తండ్రీకొడుకుల తప్పుడు ప్రకటనలు.. దొందూ దొందే

ఎన్నికలకు వెళ్లాలంటే ఎడంచేత్తో రాజీనామా విసిరేసి బరిలో దిగేరకం కేసీఆర్. తెలంగాణ కోసం ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లిన చరిత్ర టీఆర్ఎస్ నాయకులది. 2014లో కూడా ఎన్నికల ముందు ఎక్కడి లేని ధైర్యంతో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదు. కేసీఆర్ సహా.. మిగతా నేతల్లో కూడా తెలియని భయం ఆవహించింది.

ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే రాజకీయ సన్యాసం అంటూ రెచ్చిపోతున్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రకటించేశారు.

ఎవరైనా నా సవాల్ ని స్వీకరించండి అంటూ ఒకటికి పదిసార్లు చెప్పిందే చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరినా ఆయన స్పందించకపోయే సరికి పదే పదే తన ప్రసంగాల్లో రాజకీయ సన్యాసం అనే మాటను ఒత్తి పలుకుతున్నారు.

ప్రజల కష్టాలు తీర్చాలనుకునే నాయకుడు గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉండాలి. ఓటమి సాకుతో రాజకీయ సన్యాసం తీసుకునే నాయకుడు జనాలకి అవసరమా అని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఈ మాటలు కేటీఆర్ చెవికెక్కాయో లేవో తెలియదు కానీ ఆయన మాత్రం సవాళ్లను ఆపలేదు. ఇదిగో ఇప్పుడు తండ్రి కేసీఆర్ వంతువచ్చింది.

ఓడిపోతే కొడుకు సన్యాసం తీసుకుంటానని చెబితే, తండ్రి హాయిగా విశ్రాంతి తీసుకుంటానని అంటున్నాడు. అసలు ఓటమి ఆలోచన ఈ తండ్రీకొడుకులకు ఎందుకొచ్చిందో తెలియదు కానీ ఒకరు రాజకీయ సన్యాసం, ఒకరు విశ్రాంతి అంటూ బాగా సెలవిచ్చారు.

గెలిపిస్తే ఏంచేస్తారో చెప్పండి మహా ప్రభో అని జనం అడుగుతుంటే, ఓడిపోతే ఏం చేస్తామో ఈ తండ్రికొడుకులు చెబుతుంటే జనాలు అవాక్కవుతున్నారు. ప్రసంగాల పేరుతో ప్రత్యర్థుల చేతికి ఇలా రోజుకో ఆయుధం ఇస్తున్నారు తండ్రీకొడుకులు.

కేసీఆర్ మాటలు వింటుంటే.. ఇన్నాళ్లూ ఆయన చేసిన పోరాటం ప్రత్యేక తెలంగాణ కోసం కాదు, కేవలం తెలంగాణ ద్వారా వచ్చే అధికారం కోసమే అని స్పష్టమవుతుంది. అధికారం లేకపోతే విశ్రాంతి, అధికారం ఉంటే మాత్రం ప్రజా శ్రేయస్సు కోసం ఎడతెగని కృషి.. ఇదీ కేసీఆర్ సిద్ధాంతం.

ఈ సిద్ధాంతం మాట ఎలా ఉన్నా.. పాపం కేసీఆర్ వయసుని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ ను ఓడించి, ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని మహాకూటమి అప్పుడే సెటైర్లు స్టార్ట్ చేసింది.

తెలంగాణ రాజ్యానికి రాజు ఎవరో తెలుసా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments