కేటీఆర్.. ఒక విక్రమార్క సింహాసనం!

ఒక చిన్న కథ చెప్పుకోవాలి...
ఓసారి భోజరాజు సేనతో కలిసి వేటకు వెళుతున్నాడు. ఓ మొక్కజొన్న పొలం పక్కనుంచి వెళ్లడం తటస్థించింది. ఆ మొక్కజొన్న పొలంలో మంచె మీద నిల్చుని, తోటను కాపలా కాస్తున్న రైతు రాజును గమనించి.. ‘రాజా నా పొలం పక్కనుంచి వెళుతూ నా ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్తావా.. రండి వచ్చి.. నా మొక్కజొన్న కంకులు ఆరగించండి’ అని పిలిచాడు.

అతడి అభ్యర్థన మన్నించి.. రాజు, పరివారం తోటలోకి వచ్చి కంకులు విరుచుకుని తినసాగారు. దాన్ని గమనించిన రైతు హఠాత్తుగా మంచె మీదనుంచి కిందికి దిగి.. ‘‘మీరేమిటి రాజులా.. దోపిడీ దొంగలా.. నా పంటను నాశనం చేస్తున్నారే’’ అంటూ గగ్గోలు పెట్టాడు. రాజు నివ్వెరపోయి అక్కర్లేదనుకుని.. అందరూ బాటమీదకి వచ్చి ప్రయాణం సాగించారు.

ఈలోగా రైతు మంచె మీదకు ఎక్కి, రాజును చాలా ప్రేమగా, గౌరవంగా మళ్లీ ఆహ్వానించాడు. రాజు తోటలోకి అడుగుపెట్టగానే.. మంచె దిగివచ్చి.. నానా గోలచేశాడు. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. రాజుకు అవమానంతో పాటు అనుమానం కూడా కలిగింది. ఆ ‘‘మంచె’’లోనే ఏదో రహస్యం ఉన్నదని అనిపించింది. మంచె పైన ఉంటే ప్రేమగా మాట్లాడుతున్న రైతు, మంచె దిగి కిందికి రాగానే నానా మాటలు అంటున్నాడని గుర్తించాడు.

అక్కడికక్కడే రైతుకు మూల్యం చెల్లించి పొలం కొనేశాడు. మంచె ఉన్న ప్రదేశంలో సైనికులతో తవ్వించాడు. మంచె దిగువన భూగర్భంలో పాతిపెట్టబడి ఉన్న ఓ సింహాసనం కనిపించింది. పండితులకు చూపిస్తే.. ‘‘రాజా ఇది విక్రమార్క సింహాసనం. దీని మీద నిల్చున్నప్పుడు రైతు కూడా రాజులాగా దాతృత్వంతో ప్రకాశించాడు. దీని నుంచి పక్కకు రాగానే మామూలు రైతులా గోలచేశాడు’’ అని చెప్పారు. దాంతో భోజరాజు ఆ సింహాసనాన్ని తన ఆస్థానానికి తీసుకువెళ్లాడు.
==
ఇదీ కథ.
==

కేటీఆర్ ఇప్పుడు ఈ తరహాలోనే మాట్లాడుతున్నారు. ఏ మహబూబ్ నగర్ లోనో, ఏ ఆలేరులోనో పార్టీ మీటింగ్ పెడితే.. ఆయన చంద్రబాబునాయుడును నానా దూషణలతో తూర్పారపట్టేస్తారు. అదే కూకట్ పల్లిలోనో, శేరిలింగం పల్లిలోనో మీటింగ్ పెడితే చాలా సాఫ్ట్ గా చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు, రాజకీయ వైరుధ్యం మాత్రమే.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు.

తను మాట్లాడే సభలో సీమాంధ్రుల ఓట్లు కాసిని ఉంటాయని అనిపిస్తే చాలు.. కేటీఆర్ లో చంద్రబాబు మీద ప్రేమ, అభిమానం, మెతకమాటలు పొంగుకొచ్చేలా కనిపిస్తోంది. విక్రమార్క సింహాసనం ఎక్కినట్టుగా.. ఆయన- చంద్రబాబు అనే  ఒకే టాపిక్ మీద వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు షేడ్స్ చూపిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments