అడగడమే చోద్యం.

ఆయన అక్కడితో ఆగలేదు. మోడీ ఇచ్చిన హామీలను కూడా రాతపూర్వకంగా కోరుతున్నారు. మనం వినతిపత్రాలు కాగితాల రూపంలో ఇస్తాం గానీ.. అప్పటికప్పుడు ఆ భేటీలో హామీలు కాగితంమీద రావు కదా! మోడీ ఇచ్చిన హామీల గురించి జగన్ ఎక్కడా అతిగా ప్రచారం చేసుకోలేదు. అయినా సరే, రామకృష్ణ తెలుసుకోవాలనుకుంటే గనుక.. ఆ వివరాలను ప్రధాని కార్యాలయంలోనే అడగాలి. ఏపీ సీఎం ఇచ్చిన వినతిపత్రాలు, వాటికి మీ స్పందన లిఖితపూర్వకంగా పీఎంఓలో అడగాలి. నిజంగా వివరాలు కావాలనుకుంటే అదీ పద్ధతి. అలాకాకుండా.. ఏదో ఒక ఆర్టీఐ దరఖాస్తు పడేసి.. నాటకం నడిపించాలనుకుంటే.. ఇలాగే ఉంటుందని ప్రజలు అంటున్నారు.

అయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు

Show comments