మహారాష్ట్ర క్లైమాక్స్.. ఈ రోజే!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సాగుతున్న హైడ్రామాకు నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఒక్కో పార్టీనే ఆహ్వానిస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్. ఇప్పటి వరకూ ఎవరూ గవర్నర్ కు తమ ఎమ్మెల్యేల లిస్టు ఇవ్వలేదు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఫలానా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారని వారు ధీమాగా చెప్పడం లేదు. 

ముందుగా బీజేపీని పిలిచారు గవర్నర్. అతి పెద్ద పార్టీగా వారికి మొదటి అవకాశం ఇచ్చారు. అయితే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకోలేదని బీజేపీ స్పష్టం చేసింది. తమకు కనీస మెజారిటీ లేదని ఆ పార్టీ తేల్చింది.

ఇక రెండో అవకాశం శివసేనకు దక్కింది. రెండో పెద్ద  పార్టీగా ఆ పార్టీని  గవర్నర్ ఆహ్వానించారు. అయితే తమకు మరింత గడువు కావాలని కోరినట్టుగా శివసేన పేర్కొంది. ఆ గడువు గవర్నర్ ఇవ్వలేదని కూడా ఆ పార్టీనే తేల్చింది.

ఇక మూడో అవకాశం ఎన్సీపీకి దక్కింది. నేటి రాత్రి ఎనిమిదిన్నర లోగా ఎన్సీపీ ఏదో ఒకటి గవర్నర్ కుచెప్పాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎన్సీపీ స్పందిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖమే అని, వీలైనంత త్వరగా అందుకు  అన్ని ఏర్పాట్లూ చేసుకుంటామని ఆ పార్టీ అంటోంది.

ఎన్సీపీకి కాంగ్రెస్ మద్దతు దాదాపుగా ఉన్నట్టే, కాంగ్రెస్ కూడా అధికారం విషయంలో ఆకలితో ఉంది. అయితే ఈ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. శివసేన అవసరం ఉంది. శివసేనకు కావాల్సింది సీఎం సీటు! మరి వీరిలో ఎవరు ఏం దక్కించుకుంటారు? ఎలా ఒక ఒప్పందానికి వస్తారనేది ఈ రోజుతో తేలిపోవాల్సి ఉంది!

Show comments