పుష్కరాలకు-'హోదా'కు సంబంధం ఉందా?

ఇదేమిటి? రెండింటికీ సంబంధం ఎలా ఉంటుంది? పుష్కరాలు అనేది ఆధ్యాత్మిక ప్లస్‌ ధార్మిక కార్యక్రమం. హిందువుల సంస్కృతీ సంప్రదాయాలకు, విశ్వాసాలకు సంబంధించింది. దీన్నొక పవిత్ర కార్యంగా భావిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది రాజకీయ ప్లస్‌ ప్రభుత్వ నిర్ణయం. ఒకటి ధార్మికం. మరొకటి రాజకీయం. రెండింటికీ సంబంధం లేదు. కాని కొందరు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు ధార్మిక కార్యక్రమాలకు, సామాజిక, ఆర్థిక మార్పులకు, రాజకీయ నిర్ణయాలకు ముడిపెడుతుంటారు. ఇది కలికాలమనే విషయం వారు మర్చిపోతున్నారు. 'సత్తె' కాలంలో అంటే ధర్మాలు, నైతిక విలువలు తు.చ.తప్పకుండా పాటించే కాలంలో ధార్మిక కార్యక్రమాలకు పవర్‌ ఎక్కువుండేదేమో....! 

అందుకే అప్పట్లో విశ్వశాంతి కోసమని, లోకకళ్యాణం కోసమని యజ్ఞాలు,యాగాలు, ఏవేవో పూజలు చేస్తుండేవారు. ఆ కాలంలో దైనందిన కార్యకలాపాలను కూడా పవిత్ర భావనతో చేస్తుండేవారు. ఇదంతా యుగాల కిందటి సంగతి. ఇప్పుడు సమాజం మారిపోయింది. ధార్మిక కార్యక్రమాల వల్ల సమాజంలో మంచి మార్పులు కలుగుతాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే చెప్పుకోవాలి. పాలకులు నిర్ణయాలు, విధానాల కారణంగానే మంచిగానో, చెడుగానో మార్పు చెందుతుంది. ఈ కాలంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే అవుననే వారు ఎందరున్నారో, కాదనేవారు అందరుంటారు. ఇది వ్యక్తిగత విశ్వాసం. 

సరే...అసలు విషయానికొస్తే పుష్కరాల సందర్భంగా స్వామీజీల్లో ఒకరైన విశ్వయోగి విశ్వంజీ మహరాజ్‌ పుష్కరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో చెప్పారు. కృష్ణా పుష్కరాల ప్రభావంతో రాష్ట్రానికి మహర్దశ పడుతుందన్నారు. శక్తిమంతమైన రాష్ట్రంగా తయారవుతుందన్నారు. ఇక నుంచి కేంద్రం నుంచి అన్ని శుభవార్తలే అందుతాయన్నారు. రాష్ట్రానికున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నారు. ఇదంతా చెప్పిన స్వామీజీ  'ఆంధ్రప్రదేశ్‌ కేంద్రం నుంచి ఏదైతే ఆశిస్తున్నదో అది త్వరలోనే నెరవేరుతుంది' అని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రం ఆశించేదేమిటి? ప్రధానమైంది ప్రత్యేక హోదా. అది వస్తుందని స్వామీజీ అభిప్రాయం ప్లస్‌ నమ్మకం. ఇన్నాళ్లు రాని హోదా దేనివల్ల వస్తుందట? పుష్కరాల ప్రభావంతో వస్తుందట...!

ఇదెలా సాధ్యమో స్వామీజీకే తెలియాలి. ఇందుకు ఆయన దగ్గర ఉన్న ఆధారాలేమిటో చెబితే బాగుంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని తెగేసి చెప్పిన కేంద్రం అంతకు మించి ప్యాకేజీ ఇస్తానంటోంది. ఇస్తే గిస్తే అదే ఇస్తుంది తప్ప హోదా ఇవ్వదు. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ప్యాకేజీపైనే ప్రచారం చేస్తున్నారు. సమాజంలో మార్పులు ఎందుకొస్తున్నాయి? సొసైటీ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి తగిన విశ్లేషణ, కారణాలు ఉంటాయి. ఇదంతా రాజకీయాలతో, ప్రభుత్వ విధానాలతో, అంతర్జాతీయంగా జరిగే మార్పులతో లేదా పరిణామాలతో ముడిపడివుంటుంది. అంతే తప్ప  మహిమలు పనిచేయవు. 

కృష్ణా పుష్కరాలు హోదా తీసుకురాలేవు. అందులోనూ పుష్కరాలు ఏపీకి మాత్రమే పరిమితం కాదు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. మరి పుష్కరాల ప్రభావం అక్కడా ఉంటుందా? ఆ రాష్ట్రాలకూ కేంద్రం నుంచి కానుకలు, వరాలు అందుతాయా? ఈమధ్య ఓ ఆధ్యాత్మిక ఛానెల్లో ఒకాయన పుష్కరాల గురించి చెబుతూ పుష్కరాలు నిర్వహించడంలో అసలు ఉద్దేశం నదులను శభ్రం చేయడమని (పూర్వకాలంలో) చెప్పాడు. పన్నెండేళ్లకోసారి నదులను శుభ్రం చేయాలనే ఆలోచనతోనే పెద్దలు లేదా రుషులు పుష్కరాలు నిర్వహించాలని నిర్దేశించారని చెప్పాడు. పూర్వులు ప్రకృతిని ప్రేమించేవారు. 

వాతావరణాన్ని కలుషితం చేయడం పాపంగా భావించేవారు. కాబట్టి పుష్కరాలకు ఈ అర్థం కూడా ఉండొచ్చు. కాని ఇప్పుడు పుష్కరాల కారణంగా నదులు కలుషితమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పాలకులు, మీడియా చేస్తున్న అతి ప్రచారం. పుష్కరాలకు జనం తక్కువొస్తే దాన్నొక వైఫల్యంగా భావిస్తున్నారు. దీన్ని ధార్మిక కార్యక్రమంగా కాకుండా, పిక్నిక్‌లా, టూరిజం ప్రోగ్రాంలా చూస్తున్నారు. పుష్కరాల పేరు చెప్పుకొని టూరిజం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. పుష్కరాల కారణంగా సర్కారుకు వివిధ రూపాల్లో ఆదాయం వస్తుందేమోగాని ప్రత్యేక హోదా రావడం సాధ్యం కాదు.

Show comments