సినిమా రివ్యూ: నర్తనశాల

రివ్యూ: నర్తనశాల
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: ఇరా క్రియేషన్స్‌
తారాగణం: నాగశౌర్య, కష్మీరా, అజయ్‌, జయప్రకాష్‌ రెడ్డి, యామిని భాస్కర్‌, శివాజీ రాజా, సుధ, రాజేష్‌ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు
ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌
నిర్మాత: ఉష ముల్పూరి
రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ చక్రవర్తి
విడుదల తేదీ: ఆగస్ట్‌ 30, 2018

నర్తనశాల టైటిల్‌ని బట్టి, రిలీజ్‌ చేసిన టీజర్‌ని బట్టి ఇందులోని కథానాయకుడు 'బృహన్నల' తీరున వుంటాడని, తద్వారా బోలెడంత వినోదం పండుతుందని అంచనాలు ఏర్పడతాయి. అయితే ఈ సినిమా టైటిల్‌ కానీ, టీజర్‌ కానీ సూచించిన తరహా వినోదమయితే కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో 'గే' అని చెప్పుకుని ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవాలని చూసిన కథానాయకుడు అలా చెప్పిన అబద్ధం కారణంగా మరింత పెద్ద చిక్కులో పడిపోతాడు. దీని కోసం కథానాయక పాత్రని విచిత్రంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అమ్మాయిల మధ్య పెరిగిన కారణంగా అతడికి వారి పట్ల ఎటువంటి ఫీలింగ్స్‌ కలగడం లేదని, పెళ్లికి కూడా ఇష్టపడడం లేదని చాలానే సమయం వృధా చేస్తారు. కానీ ఆ లక్షణాల ప్రభావం ఏమీ లేకుండా అతడు ఇట్టే ఒక అమ్మాయిని ప్రేమించేస్తాడు.

పాయింట్‌ అయితే అనుకున్నారే తప్ప దానిని ఏ విధంగా డీల్‌ చేయాలి, ఎలా చేస్తే కామెడీ పండుతుంది అనే దానిపై కనీస కసరత్తు కూడా చేసినట్టు లేరు. ప్రథమార్ధంలో చాలా సన్నివేశాలు ఒకదానితో ఒకదానికి సరయిన కనక్షన్‌ లేకుండా సాగిపోతుంటాయి. హీరోయిన్‌తో హీరో పరిచయం కోసం ఒక సుదీర్ఘమైన కామెడీ (అనుకోవాలి) సన్నివేశం ఒకటి వచ్చి పోతుంది. ఆ సన్నివేశం ముగిసేసరికే హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రేమించేసుకుంటారు (ఇదీ అనుకోవాలి). ఈలోగా మరో అమ్మాయి రోడ్డుపై కొందరిని చితగ్గొట్టడం చూసి ఆమెకి కితాబిచ్చి, సెల్ఫీ దిగుతాడు. అంతే ఆ ఫోటో చూసి అతని తండ్రి ఆమెతో సంబంధం కుదిర్చేస్తాడు.

అసలే రౌడీల ఇంటికి చెందిన ఆ అమ్మాయితో పెళ్లి తప్పించుకోవడానికి గే అంటూ అబద్ధం చెప్తాడు. హీరో 'పొత్రంగాడు' (గేకి ఇందులో పెట్టుకున్న ముద్దుపేరు) అని తెలిసి ఛీ పొమ్మని అతను అంటే, అతని కొడుకులోని 'పొత్రంగాడు' బయటకి వచ్చి పెళ్లంటూ చేసుకుంటే ఇతడినే చేసుకుంటానంటాడు. అక్కడ్నుంచి అన్ని పాత్రలని ఒకే ఇంట్లోకి చేర్చి కామెడీతో కాలక్షేపం చేసే కాలం చెల్లిపోయిన శ్రీను వైట్ల ఫార్ములా స్టార్ట్‌ అవుతుంది. నవ్వించడానికి స్కోప్‌ చాలానే వున్న సబ్జెక్ట్‌ ఇది. అయితే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మినహా కంటెంట్‌ లేకపోవడంతో, దానికి ముందు, వెనకా అల్లుకుంటూ పోయిన కథ, కథనాలు దయనీయంగా తయారయ్యాయి.

చివరకు హీరో పాత్రచిత్రణ కూడా సెట్‌ అవలేదు. ఆరంభ సన్నివేశాలు చూస్తే ఏదో పెద్ద సాహసానికే పూనుకున్నారనిపిస్తుంది కానీ ముందుకి వెళ్లే కొద్దీ ఆ పాయింట్‌కి అసలు వెయిటే వుండదు. ఇంటర్వెల్‌ తర్వాత కూడా సదరు 'గే' కాన్సెప్ట్‌ క్లయిమాక్స్‌కి చేర్చడానికి తప్ప కథలో ప్లే చేసే రోల్‌ ఏమీ లేదు. నాగశౌర్య గత చిత్రంలో కూడా కథ ఏమీ వుండదు. సెట్టింగ్‌ కూడా చాలా రొటీన్‌గానే అనిపిస్తుంది. అయితే కామెడీ బ్రహ్మాండంగా పేలడం వలన ఆ చిత్రం అంత సక్సెస్‌ అయింది. 'నర్తనశాల' కూడా అలా అవగల సత్తా వున్న సబ్జెక్ట్‌ అని నాగశౌర్య, అతని తల్లిదండ్రులు (నిర్మాతలు) భావించడంలో తప్పులేదు కానీ కామెడీ పండించలేకపోతే ఫలితం ఎలాగుంటుందనేది దీంతో తెలిసి వస్తుంది.

టీజర్‌ చూసినపుడు నాగశౌర్య ఏదో పెను సాహసమే చేసేసాడనే భావన కలిగినా, సినిమాలో అతని పాత్ర చాలా పేలవంగా తయారైంది. అతను కూడా అన్యమనస్కరగా నటించినట్టే అనిపిస్తుంది. ఏ దశలోను అతనిలో ఎనర్జీ గోచరించలేదు. సన్నివేశాలు పేలవంగా వున్నపుడు ఎలాంటి నటుడికైనా నీరసం వచ్చేస్తుంది. 'కళామందిర్‌ కళ్యాణ్‌'గా శివాజీరాజా అవసరానికి మించిన నటనతో విసిగిస్తే, ఆ పేరు పెట్టినందుకు గాను బ్రాండ్‌ ప్లేస్‌మెంట్లతో ఈ సినిమాని కళామందిర్‌కి ఒక ట్రిబ్యూట్‌లా మార్చేసారు. మిగిలిన నటుల్లో జయప్రకాష్‌రెడ్డి అక్కడక్కడా నవ్వించినా కానీ చాలా సందర్భాల్లో లౌడ్‌ కామెడీతో చెవుల తుప్పు వదలకొట్టాడు. హీరోయిన్ల పాత్రలు అలా మెరిసి మాయమవుతుంటాయి. కష్మీరా, యామిని ఇద్దరూ కూడా పాటల్లో తప్ప తమ ఉనికి నిలుపుకోలేకపోయారు.

'ఛలో' సినిమాకి క్రేజ్‌ తెచ్చిపెట్టిన 'చూసీ చూడంగానే' పాటలాంటిది మళ్లీ చేయడంలో మహతి స్వర సాగర్‌ విఫలమయ్యాడు. ఇందులోని పాటలు అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. యమ ఖర్చయ్యిందని శౌర్య చెప్పుకున్నాడు కానీ పాటలు మినహా మిగతా చోట్ల తెరపై అది అంతగా కనిపించలేదు మరి. ప్రతి డైలాగ్‌తోను నవ్వించాలనే విఫలయత్నం జరిగింది. దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి తనకొచ్చిన ఐడియాతో ఎక్సయిట్‌ అయి, దానికి క్లాసిక్‌ టైటిల్‌ పెట్టేసి... ఈ ఐడియా తన జీవితాన్ని మార్చేస్తుందని సంబరపడి వుంటాడు. అయితే ఐడియాలతో సినిమాలు ఆడేయవని, రెండు గంటల పాటు ప్రేక్షకులని కూర్చోబెట్టడం ఎంత కష్టమో వివిధ సమయాల్లో థియేటర్‌ వదిలిపోతున్న వారిని చూసి తెలుసుకుంటాడు.

నవ్వించడానికి అనువైన కథ కుదిరినంత మాత్రాన నవ్వించగలగడం తేలిక కాదని, వినడానికి వినోదాత్మకంగా తోచిన పాయింట్‌ని ఒక మంచి సినిమాగా మలచలేనపుడు నవ్వించకపోగా నవ్వులపాలు కావాల్సి వస్తుందని 'నర్తనశాల' చాటి చెబుతుంది. ఏ దశలోను ఆసక్తి కలిగించకుండా, ప్రతి సన్నివేశంతోను తదుపరి సన్నివేశం చూడాలనే ఉత్సాహాన్ని హరించేస్తూ, లోపలకి వెళ్లిన కాసేపటికే బయటకి వెళ్లే దారెటో తెలుసుకోవాలనిపిస్తూ... ఎలాంటి సినిమాలో అయినా ఎండ్‌ టైటిల్స్‌ రోల్‌ అయితే కానీ కదలని సినిమా వీరాభిమానులకి కూడా ఎప్పటికప్పుడు బయటకి వెళ్లిపోవాలనే కోరిక కలిగిస్తూ... ఈ నర్తనశాల పెట్టే నరకయాతనని మాటల్లో చెప్పడం కష్టమే సుమీ.

బాటమ్‌ లైన్‌: నవ్వులపాలు!
-గణేష్‌ రావూరి