టీఆర్ఎస్‌పై 'జాతీయ' దాడి

టీఆర్ఎస్‌పై కాంగ్రెస్‌, బిజెపి దాడి ముమ్మ‌ర‌మైంది. మొన్న రాహుల్‌గాంధీ, నిన్న అమిత్‌షా. రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీపై ఈ రేంజ్‌లో దాడి చేయ‌డం ఒక విశేషం. గ‌తంలో లేని ప్ర‌త్యేక‌త ఈసారి ఏమంటే తెలంగాణాలో ముందు నుంచి అధికారంపై ఆశ పెట్టుకుంది కాంగ్రెస్ మాత్ర‌మే. 

బిజెపి పోటీ చేసేది కానీ అధికారంలోకి వ‌స్తాన‌నే ఆశ వుండేది కాదు. ఈసారి ట్రెండ్ మారింది. టీఆర్ఎస్ వ్య‌తిరేక‌త బిజెపి ఓటు బ్యాంకుగా మారింది. ఉప ఎన్నిక గెల‌వ‌డం, మోదీ ప్ర‌భావంతో పార్టీకి బ‌లం పెర‌గ‌డంతో దూకుడు పెంచింది. గ‌ట్టిగా కొడితే టీఆర్ఎస్ కూలిపోయి ఆ స్థానంలో అధికారం త‌మ‌దేన‌నే ధీమా బిజెపిలో పెరిగింది.

కాంగ్రెస్‌కి మొద‌టి నుంచి ఓటుబ్యాంకు వుంది. తెలంగాణ ఇచ్చాం కాబ‌ట్టి గెలుస్తామ‌ని ఆనుకున్నారు త‌ప్ప కెసిఆర్ బ‌లాన్ని అంచ‌నా వేయ‌లేక‌పోయారు. 14లో ఓడిపోయారు. శ‌క్తుల్ని కూడ‌దీసుకోడానికి, ప్ర‌త్య‌ర్థుల్ని బ‌ల‌హీనం చేయ‌డానికి టీఆర్ఎస్ ఇత‌ర పార్టీల నేత‌ల్ని లాగేసింది. దీంతో 2018లో కూడా మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చింది.

ఈసారి త‌మ బ‌లం కంటే కెసిఆర్ బ‌ల‌హీన‌త‌ల‌పైనే కాంగ్రెస్ ఆశ పెట్టుకుంది. ఆయ‌న వ్య‌తిరేక‌త తీవ్రంగా వుంద‌ని, కుటుంబ పాల‌న‌ని జ‌నం వ్య‌తిరేకిస్తున్నార‌ని , ఇదే స‌రైన అద‌ను అనుకుంటోంది. కెసిఆర్ బ‌ల‌హీన‌ప‌డింది వాస్త‌వ‌మే కానీ, ఓడిపోయేంత బ‌ల‌హీనంగా వున్నారా అనేది ప్ర‌శ్నార్థ‌కం. 

ముక్కోణ‌పు పోటీలో వ్య‌తిరేక ఓటు చీలి లాభ‌ప‌డ‌తారా అనేది కూడా చూడాలి. అయితే జ‌నం తెలివైన వాళ్లు. కెసిఆర్‌ని ఓడించ‌ద‌లుచుకుంటే కాంగ్రెస్‌, బిజెపిల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుంటారు త‌ప్ప రెండింటిని కాదు. హంగ్ ఇచ్చే అల‌వాటు తెలుగు రాష్ట్రాల‌కు లేదు.

మొన్న‌టి రాహుల్ ప్ర‌సంగాన్ని గ‌మ‌నిస్తే ఫోక‌స్ అంతా టీఆర్ఎస్‌పైనే వుంది. బిజెపిని ప‌ట్టించుకోలేదు. టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌ల‌తో పాటు తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో చెప్పారు. కాంగ్రెస్ నాయ‌కుల‌కి జ‌నంలో వుండాల‌ని హిత‌వు చెప్పారు.

అమిత్‌షా ప్ర‌సంగం వేరే వుంది. తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో చెప్ప‌లేదు (బాయిల్డ్ రైస్ కొన‌డం త‌ప్ప‌). టీఆర్ఎస్‌ని అధికారంలోకి రానివ్వ‌మ‌ని చెప్పారు. కేంద్రం చాలా డ‌బ్బులిచ్చిందని చెప్పారు. (కేంద్రం వూరికే ఇవ్వ‌దు. రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ఆదాయాన్నే ఇస్తుంది. రాష్ట్రాల‌న్నీ క‌లిస్తే  కేంద్రం త‌ప్ప‌, దానికి ప్ర‌త్యేక ఉనికి వుండ‌దు)

దీనికి కౌంట‌ర్‌గా టీఆర్ఎస్ కూడా విజృంభించింది. లెక్క‌లు చూపించి ఇంకా ఇవ్వాల్సింది ఎంతో చెప్పింది. రాహుల్‌ని కెటిఆర్ విమ‌ర్శిస్తూ ప‌బ్‌లు త‌ప్ప వ్య‌వ‌సాయం తెలీద‌న్నారు. ప‌బ్‌లు కూడా సంస్కృతిలో భాగ‌మైపోతున్నాయి. కొత్త త‌రం నాయ‌కులంతా ఆ సంస్కృతితో ప‌రిచ‌యమున్న‌వాళ్లే. రాహుల్ ప‌బ్‌కి వెళ్ల‌డ‌మే దేశ ద్రోహ‌మైతే హైదారాబాద్‌లో ఇన్ని ప‌బ్‌ల‌కి లైసెన్స్‌లు ఎందుకిచ్చిన‌ట్టు?

జీఆర్ మ‌హ‌ర్షి

Show comments