నారాలోకేష్‌ ముచ్చట తీరిపోతుందా.?

అసలే 'పప్పు' అనే విమర్శల్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక నానాతిప్పలూ పడ్తున్న నారాలోకేష్‌, ఈ క్రమంలో తప్పు మీద తప్పు చేసేస్తున్నారు. వేదికలపై ఆయన మాట్లాడేటప్పుడు ఎడా పెడా తప్పులు దొర్లేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఆయనగారి నిర్వాకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడేసి, తన స్థాయిని పెంచేసుకోవాలన్న 'తొందరపాటు' తప్ప, పద్ధతిగా ఆలోచించి మాట్లాడటం పాపం నారా లోకేష్‌కి చేతకావడంలేదాయె.!

కేంద్రం, ఆదాయపు పన్ను శాఖనీ, సీబీఐనీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌నీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రయోగించబోతోందనీ, తద్వారా టీడీపీని దెబ్బ తీయాలనుకుంటోందనీ తెలుగు తమ్ముళ్ళు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. బీజేపీతో స్నేహాన్ని తెగతెంపులు చేసుకున్నప్పటినుంచీ చంద్రబాబుదీ ఇదేవరస. అప్పుడప్పుడూ నారా లోకేష్‌ కూడా తండ్రి బాటలోనే బీజేపీపై ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం విదితమే. అయితే, తాజాగా ఏపీలో జరిగిన, జరుగుతున్న ఐటీ దాడులపై నారా లోకేష్‌ ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించేశారు.

మీడియాతో ఈ అంశాలపై నారా లోకేష్‌ మాట్లాడుతున్న సమయంలో, ఆయనలోని ఆవేశం.. అత్యుత్సాహం.. అన్నీ బయటపడిపోయాయి. ఐటీదాడులు జరిగి, టీడీపీ నేతలెవరయినా అరెస్టయి వుంటే నారా లోకేష్‌ ఇంకెంత అత్యుత్సాహానికి గురయ్యేవారోగానీ.. అక్కడికేదో, చంద్రబాబు మీదనే ఐటీదాడులు జరిగినంతగా నారా లోకేష్‌ హడావిడి చేసేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయ్‌.? అంటూ నారా లోకేష్‌ ప్రశ్నించేశారు.

గడచిన నాలుగేళ్ళలో బీజేపీపై ఈగ వాలనివ్వకుండా చూసుకోవడంలో తెలుగుదేశం పార్టీ చూపిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. 'మా బంధం ఎవరూ విడదీయలేరు..' అంటూ చంద్రబాబు, నారాలోకేష్‌ - బీజేపీతో స్నేహంపై పలికిన ప్రగల్భాలు అన్నీ ఇన్నీ కావు. 'మా స్నేహాన్ని విడదీసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది.. అంటూ ఆరోపించేశారు. ఆ పప్పులు ఉడకనివ్వబోమనీ శపథాలు చేసేశారు. చివరికి ఏమయ్యింది.? బంధం తెగింది.

వైసీసీ - బీజేపీ కుట్ర.. జనసేన - బీజేపీ కుట్ర.. అంటూ కొత్త కథల్ని టీడీపీ విపరీతంగా ప్రచారంలోకి తెచ్చేసింది. బీజేపీతో నాలుగేళ్ళు అంటకాగిందెవరు.? టీడీపీనే కదా.! ఇది జనానికి తెలుసన్న వాస్తవాన్ని ఒప్పుకునేందుకూ నారాలోకేష్‌ సహా టీడీపీ నేతలెవరూ సాహసించరాయె. చంద్రబాబుని దెబ్బతీయాలని బీజేపీ అనుకుంటే, ఐటీదాడులు హెరిటేజ్‌ మీదనే తొలుత జరిగేవి. లోకేష్‌బాబుకి ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే ఎలా.?

ఒక్కటి మాత్రం నిజం.. కేంద్రంలోని మోడీ సర్కార్‌, చంద్రబాబుని టార్గెట్‌ చేసింది. అయితే, ఇంకా 'ఆపరేషన్‌' ప్రారంభం కాలేదు. ఆపరేషన్‌ చేపడితే, రాష్ట్రంలో టీడీపీ ఇమేజ్‌ పెరుగుతుందేమోనన్న పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ దగ్గరే బీజేపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు ఆలోచనల్లో తలమునకలైపోయినట్లు కన్పిస్తోంది.

కానీ, బీజేపీకి ఆ ఛాన్స్‌ ఇచ్చేలాలేరు తెలుగు తమ్ముళ్ళు.. మరీ ముఖ్యంగా నారాలోకేష్‌ వాలకం చూస్తోంటే, 'ఆ ముచ్చట ఏదో' చూసేద్దాం.. అన్నట్టుంది కదూ.! రాజకీయాల్లో అపరిపక్వతకు నిదర్శనమిది. కేంద్రం ఆపరేషన్‌ మొదలు పెడితే, మొట్టమొదటి వికెట్‌ నారా లోకేష్‌దేనని తెలుగు తమ్ముళ్ళే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకుంటుండడం కొసమెరుపు.

Show comments